వరద ఉధృతి తగ్గుముఖం

25 Sep, 2016 21:06 IST|Sakshi
వరద ఉధృతి తగ్గుముఖం
  • మున్నేరు నుంచి 25 వేల క్యూసెక్కుల నీరు
  • ప్రకాశం బ్యారేజీకి పెరిగిన సందర్శకులు
  •  

    రెండు రోజులుగా నిండుకుండలా కనిపించిన కృష్ణానదిలో నీటిమట్టం తగ్గుతోంది. వరద ఉధృతి నెమ్మదించడంతో పులిచింతల ఎగువ నుంచి వస్తున్న వరద నీరు తగ్గింది. దీంతో అధికారులు ప్రకాశం బ్యారేజీ దిగువకు వదిలే నీటిని తగ్గించారు. ప్రస్తుతానికి మూసీ నది నుంచి మాత్రమే కృష్ణానదిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. మూసి వరద తగ్గుముఖం పడితే యథాతథ స్థితికి చేరే అవకాశం ఉంది. 

     
    సాక్షి, విజయవాడ :  ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి వచ్చే వరద నీరు ఆదివారం తగ్గుముఖం పట్టింది. 1.33 లక్షల క్యూసెక్కులు వచ్చే నీరు 1,01,222 క్యూసెక్కులకు పరిమితమైంది. శనివారం బ్యారేజీ దిగువకు 1.50 లక్షల క్యూసెక్కులు వదలగా.. ఆదివారం కేవలం 93,240 క్యూసెక్కులు మాత్రమే వదులుతున్నారు. కాల్వలకు 7,982 క్యూసెక్కులు వదలిపెట్టారు. ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను రెండడుగుల ఎత్తుకు పరిమితం చేశారు. మున్నేరు నుంచి శనివారం 60 వేల క్యూసెక్కుల వరద నీరు రాగా.. ఆదివారం 25 వేల క్యూసెక్కులకు తగ్గినట్లు ఇరిగేషన్‌ ఇంజినీర్లు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే సోమవారం సాయంత్రానికి వరద ఉధృతి మరింత తగ్గవచ్చని అధికారులు భావిస్తున్నారు. పెనుగంచిప్రోలు, వేదాద్రి, ముక్త్యాలల్లో వరద నీటి ఉధృతి తగ్గుముఖం పట్టడంతో ఆయా గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 

    ఘాట్లకు సందర్శకుల తాకిడి..

    ఆదివారం సాయంత్రం ఆహ్లాదకరంగా ఉండడంతో పాటు సెలవు కూడా కావడంతో ప్రకాశం బ్యారేజీకి సందర్శకుల తాకిడి ఎక్కువైంది. సాధారణ రోజుల్లో బ్యారేజీ దిగువన ఇసుక తిన్నెలు మాత్రమే దర్శనమిస్తుంటాయి. అలాంటిది కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ సముద్రం వైపు దూసుకుపోవడాన్ని ప్రజలు తిలకించి పులకించారు. బ్యారేజీపై ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడుతున్నాయంటూ పోలీసులు వాహనాలను నిలవనివ్వలేదు. దీంతో పద్మావతి ఘాట్, కృష్ణవేణì , దుర్గా, పున్నమి ఘాట్ల వద్దకు సందర్శకులు వెళ్లారు. చిరు వ్యాపారాలు జోరుగా సాగాయి. 
     

    భవానీ ద్వీపానికి తగ్గిన సందర్శకులు

    కృష్ణానదికి వరద తాకిడి ఎక్కువగా ఉండడంతో భవానీ ద్వీపానికి వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గింది. వదరల కారణంగా నదిలోకి వెళ్లేందుకు ఆసక్తి కనపరచలేదు. నదిలో బోటింగ్‌ య«థావిధిగా సాగుతున్నప్పటికీ సందర్శకులు మాత్రం ఒకడుగుడు వెనక్కి వేశారు. సాధారణంగా వారాంతంలోను, సెలవు రోజుల్లోనూ 2,500 మంది ద్వీపానికి వస్తారు. ఆదివారం మాత్రం ఐదారు వందలకు మించి రాలేదు. బోటింగ్‌ ద్వారా పర్యాటక సంస్థకు రూ.లక్ష ఆదాయం రావాల్సి ఉండగా.. కేవలం రూ. 35 వేలకే పరిమితమైనట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.  
     
మరిన్ని వార్తలు