కొడుకుకు...ప్రేమతో..!

31 Jul, 2016 09:29 IST|Sakshi
కొడుకుకు...ప్రేమతో..!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: 
నాన్నకు ప్రేమతో అనే సినిమా చూశాం... ఈ కొడుకుకు ప్రేమతో ఏమిటని అనుకుంటున్నారా? ఇది సినిమా కాదు. జిల్లాలోని ముఖ్యనేత తన కొడుకు మీద ప్రేమతో నడుపుతున్న అధికారిక వ్యవహారం. సినిమాలో నాన్నమీద ప్రేమతో నాన్న కోరిక కొడుకు తీర్చగా... ఇక్కడ కొడుకు కోరిన మీదటే తన అధికారాన్ని ఉపయోగించుకుని ఒక తండ్రి నెరవేర్చిన కథ. అధికార పార్టీకి చెందిన ముఖ్యనేత ఒకరు ఏకంగా ప్రభుత్వ కార్యాలయాన్నే మార్చేందుకు చేస్తున్న ప్రయత్నం ఇది. విశాలంగా, పార్కింగ్‌కు సౌకర్యం ఉండి, తక్కువ అద్దెలు ఉన్న భవనాన్ని కాదని..ఇరుకు ఇరుకుగా..పార్కింగ్‌కు సౌకర్యం లేని, అధిక అద్దె ఉన్న ప్రాంతానికి రిజిస్ట్రేషన్‌శాఖ కార్యాలయానికి తరలించేందుకు అధికార పార్టీ నేత ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది.
 
జెడ్పీకి ఎదురుగా...!
ప్రస్తుతం జిల్లా రిజిస్ట్రేషన్‌ కార్యాలయం గుత్తి పెట్రోలు బంకుకు సమీపంలో ఉంది. ఇది ప్రజలకు కొంత దూరంగా ఉన్న మాట వాస్తవమే. అయితే, అక్కడ పార్కింగ్‌కు పెద్దగా సమస్య లేదు. అంతేకాకుండా అద్దె కూడా తక్కువే. దీనిని అధికార పార్టీ ముఖ్యనేత కుమారుడు కొన్న భవనంలోకి మార్చేందుకు యత్నాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యనేత కుమారుడు కొన్న భవనం జిల్లా పరిషత్‌ కార్యాలయానికి ఎదురుగా ఉంది. అక్కడ పార్కింగ్‌కు సదుపాయం ఏ మాత్రమూ లేదు. పైగా అద్దెలు కూడా అక్కడితో పోలిస్తే చాలా ఎక్కువ. ఇక రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో వ్యవహారాలన్నీ చక్కదిద్దేందుకు ఉన్న డాక్యుమెంటు రైటర్లు (దస్తావేజు లేఖరులు) అందరూ ఇక్కడకు తరలిరావాలంటే వారికీ అద్దె రూపంలో భారంగా మారనుంది. అంతేకాకుండా ఈ శాఖ ఇక్కడకు రావడంతో నగరంలోని ఇక్కడకు వచ్చే ఇతర ప్రజలకు కూడా అసౌకర్యంగా మారనుంది. మొత్తం మీద అధికార పార్టీ నేతలు చేస్తున్న ఈ ప్రయత్నం కాస్తా ఇప్పుడు రిజిస్ట్రేషన్‌శాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. 
 
ఆగని అవినీతి దందా
మరోవైపు రిజిస్ట్రేషన్‌శాఖలో అవినీతి వ్యవహారాలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికీ రిజిస్ట్రేషన్‌ చేయాలంటే.. ఇంత మొత్తాన్ని నిర్ణయించి వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా రియల్‌ ఎస్టేట్‌వ్యాపారులతో నేరుగా సంబంధాలు నెరుపుకుంటూ... వాస్తవిక ధర కంటే తక్కువ ధర పేర్కొంటూ తమ బొక్కసాలు నింపుకుంటున్నారు. జిల్లాకు చెందిన మంత్రి ఈ శాఖకు నేతత్వం వహిస్తున్నా ఇక్కడ మాత్రం అవినీతి దందా యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. ఈ అవినీతి వ్యవహారంతో ఆదాయం కోల్పోతున్న రిజిస్ట్రేషన్‌శాఖ కాస్తా... తాజాగా కార్యాలయం మార్పుతో అదనపు అద్దె రూపంలో మరింత భారం మోయాల్సి రానుంది. 
మరిన్ని వార్తలు