దొంగతనం ఒప్పుకోలేదని..

27 Jul, 2016 10:10 IST|Sakshi
దొంగతనం ఒప్పుకోలేదని..

కాగే నూనెలో చేతులు పెట్టి ప్రమాణం చేయించబోయిన వైనం
అడ్డుకున్న తల్లిదండ్రులు, బంధువులు

చేజర్ల: చేయని దొంగతనం ఒప్పుకోలేదని బలవంతంగా ఓ యువకుడి చేత బహిరంగంగా కాగే నూనెలో చేతులు పెట్టి ప్రమాణం చేయించబోయిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని పుట్టుపల్లి గ్రామంలో నివాసముంటున్న ఎస్‌కే ఖలీల్‌బాష, బీబీ కుమారుడు నజీర్‌బాష ఆత్మకూరు బీఎస్సార్‌ కళాశాలలో ఐటీఐ చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన ఖాతూన్‌బీ ఇంటిలో రూ.2 వేలు దొంగతనం జరిగింది. ఎదురింట్లో ఉన్న నజీర్‌బాష దొంగలించాడనే అనుమానంతో కాగే నూనెలో చేతులు పెట్టి ప్రమాణం చేయాలని ఖాతూన్‌బీ, కుమార్తె బీబీజాన్, కొడుకు మస్తాన్‌షరీఫ్‌లు బెదిరించారు.

ఈ క్రమంలో నజీర్‌ను గ్రామంలోని దర్గా వద్దకు తీసుకెళ్లి  బాండలిలో సిద్ధంగా ఉంచిన నూనెలో చేతులు పెట్టిస్తుండగా విషయం తెలుసుకున్న నజీర్‌ బంధువులు వారిని అడ్డుకున్నారు. దీంతో బాధితుడు బంధువులతో కలిసి సోమవారం రాత్రి చేజర్ల పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఎస్సై సుభాని మాట్లాడుతూ కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

మరిన్ని వార్తలు