ఆహారభద్రత కార్డులొచ్చాయ్‌

25 Aug, 2016 21:33 IST|Sakshi
ఆహారభద్రత కార్డులొచ్చాయ్‌
  • జిల్లాకు చేరిన 10.72 లక్షల కార్డులు
  • తహసీల్దార్‌ కార్యాలయాలకు సీల్డ్‌బాక్సులు
  • పంపిణీకి విడుదల కాని మార్గదర్శకాలు
  • మరోసారి పరిశీలన తర్వాతే పంపిణీ
  • ముకరంపుర : ఎట్టకేలకు ఆహారభద్రత కార్డులు జిల్లాకు వచ్చేశాయి. 121 సీల్డ్‌బాక్సుల్లో 10.72 లక్షల కార్డులు గురువారం జిల్లాకు చేరాయి. పౌరసరఫరాల శాఖ ద్వారా వీటిని ఆయా మండలాల తహసీల్దార్‌ కార్యాలయాలకు పంపిణీ చేయనున్నారు. కమిషనరేట్‌ నుంచి మార్గదర్శకాలు విడుదలైన తర్వాత సీల్డ్‌బాక్సులను తెరిచి మరోసారి కార్డులను పరిశీలన అనంతరం వాటిని గ్రామాల్లో పంపిణీ చేయనున్నామని డీఎస్‌వో నాగేశ్వర్‌రావు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో జారీ అయిన రేషన్‌కార్డుల స్థానంలో తెలంగాణ ప్రభుత్వం ఆహారభద్రత కార్డులను జారీ చేసినప్పటికీ ఇప్పటివరకు మీ–సేవలో ముద్రించిన కూపన్‌తోనే సరిపెట్టారు. ఆధార్‌ అనుసంధానం, ఆన్‌లైన్‌లో నమోదు, కార్డుల ముద్రణ వంటి కారణాలతో గత రెండేళ్లుగా కొత్త కార్డుల పంపిణీలో జాప్యం జరిగింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోగో, సీఎం కేసీఆర్‌ ఫొటోతో కార్డులను ముద్రించారు. వాటిని సీల్డ్‌బాక్సుల్లో పంపించడంతో కార్డుల నమూనా బయటికి తెలియడంలేదు. 
    10.72లక్షల కార్డులు.. 
    గతంలో జిల్లాలో అన్ని రకాల కార్డులు కలిపి 10,93,674 ఉన్నాయి. ఇందులో ఆహారభద్రత కార్డులు 10,25,692, అంత్యోదయ కార్డులు 67,317, అన్నపూర్ణ కార్డులు 665. సింగిల్‌ కార్డులను ఒకే కుటుంబంలో మిళితం చేయడంతో 21,674 కార్డులు తగ్గాయి. బోగస్‌కార్డులు, మరణించిన వారి కార్డులు ఏరివేశారు. దీంతో తాజాగా కార్డుల సంఖ్య 10,72,000లకు చేరింది. ఈ కార్డులను ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ముద్రించి సీల్డ్‌బాక్సుల్లో జిల్లాకు పంపించారు. ఆహారభద్రత కార్డులు రేషన్‌ సరకులకు మాత్రమే ఉపయోగపడుతాయని ప్రభుత్వం ప్రకటించింది. సంక్షేమ పథకాలతో ఆహారభద్రత కార్డుకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే స్పష్టం చేసింది. జిల్లాలో 38 లక్షల జనాభా ఉండగా.. 31,50,935 మంది ఆహారభద్రత కార్డులతో లబ్ధిపొందనున్నారు. 
    కొత్త జిల్లాలో సంబంధం లేకుండానే... 
    ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కరీంనగర్‌ జిల్లా మూడు జిల్లాలుగా మారుతోంది. కరీంనగర్‌తోపాటు కొత్తగా జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కార్డుల జారీకి జిల్లాల విభజనకు సంబంధం లేదంటూ రాష్ట్ర కమిషనరేట్‌ కార్యాలయం తేల్చిందని జిల్లా అధికారులు చెబుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మరోసారి కొత్త కార్డులు ముద్రించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  
    పాత కార్డులు 10,93,674 
    తొలగించినవి 21,674 
    కొత్త కార్డులు 10,72,000
    ఆహారభద్రత 10,25,692
    అంత్యోదయ 67,317
    అన్నపూర్ణ 665  
     
     
>
మరిన్ని వార్తలు