ఆక్వా కార్మికుల భద్రతపై దృష్టి సారించాలి

17 Dec, 2016 03:35 IST|Sakshi
ఆక్వా కార్మికుల భద్రతపై దృష్టి సారించాలి

►  ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు తప్పనిసరి
► ప్రమాదాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు కార్మికులకు శిక్షణ కల్పించాలి
► ఏపీ ఫ్యాక్టరీస్‌ డైరెక్టర్‌ జీ బాలకిశోర్‌


ఒంగోలు: ఆక్వా కంపెనీల్లో పనిచేసే కార్మికుల భద్రతపై యాజమాన్యాలు ప్రత్యేక దృష్టిసారించాలని జాతీయ భద్రతా కౌన్సిల్‌ చైర్మన్, రాష్ట్ర ఫ్యాక్టరీస్‌ డైరెక్టర్‌ జీ బాలకిశోర్‌ యాజమాన్యాలను ఆదేశించారు.  శుక్రవారం స్థానిక హోటల్‌ సరోవర్‌లో ఆక్వా ప్రాసెసింగ్‌ కంపెనీలలో భద్రతాపరంగా తీసుకోవాల్సిన అంశాలపై కార్మికులు, యాజమాన్యాలకు ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు చెందిన ఆక్వా కంపెనీల యాజమాన్యాలు, కార్మికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకిశోర్‌ మాట్లాడుతూ ఫ్యాక్టరీలో పనిచేసేటపుడు ప్రమాదాలు సంభవించకుండా యాజమాన్యాలు అధునాతనమైన పరికరాలను వినియోగించాలన్నారు. 

మానవరహితంగా లేదా సాంకేతికపరమైన సమస్య రూపంలో ప్రమాదం సంభవిస్తే తక్షణం ప్రాణాపాయం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై యాజమాన్యాలు కార్మికులకు ప్రత్యేక అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి కార్మికులకు మాక్‌ డ్రిల్‌ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సంస్థలో పనిచేసే వారి భద్రతతోపాటు వారు సంపూర్ణ ఆరోగ్యంగా పనిచేసేలా యాజమాన్యాలు వారికి అవసరమైన దుస్తులు, పరికరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. జరుగుమల్లికి చెందిన మున్నంగి సీ ఫుడ్స్‌ కంపెనీకి చెందిన కార్మికులు అమ్మోనియా గ్యాస్‌ లీకైన సమయంలో కార్మికులు తక్షణం చేపట్టాల్సిన చర్యలు గురించి మాక్‌ డ్రిల్‌ నిర్వహించారని , ఇలాంటి మాక్‌ డ్రిల్‌ కార్యక్రమాలు అన్ని కంపెనీలు నిర్వహించేందుకు సిద్ధం కావాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సీ పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు.

సమావేశంలో సేఫ్టీ ఎక్స్‌పర్ట్‌ టెక్‌ విద్యాసాగర్, ఆక్యుపేషనల్‌ హెల్త్‌ ఎక్స్‌పర్ట్‌ డాక్టర్‌ పీ విశ్వేశ్వరరావు, నెల్లూరు ఫ్యాక్టరీస్‌ డిప్యూటీ చీఫ్‌ ఇన్ స్పెక్టర్‌ వై.మోహన్ బాబు, ఒంగోలు డిప్యూటీ చీఫ్‌ ఇన్ Sస్పెక్టర్‌ కే శ్రీనివాసరావు, ఒంగోలు ఇన్ స్పెక్టర్‌ ఆల మురళీకృష్ణ , సహాయ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి రాంప్రకాశ్, ఒంగోలు అగ్నిమాపక శాఖ అధికారి ఎంవీ సుబ్బారావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు