సర్వేలతో సరి

11 Jul, 2017 03:49 IST|Sakshi

గూడూరు డివిజన్లో వరదలతో ఆనవాళ్లు కోల్పోయిన  పొర్లుకట్టలు
2,643 ఎకరాల్లో ఇసుకమేటలు
3,670 ఎకరాల్లో దెబ్బతిన్న వరి
రూ.4.84 కోట్ల నష్టం
రెండేళ్లు గడిచినా  పరిహారం ఊసే లేదు


రెండేళ్ల క్రితం వచ్చిన వరదల్లో పలు నదుల పొర్లుకట్టల ఆనవాళ్లు కోల్పోయాయి. దీంతో వందల ఎకరాల్లో ఇసుక మేటలు వేసి బంగా రం పండించే పొలాలు ఎడారులుగా మారాయి. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని పాలకులు ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి. సర్వేలతో సరిపెట్టిన ప్రభుత్వం రెండేళ్లు పూర్తయినా ఇప్పటికీ ఏ ఒక్క రైతుకూ నష్టపరిహారం చెల్లించలేదు. పొర్లు కట్టలకు మరమ్మతులు చేపట్టకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గూడూరు: వరదల్లో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. వరదలకు కోసుకుపోయిన పొర్లుకట్టల మరమ్మతు పనులు పలు చోట్ల ఇంకా ప్రారంభించకపోవడంతో రానున్న వర్షాకాలంలో వరదలొస్తే తమ గతేం కావాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వచ్చిన వరదలతో పంటలు ధ్వంసం కావడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్న నదుల పొర్లుకట్టలు కొట్టుకుపోయి, పొలాల్లో ఇసుకమేటలు ఏర్పడ్డాయి. డివిజన్‌లోని చల్ల కాలువ, కైవల్యానది, పంబలేరు, మామిడి కాలువ, స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న పొలాలు వరద ఉద్ధృతికి కోసుకుపోయాయి.

3,670 ఎకరాల్లో దెబ్బతిన్న వరి
గూడూరు డివిజన్లో వరదలకు 3,670 ఎకరాల్లో వరిపంట దెబ్బతింది. దీనికి సంబం ధించి ఎకరాకు రూ.15వేలు చొప్పున మొత్తం రూ.2.2 కోట్లు రైతులకు పరిహారం ఇవ్వాల్సి ఉంది. అలాగే  2,643 ఎకరాల్లో ఇసుకమేటలు వేసంది. ఎకరాకు రూ.20 వేల చొప్పున రైతులకు ఇవ్వాల్సి ఉంది. మొత్తం రూ.2.64 కోట్లు చెల్లించాల్సి ఉంది. రూ.లక్షల విలువ చేసే బంగారం పండించే పొలాలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. కోట, వాకాడు మండలాల్లో కొంతమేర పనుల చేపట్టారు. పూర్తి స్థాయిలో ఇంకా జరగలేదు. అలాగే వరదలతో నష్టపోయినందుకు రైతులకు ఇప్పటి వరకూ పరిహారం ఇవ్వ లేదు. గూడూరు పట్టణ సమీపంలో ఉన్న పంబలేరు పొర్లుకట్టల పనులు ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయకపోతే వరద నీటితో నష్టపోయే ప్రమాదం ఉందని అన్నదాలు వాపోతున్నారు. రాబోయే వరదల ముప్పునుంచి తమ పొలాలను కాపాడాలని వారు కోరుతున్నారు.

ఇసుక మేటలతో పొలాలు నాశనం
రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు పలు చెరువులు తెగిపోయాయి. దీంతో వరదనీరు పంబలేరు, చల్లకాలువలు ఉద్ధృతంగా ప్రవహించాయి. దీంతో ఆయా నదుల పొర్లుకట్టలు పూర్తిగా కోసుకుపోయాయి. దీంతో వరదనీరు పొలాల మీదుగా పారి పొలాల్లో ఇసుకమేటలు వేశాయి. దీంతో ఇక పంటలు పెట్టే వీలే లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం అందజేస్తుందని, పొలాల్లో ఇసుక మేటలు తీయించుకుందామని ఎదురు చూసిన రైతులకు నిరాశే మిగిలింది. వరద ఉద్ధృతికి నదుల పొర్లుకట్టలు పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయాయి. పక్కనున్న పొలాలకు సమాంతరంగా నదులు పారాయి. దీంతో అక్కడక్కడా మలుపులవద్ద పొలాల్లోకే వరద నీరంతా పారి ఇసుకమేటలు వేసింది. దీంతో ఎకరా రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ పలికే పొలాలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పొర్లుకట్టలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

మంత్రి కళాశాలకు సమీపంలో పూర్తయిన పనులు
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ఇంజినీరింగ్‌ కళాశాల కూడా పంబలేరు నది ఒడ్డుకు సమీపంలో ఉంది. అయితే ఆ ప్రాంతంలో ఉన్న పొర్లు కట్టల పనులు మాత్రం పూర్తయ్యాయి. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం ఆ దిశగా పనులు ప్రారంభమైన దాఖలాలు లేవు. పరిహారం విషయం పక్కన పెట్టినా.. పొర్లుకట్టల పనులైనా త్వరితగతిన ప్రారంభించి తమ విలువైన పొలాలను, తమ జీవనాధారాన్ని కాపాడాలని రైతులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు