సందిగ్ధంలో ఎఫ్‌ఎన్‌సీసీ భవితవ్యం

27 Jul, 2016 18:31 IST|Sakshi

బంజారాహిల్స్: ఈ నెల 24న ఫిలింనగర్‌లోని ఫిలింనగర్ కన్వెన్షన్ సెంటర్ (ఎఫ్‌ఎన్‌సీసీ)లో పోర్టికో కుప్పకూలిన ఘటన వందలాది కుటుంబాలను రోడ్డున పడేసింది. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అలెర్టయ్యారు. ప్రధాన భవనంతో పాటు ఇటీవల నిర్మించిన కన్వెన్షన్ సెంటర్, పార్కింగ్‌స్థలంలో ఇండోర్ గేమ్స్ భవనం అన్నీ జీహెచ్‌ఎంసీ అనుమతులు లేకుండా నిర్మించినవేనని తేలింది.

 

దీంతో కన్వెన్షన్ సెంటర్‌ను పూర్తిగా కూల్చివేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఎఫ్‌ఎన్‌సీసీ ఆవరణలో ఇంకా అనుమతులు లేకుండా నిర్మించిన గదులను కూడా నేలమట్టం చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎఫ్‌ఎన్‌సీసీ మళ్లీ తెరుచుకోవడం కష్ట సాధ్యంగా మారింది. ఈ కారణంగా ఇందులో పని చేస్తున్న 350 కుటుంబాల వారు ఉపాధి కోల్పోయే ప్రమాదం తలెత్తింది. మూడు రోజులుగా ఎఫ్‌ఎన్‌సీసీ మూతపడటంతో ఇక్కడ పని చేస్తున్న ఉద్యోగులంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమకు ఉపాధి కల్పిస్తున్న ఎఫ్‌ఎన్‌సీసీని షరతులతో తెరవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


ఆ కమిటీ సంగతేంది?
ఎఫ్‌ఎన్‌సీసీలో పోర్టికో కూలి ఇద్దరు మృతి చెందిన ఘటనలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు మిగతా కార్యవర్గంపైన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసులు నమోదైన నేపథ్యంలో ఈ కమిటీ కొనసాగవచ్చా లేదా అన్నదానిపై ఇప్పుడు చర్చ సాగుతోంది. ఇదే కమిటీ కొనసాగితే విచారణ చాలా కష్టంగా ఉంటుందని రికార్డులు కూడా తారుమారయ్యే అవకాశాలున్నాయని కొందరు సభ్యులు ఆరోపిస్తున్నారు.


కొనసాగుతున్న పనులు...
కుప్పకూలిన పోర్టికో ప్రాంతం నుంచి శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 60 శాతం నిర్మాణ సామగ్రి మాత్రమే తొలగించగలిగారు. ఇనుపచువ్వలను పక్కకు తొలగించటం ఇబ్బందిగా మారిందని జీహెచ్‌ఎంసీ ఈఈ చెన్నారెడ్డి తెలిపారు. ఈ పని ఇంకో రెండు రోజులు పడుతుందని తెలిపారు.

>
మరిన్ని వార్తలు