నాట్లు ఇలా వేస్తే లాభం

24 Jul, 2016 18:53 IST|Sakshi
నాట్లు ఇలా వేస్తే లాభం
భీమడోలు: జిల్లాలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో వరి నాట్లు పడలేదు. ఇప్పుడు పూర్తిస్థాయిలో కాలువలకు నీరు అందుతుండడంతో నాట్లు వేసేందుకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరి నాట్లు వేసే విషయంలో రైతులు పలు జాగ్రత్తలు పాటించాలని భీమడోలు ఏడీఏ కె.జయదేవ్‌రాజన్‌ సూచిస్తున్నారు. నెలాఖరులోగా నాట్లు వేసుకుంటే చీడ,పీడల వ్యాప్తి తగ్గుతుందని చెప్పారు.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
నారు తీసే తరుణంలో సూచనలు .. నారుమడి నుంచి నారు తీయడానికి 7 నుంచి 10 రోజుల ముందుగా సెంటు నారుమడికి 160 గ్రాముల కార్బోఫ్యూరాన్‌ గుళికలను పిచికారీ చేయాలి.  నారుమడి తీసేటప్పుడు మూనలు ఆకుపచ్చగా ఉంటేనే తిరుగుతాయి. 4 నుంచి 6 ఆకులున్న నారును మాత్రమే నాటాలి.  ముదురు ఆకును నాటితే అది తిప్పికుని నాటుకోవడానికి సమయం పడుతుంది. తద్వారా దిగుబడిపై ప్రభావం చూపుతుంది.  మొక్కలను నేలకు  పైభాగాన నాటితే ఎక్కువగా పిలకలు తొడిగే అవకాశముంటుంది. నాట్లు వేసే తరుణంలో భూసారాన్ని బట్టి చదరపు మీటరుకు సార్వాలో 33 మూనలు ఉండే విధంగా చూసుకోవాలి.  భూసారం ఎక్కువగా ఉన్న వరి క్షేత్రాల్లో తక్కువ కుదుళ్లు, తక్కువగా ఉన్నా పొలాల్లో ఎక్కువ కుదుళ్లు ఉండే విధంగా నాటుకోవాలి. 
– ముదురు నారు నాటే తరుణంలో కుదురుకు 4, 5 మొక్కలు చొప్పున నాటాలి.  నాటిన తర్వాత ప్రతి రెండు మీటర్ల దూరంలో 20 సెంటీమీటర్ల బాటలు తీయడం వల్ల పైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతిని తగ్గించుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. 
నీటి యాజమాన్యం .. నాట్లు వేసే తరుణంలో నీరు పల్చగా ఉండాలి. ఎండలు ఎక్కువగా ఉంటే నాటిన వెంటనే ఐదు సెంటీమీటర్ల వరకు నీరు కట్టాలి. మూన తిరిగిన రోజు నుంచి వరి దుబ్బు వేయడం పూర్తయ్యే వరకు రెండు, మూడు సెంటీమీటర్ల నీరు ఉండాలి. ఎక్కువగా నీరు ఉంటే వరి దుబ్బు చేయదు. చిరుపొట్ట దశ నుంచి గింజ పట్టే వరకు ఐదు సెంటీమీటర్ల మేర లోతులో నీరు ఉండాలి. కోతకు 10 రోజుల ముందుగానే నీటిని క్రమంగా తగ్గించాలి.
ఎరువుల యాజమాన్యం .. నత్రజనిని కాంప్లెక్స్, యూరియా రూపంలోను వాడవచ్చు. 50 కిలోల నత్రజనిని మూడు సమభాగాలు చేసి నాటుకు ముందు ఎకరాకు దమ్ములోనూ, దుబ్బు చేసే దశలోను, అంకురం దశలోను, బురద పదునులో మాత్రమే సమానంగా వేయాలి. 
– నాట్లు వేసిన తర్వాత 50 కిలోల యూరియాకు 10 కిలోల వేపపిండికి గాని 250 కిలోల తేమ కలిగిన మట్టిని కలిపి రెండు రోజుల నిల్వ ఉంచి జల్లితే నత్రజని వినియోగమవుతుంది. 
– భాస్వరం ఎరువును మొత్తం దమ్ములోనే వేయాలి. పొటాష్‌ ఎరువులను రేగడి నేలల్లో చివరి దుమ్ములో పూర్తిగా ఒకేసారి వేయాలి. తేలిక భూముల్లో అఖరి దమ్ముల్లో సగం, అంకురం ఏర్పడే దశలో సగం వేయాలని సూచిస్తున్నారు. 
తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు : కె.జయదేవ్‌రాజన్, ఏడీఏ, భీమడోలు రైతులు వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలను పాటిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందవచ్చు. 22 నుంచి 28 రోజుల వయసు గల నారు మాత్రమే నాటుకోవాలి. 24 రోజుల నారును నాటితే మరింత మంచిది. కుదురుకు 2, 3 మొక్కలు పైపైన నాటుకోవాలి. లోతుగా వద్దు. భాస్వరం ఎరువులు అనగా పంట దమ్ము తరుణంలో వేసుకోవాలి. డీఏపీని ఏకరాకు 40 కేజీల చొప్పున, సూపర్‌ను మూడు బస్తాలను ఒకటి, రెండు రోజుల ముందుగా వేసుకుని దమ్ము చేసుకుంటే ఫలితం ఉంటుంది. నాట్లు పూర్తయిన రెండు రోజుల తర్వాత ఏకరాకు 20 కిలోల జింక్‌ ఫాస్పెట్‌ వాడితే మంచిది. 50 శాతం రాయితీపై జింక్‌ పాస్ఫేట్‌ వాడితే మంచిది. అన్ని వ్యవసాయశాఖ కార్యాలయాల్లో 50శాతం సబ్సిడీకి అందజేస్తున్నాం
 
 
 
 
మరిన్ని వార్తలు