ఆక్రమణల తొలగింపును న్యాయబద్ధంగా చేపట్టాలి

9 Oct, 2016 00:51 IST|Sakshi
ఆక్రమణల తొలగింపును న్యాయబద్ధంగా చేపట్టాలి
 
  • రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
 
నెల్లూరు రూరల్‌ : నగరంలోని కాలువలపై ఆక్రమణల తొలగింపును న్యాయబద్ధంగా చేపట్టాలని రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మున్సిపల్‌ అధికారులకు సూచించారు. స్థానిక మద్రాసు బస్టాండ్‌ సమీపంలో శనివారం చేపట్టిన ఆక్రమణ తొలగింపు చర్యలను ఎమ్మెల్యే పరిశీలించారు. బాధితులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువలపై ఆక్రమణలను తొలగించే ముందుగా నిర్వాసిత పేదలకు ప్రత్యామ్నాయం చూపించాలన్నారు. కాలువల గట్లపై 50 ఏళ్లుగా ఉంటున్న పేదలకు కరెంటు మీటర్, కుళాయి కనెక్షన్లు ఇచ్చినట్లు గుర్తు చేశారు. పన్నులు వసూలు చేయడంతోపాటు ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించారన్నారు. నీటి పారుదలకు ఇబ్బంది లేకుండా కాలువగట్లపై ఉన్న వారిని తొలగించవద్దని సూచించారు. కాలువల్లో పూడికతీత చేపడితే వరద, ముంపు సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ఆదిశగా అధికారులు ఆలోచన చేయాలని కోరారు. బాధిత పేద కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పోరాడుతామని భరోసా కల్పించారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, ప్రముఖ న్యాయవాది చంద్ర, పట్రంగి అజయ్, చెక్కసాయి సునీల్, తదితరులు  ఉన్నారు.
 
 
 
మరిన్ని వార్తలు