వరద కాలువ టెండర్లు రద్దు

15 Oct, 2016 00:44 IST|Sakshi

ప్రొద్దుటూరు: వైఎస్సార్‌ జిల్లాలో కుందూ–పెన్నా వరద కాలువ నిర్మాణానికి సంబంధించిన టెండర్లు శుక్రవారం చివరి నిమిషంలో రద్దయ్యాయి. రూ.112 కోట్ల విలువైన ఈ పనుల టెండర్ల నిర్వహణలో జరిగిన లోటుపాట్లపై సర్వత్రా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్‌ అధికారులు టెండర్‌ను రద్దు చేశారు. టెండర్‌ నోటిఫికేషన్‌లో జరిగిన తప్పులను సరిదిద్ది త్వరలో మళ్లీ జారీ చేసేందుకు ఇంజనీరింగ్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  వివరాలిలా వున్నాయి. ప్రొద్దుటూరు పట్టణానికి మంచినీరు అందించేందుకు మొత్తం రూ.183కోట్ల వరద కాలువ నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతం రూ.112కోట్లతో పనులు చేపట్టేందుకు అధికారులు టెండర్లు నిర్వహించారు. భూసేకరణకు సంబంధించి అభ్యంతరం లేనిచోట పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచారు. అయితే టెండర్‌ నిబంధనల తీరుపై పలువురు కాంట్రాక్టర్లు ఇంజనీరింగ్‌ అధికారుల వ్యవహారశైలిని విమర్శించారు. టెండర్లు నిర్వహిస్తే కోర్టును ఆశ్రయించేందుకు కూడా కొందరు కాంట్రాక్టర్లు, నేతలు సిద్ధమయ్యారు. అలాగే పలువురు నేతలు కూడా ఈ నిబంధనల పట్ల అధికారులను ప్రశ్నించారు. అలాగే ఈ పనులను ఎలాగైనా దక్కించుకునేందుకు స్థానికంగా అధికారపార్టీ నేతలు తీవ్రస్థాయిలో పోటీపడ్డారు. చివరి రోజు కావడంతో శుక్రవారం హైదరాబాద్‌లోని చీఫ్‌ ఇంజనీర్‌ కార్యాలయానికి వెళ్లారు. విమర్శలు వెల్లువెత్తడంతో టెండర్‌లో పొరపాట్లను గమనించిన  ఇంజనీరింగ్‌ అధికారులు శుక్రవారం సాయంత్రం 3.30 ప్రాంతంలో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ టెండర్‌కు పోటీపడిన తెలుగు తమ్ముళ్లు నిరాశతో వెనుదిరికి వచ్చారు.
మార్పులు చేయాల్సి ఉంది: ఎస్‌ఈ
ఈ విషయంపై చిన్ననీటిపారుదల శాఖ జిల్లా ఎస్‌ఈ శంకర్‌రెడ్డిని సాక్షి వివరణ కోరగా కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌ నిబంధనల ప్రకారం జాయింట్‌ వెంచర్లు టెండర్‌లో పాల్గొనకూడదన్నారు. తమకు ఈ విషయం తెలియకపోవడంతో జాయింట్‌ వెంచర్లను కూడా ఆహ్వానించామన్నారు. అలాగే సర్ఫేస్‌ డ్యాం నిబంధనల్లో కూడా మార్పులు చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం రద్దయిన వరద కాలువ పనులకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుని వీలైనంత త్వరలో తిరిగి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు