గడ్డుకాలం

29 Mar, 2016 02:13 IST|Sakshi
గడ్డుకాలం

అలమటిస్తున్న మూగజీవాలు
గ్రాసమూ లేదు.. నీళ్లూ లేవు
కబేళాలకు తరలుతున్న పశుసంపద
కొన్నిచోట్ల అయినకాడికి విక్రయాలు
కరువు కాలంలో భారంగా మారిన పశుపోషణ
చేతికొచ్చిన పంటే గ్రాసమాయె..

 కొన్యాలకి చెందిన యాదాగౌడ్ మాదూర గ్రామంలో ఎకరం ఎనిమిది కుంటల పొలంలో రబీ కింద వరి సాగు చేశాడు. పొట్టపోసుకునే దశలో నీరందక పంటంతా ఎండిపోయింది. దీంతో పొలంలో పశువులను వదిలేశాడు. స్వేదం చిందించి చేసిన సేద్యం తనకు కలిసి రాకున్నా.. కనీసం పశువుల ఆకలినైనా తీరుస్తుందని ఆ రైతు అంటున్నాడు. - హత్నూర

 నెమరు వేసేందుకు గడ్డి పరకలు కరువు.. గొంతు తడిసే దారే లేదు. కనీసం నిలువ నీడా లేకుండాపోయింది. దుర్భిక్షం రైతులనే కాదు.. వ్యవసాయంలో రైతన్నకు వెన్నుదన్నుగా ఉండే పశుసంపదనూ నకనకలాడిస్తోంది. నిన్నటి వరకు వెన్నంటి ఉన్న మూగజీవాల్ని.. పోషించే దారి లేక రైతులు వదిలించుకుంటున్నారు. గడ్డి మోపు ధర రూ.150 నుంచి రూ.300 వరకు పలుకుతుండటంతో కరువు కాలంలో అంత పెట్టి కొనే స్థోమత లేక వారాంతపు సంతల్లో అయిన కాడికి అమ్మేసుకుంటున్నారు. కొందరు కబేళాలకు తరలిస్తున్నారు.          - జోగిపేట

 మెదక్ జిల్లాలో మూగజీవాలు జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్నాయి. పశువులకు తినడానికి గడ్డి లభించక, తాగేందుకు నీరు దొరకక, కనీసం నిలబడేందుకు చెట్ల నీడ లేక అల్లాడిపోతున్నాయి. వర్షాలు సరిగ్గా కురియకపోవడంతో రైతులు భూములన్నింటినీ సాగు చేయలేక వృథాగా వదిలేశారు. పొలాల్లోని చెట్లను నరికి వేస్తూ కలపను విక్రయించుకుంటున్నారు. పశుగ్రాసం దొరకకపోవడంతో గ్రామాల్లో ఉన్న పశువులను అమ్ముకుంటున్నారు. మరికొన్ని పశువులను ఎంత దొరికితే అంతకే లాభం ఆశించకుండా విక్రయిస్తున్నారు. నారాయణఖేడ్ ప్రాంతం నుంచి ఎక్కువగా జహీరాబాద్ ప్రాంతంలో గల అల్లానా ఫ్యాక్టరీకి తరలిస్తున్నట్లు సమాచారం.

 తెలంగాణలోనే పశుసంపద అత్యధికంగా ఉండే మెదక్ జిల్లా.. ప్రస్తుతం గడ్డు పరిస్థితి నెలకొంది. కరవు నేపథ్యంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎండుగడ్డి కూడా లభించ క వ్యవసాయదారులు పక్క జిల్లాలకు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో ఎద్దులు, ఆవులు 4.42 లక్షలు, గేదెలు 4.37 లక్షలు, గొర్రెలు 10.83 లక్షలు, మేకలు 5.72 లక్షలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఐదేళ్ల కొకసారి జరిగే పశుగణన ప్రకారం నిర్ధారించిన లెక్కలివి. ఇంత పెద్దసంఖ్యలో పశుసంపద గల జిల్లాలో వాటికి మేత సమస్యగా మారింది. మేకలు, గొర్రెలు తినడానికి పచ్చిగరక, తాగడానికి నీళ్లు లభించక వీటి పెంపకందారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

పశుగ్రాసం కొరత వాస్తవమే
జిల్లాలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల గత రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో తీవ్ర పశుగ్రాసం కొరత ఏర్పడిన విషయం వాస్తవమేనని పశుసంవర్ధక శాఖ జేడీ లక్ష్మారెడ్డి చెప్పారు. ఆయనేమన్నారంటే.. ‘జిల్లాలో 50 వేల మెట్రిక్ టన్నుల గ్రా సం కొరత ఉంది. దాన్ని అధిగమించేందుకు పశు సంవర్ధక శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. జిల్లా వ్యాప్తంగా 160 మెట్రిక్ టన్నుల పశుగ్రాసం విత్తనాలకు రూ.40 లక్షలు వెచ్చించి 5 వేల ఎకరాలలో పండించాం. మరో 10 వేల ఎకరాలలో విత్తనాలు పండిస్తే కొంత వరకు కొరత తీరే అవకాశం ఉంది. జిల్లాలోని  అన్ని మండలాల్లో పశుగ్రాసం విత్తనాలను 75 శాతం సబ్సిడీతో రైతులకు అందుబాటులో ఉంచాం.

జిల్లాలో 8.50 లక్షల పశుసంపద ఉంది. కేవలం వ్యవసాయానికి ఉపయోగానికి రాని పశువులను మాత్రమే విక్రయించాలని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. పశువులు కబేళాలకు తరలించొద్దు. జిల్లాలోని అల్లానా, ఆల్‌కబీర్ ఫ్యాక్టరీలకు పశువులను తరలిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. సాధ్యమైనంత వరకు వాటిని నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రైతులు తాము పండిస్తున్న పంటలతో పాటే పశుగ్రాసాన్ని కూడా పండించుకోవాలి. పశువులకు తాగునీటి అవసరాల కోసం నీటి తొట్టెలను ఈజీఎస్ ద్వారా నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’.

ఊహకందని వేదన..
నాకు ఊహ వచ్చిన నాటి నుంచి ఇంత దుర్భిక్షాన్ని చూడలేదు. గతంలో పశువులకు ఎంతంటే అంత పశుగ్రాసం లభించేది. రెండేళ్ల నుంచి పరకే కరువైంది. గడ్డి మోపు రూ.250 పెట్టి కొన్నా.. పశుగ్రాసం కోసం ఎన్నడూ ఇన్ని తిప్పలు పడింది లేదు. పశువులకు మేతే కాదు.. నీళ్లూ అందించలేకపోతున్నాం. చెరువులు, కుంటలు ఎండిపోయాయి. కుళాయిల ద్వారా వచ్చే నీళ్లు మనుషుల అవసరాలకే సరిపోవట్లేదు. పశుగ్రాస విత్తనాలు సబ్సిడీపై ఇస్తున్నట్టు అధికారులు చెబుతున్నా అవి ఎవరికి ఇస్తున్నారో మాకైతే తెలియదు.
- కిష్టయ్య, రైతు, అన్నాసాగర్

 పశువులను అమ్ముకోవద్దు
పంటలు పండకపోవడం, విస్తీర్ణం తగ్గిపోవడం, ధరలు పెరగడం, కూలీల లభ్యత లేకపోవడంతో పశువులను రైతులు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు అమ్మితే తిరిగి కొనాలంటే ధరలు విపరీతంగా పెరడం వల్ల కొనలేకపోతామన్న విషయాన్ని గమనించాలి. మండలాల వారిగా పశుసంవర్ధక శాఖ డాక్టర్‌లను పర్యటింపజేసి రైతులను చైతన్య పరిచే కార్యక్రమాలు చేపడతాం. పశువుల సంత, దళారుల అమ్మకాలపై నిఘా పెట్టి అక్రమంగా పశువుల్ని తరలించడం, అమ్ముకోవడం లాంటి వాటిని నియంత్రణ చేస్తాం. జిల్లాలో పశుసంపదను కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం. - డాక్టర్ లక్ష్మారెడ్డి, జేడీ, పశుసంవర్ధకశాఖ

గడ్డి కొరత.. తీరని వెత..
జిల్లాలో సగటున ఒక్కో రైతు నాలుగు నుంచి ఆరేడు పశువుల వరకు పోషిస్తున్నారు. కరువు కారణంగా రైతులు తమకున్న పశువుల్లో కొన్నింటిని అమ్మేసుకుంటున్నారు. నారాయణఖేడ్, జోగిపేట, మెదక్, రామాయంపేట, సిద్దిపేట ప్రాంతాల్లో రైతులు పశువులకు అవసరమన గ్రాసం కొరతతో పశువులను వదిలించుకుంటున్నారు. పశువులను అమ్ముకునేందుకు సిద్ధంగా ఉన్న వారి వద్దకు దళారులు చేరుకొని క్రయవిక్రయాలు జరుపుతున్నారు. సంతల్లో ఎక్కువగా ఎద్దులు, గేదెల విక్రయాలకు పశుగ్రాసం కొరతే కారణమని రైతులు అంటున్నారు.

ఇతర ప్రాంతాలకు తరలింపు..
పశువులు లేని రైతులు తాము పండించిన వరి ధాన్యం పంటలో వచ్చే గడ్డిని డబ్బులు వస్తున్నాయన్న ఆశతో ఇతర ప్రాంతాలకు రూ.150 చొప్పున గడ్డిమోపును అమ్ముకుంటున్నారు. ఎక్కువగా రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలకు గడ్డి తరలిపోవడం వల్ల కూడా స్థానికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గత  ఖరీఫ్, రబీ  సీజన్‌లోనే సుమారుగా 25 శాతం ఎద్దులు, గేదెలు తగ్గిపోయినట్లుగా సమాచారం. గడ్డిలేకపోవడంతో చేసేది లేక రైతులు పశువులను వదిలించుకోవాలన్న ఆలోచనకు వచ్చారు. జిల్లాలో ప్రధాన పట్టణాల్లో జరిగే సంతల రోజున ఇతర జిల్లాలకు చెందిన వారు వచ్చి స్థానికంగా ఉన్న రైతులు విక్రయించే పశువులను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా పశువులను జహీరాబాద్ ప్రాంతంలోని అల్లానా ఫ్యాక్టరీకి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు.

మరిన్ని వార్తలు