జానపదం.. ఆరోప్రాణం

21 Aug, 2016 22:30 IST|Sakshi
జానపదం.. ఆరోప్రాణం

పులివెందుల టౌన్‌ :జానపద కళలంటే ఆయనకు ఎనలేని మక్కువ.. వాటికోసం అహర్నిశలు కష్టపడుతుంటాడు. ఎందరినో కళాకారులుగా తీర్చిదిద్ది ఎన్నో ప్రదర్శనలు ఇప్పించిన ఘనత ఆయనది.  ఆయనే పులివెందుల జానపద కళాకారుడు రామాపురం సురేష్‌కుమార్‌. ఆంధ్రప్రదేశ్‌ జానపద కళాకారుల సంఘం ప్రచార కార్యదర్శిగా ఉంటూ జానపద కళలను ప్రోత్సహిస్తూ   శభాష్‌ అనిపించుకుంటున్నాడు. దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ప్రశంశలు పొందాడు.  గురువు బిగిచెర్ల కృష్ణారెడ్డి పర్యవేక్షణలో చదువుకుంటూ ఎంతో మంది జానపద కళాకారులను తయారుచేశారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చి తన సత్తా చాటుకున్నాడు. ఎంతో మంది ప్రముఖుల చేతుల మీదుగా ప్రశంశలు అందుకున్నాడు.  స్వామి వివేకానంద పాఠశాల డైరెక్టర్‌ సోమశేఖర్‌రెడ్డి సహకారంతో హైదరాబాదు పోట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీలో ఎంఏ జానపద కళలు పూర్తి చేసి ఎంఫిల్‌ పూర్తి చేశాడు. పులివెందుల స్వామి వివేకానంద పాఠశాలలోనే శృతి కళాక్షేత్రాన్ని పెట్టి చిన్నారులకు జానపద నృత్యాలపట్ల ఆసక్తి పెంచుతూ శిక్షణ ఇస్తున్నాడు. జానపద కళలపై పుస్తకాలు రాయడం ప్రారంభించాడు.  ఎన్నో టీవీ షోలలో కూడా జానపద నృత్య ప్రదర్శనలు ఇచ్చి మంచి ప్రతిభ చూపించారు. జానపద కళలపై తనకున్న మక్కువతో 3 వేల మందికి పైగా కళాకారులను తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా కర్నాటక, తమిళనాడు, కేరళ దక్షిణాది రాష్ట్రాలలో జానపదం, భరతనాట్యంలో శిక్షణ ఇచ్చి కళాకారులను తీర్చిదిద్దారు. ప్రముఖుల చేతులమీదుగా 600వందలకు పైగా అవార్డులు అందుకున్నారు. జానపథ కళలను ప్రభుత్వం ప్రోత్సహించాలని సురేష్‌కుమార్‌ కోరుతున్నారు.

 

మరిన్ని వార్తలు