కంటైనర్ల కొద్దీ విదేశీ సిగరెట్లు

13 Jan, 2016 10:06 IST|Sakshi
ఇటీవల కస్టమ్స్ అధికారులు పట్టుకున్న విదేశీ సిగరెట్లు

కృష్ణపట్నం పోర్టులో మరో రెండు కంటైనర్లను తెరిచిన అధికారులు
రూ.6 కోట్ల విలువైన సిగరెట్లు, కాస్మొటిక్స్ లభ్యం
ఇద్దరు స్మగ్లర్లను కోర్టులో హాజరుపర్చిన డీఆర్‌ఐ విభాగం

 
సాక్షి, ముత్తుకూరు/విజయవాడ బ్యూరో:  శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టులో మరో రెండు కంటైనర్లలో రూ.6 కోట్ల విలువైన సిగరెట్లు, కాస్మెటిక్స్ బయటపడినట్లు తెలిసింది. కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా ఓ కంటైనర్‌లో రహస్యంగా తరలిస్తున్న వివిధ బ్రాండ్ల సిగరెట్లను డైరె క్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు 12 రోజుల క్రితం పట్టుకున్న విషయం తెలిసిందే. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నుంచి గత నెల 29న కృష్ణపట్నం పోర్టుకు వచ్చిన నౌకలో ఈ కంటైనర్‌ను గుర్తించారు. అందులో తనిఖీ చేయగా రూ.9 కోట్ల విలువైన 71.40 లక్షల ఫిల్టర్ సిగరెట్లు బయటపడ్డాయి.
 
సిగరెట్లు, కాస్మెటిక్స్ స్మిగ్లింగ్‌కు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను డైరె క్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, కస్టమ్స్ అధికారులు చెన్నైలో అదుపులోకి తీసుకొన్నారు. ఆది, సోమవారాల్లో పోర్టులో మళ్లీ విచారించారు. యూఏఈ నుంచి వచ్చిన వాటిలో మరో రెండు కంటైనర్లను 1వ నంబర్ బెర్తు వద్ద తెరచి, తనిఖీలు చేశారు. ఈ రెండు కంటైనర్లలో రూ.6 కోట్ల విలువైన సిగరెట్లు, కాస్మొటిక్స్ లభించినట్టు సమాచారం. అదుపులోకి తీసుకున్న ఇద్దరు స్మగ్లర్లను డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) విభాగం అధికారులు హైదరాబాద్‌లోని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిసింది.
 
 యథేచ్ఛగా విదేశీ సిగరెట్ల అక్రమ రవాణా
  *కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా విదేశాల నుంచి అక్రమంగా సిగరెట్ల దిగుమతి పెరిగిపోతోంది.
 *యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేసియా, సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్, చైనా దేశాల నుంచి 20 కంపెనీలకు చెందిన విదేశీ సిగరెట్లు రాష్ట్రంలో ప్రవేశిస్తున్నాయి.
* దూది పరుపులు, బెడ్‌షీట్లు, కాటన్ ఉత్పత్తుల పేరిట విదేశాల్లో షిప్పింగ్ బిల్ తయారుచేసి సిగరెట్లను ఎగుమతి చేస్తున్నారు. రవాణాకు సంబంధించిన పత్రాల్లో పూర్తిగా అవాస్తవాలను పొందుపరిచే స్మగ్లర్లు పరుపులు, బెడ్‌షీట్ల కింద సిగరెట్ కార్టన్లు(అట్టపెట్టెలు) పెడుతున్నారు.
*ఇప్పటివరకూ రాష్ట్రానికి దిగుమతి అయిన విదేశీ సిగరెట్లలో బ్లాక్, రోతమ్స్, డన్‌హిల్స్ వంటి పదిపైగా బ్రాండ్లు ఉన్నాయి. వీటిపై తయారీ తేదీలు, చట్టబద్ధ హెచ్చరికలు ఉండవు.
* విదేశీ సిగరెట్ బాక్సుపై సిగరెట్ తయారీలో వాడిన ముడిసరుకు వివరాలేవీ ఉండవు.
*  చెన్నైలో కస్టమ్స్ తనిఖీలు ముమ్మరమైన నేపథ్యంలో సమీపంలోని కృష్ణపట్నం పోర్టును వ్యాపారులు ఎంపిక చేసుకున్నారు.  
* విదేశీ సిగరెట్లను బహిరంగ మార్కెట్‌లో విక్రయించే వ్యాపారులపై కస్టమ్స్ అధికారులు నిఘాపెట్టారు.
*  2015 సెప్టెంబర్- డిసెంబర్ మధ్య కాలంలో రూ.20 లక్షల విలువైన విదేశీ సిగరెట్లను పట్టుకున్నారు.
* డిసెంబర్ 3న రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేసి రూ.25 లక్షల విలువైన విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.
* సుంకం చెల్లించకుండా దిగుమతి అవుతున్న విదేశీ సిగరెట్లపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఏపీ కస్టమ్స్ కమిషనర్ ఎస్‌కే రెహమాన్ తెలిపారు.

మరిన్ని వార్తలు