గోదావరికి పొంచివున్న వరద

26 Sep, 2016 03:48 IST|Sakshi

భద్రాచలం :  గోదావరికి వరద పోటెత్తే అవకాశం ఉండటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. భద్రాచలం వద్ద ఆదివారం 21 అడుగుల నీటిమట్టం నమోదైంది.  ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులూ వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.  గోదావరి నదిలోకి నీరు భారీగా చేరుతోంది. ఎగువ ప్రాంతంలోని ప్రాజెక్టు ల నుంచి కూడా భారీగా వరద నీటిని దిగువకు వదిలినట్లుగా అధికారులకు సమాచారం అందింది. మరో రెండు రోజుల్లో గోదావరికి ప్రమాద స్థాయిలో వరద నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం వద్ద 43 అడుగుల నీటిమట్టం నమోదైతే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 48 అడుగులకు రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులు వస్తే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతంలో భారీగా వరద నీరు చేరుతుండటంతో సోమవారం రాత్రికి భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక చేరువలో గోదావరి ప్రవహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజానీకాన్ని అప్రమత్తం చేశారు.

>
మరిన్ని వార్తలు