'అరణ్య' రోదన

3 Nov, 2016 23:53 IST|Sakshi
'అరణ్య' రోదన
* అన్యాక్రాంతమవుతున్న అటవీ భూములు
పట్టించుకోని అధికారులు
పేదల సాగుకు మాత్రం ప్రతి బంధకాలు
 
వనం–మనం, మొక్కలు నాటండి..పర్యావరణాన్ని కాపాడండి ఇలాంటివన్నీ ప్రభుత్వ పెద్దల చిలక పలుకులుగా మాత్రమే మిగిలిపోతున్నాయి. పచ్చదనాన్ని పెంపొందించడానికి అవకాశం ఉన్నచోట కూడా అధికారుల అలసత్వం, పాలకులు నిర్లక్ష్యంతో హామీల అమలు ఆచరణ గడప దాటడం లేదు. వన సంరక్షణకు ప్రధాన వేదికలైన అటవీ భూములను అక్రమార్కులు అన్యాక్రాంతం చేస్తున్నా అధికారుల్లో చలనం కలగడం లేదు. 
 
తిరువూరు: పశ్చిమ కృష్ణాలోని తిరువూరు నియోజకవర్గంలో 10 వేల ఎకరాల రిజర్వు అటవీ భూమి ఉంది. దీర్ఘకాలంగా ఈ భూముల స్థితిగతులను పట్టించుకోని అధికారులు ఏటా వనసంరక్షణ పేరుతో మొక్కలు నాటి చేతులు దులుపుకుంటున్నారు. మొక్కల పెంపకానికి నియమించిన కూలీలకు సైతం సక్రమంగా సొమ్ములు చెల్లించని కారణంగా పట్టించుకునే నాథుడు లేక మొక్కలు ఎదుగుదల లోపించి కునారిల్లుతున్నాయి. తిరువూరు మండలంలోని చిట్టేల, ఆంజనేయపురం, చౌటపల్లి, మల్లేల, కాకర్ల, లక్ష్మీపురం, చిక్కుళ్లగూడెం, ఏ కొండూరు మండలంలోని కృష్ణారావుపాలెం, చీమలపాడు, కొండూరు, కోడూరు, రామచంద్రాపురం, గంపలగూడెం మండలం వినగడప, నారికింపాడు, కనుమూరు, విస్సన్నపేట మండలం పుట్రేల గ్రామాల పరిధిలో వేలాది ఎకరాల అటవీ భూములున్నాయి. పలుచోట్ల రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సరిహద్దు వివాదాలు ఏర్పడిన నేపథ్యంలో 2 సంవత్సరాల క్రితం జాయింట్‌ సర్వే జరిపి హద్దులు నిర్ణయించి కందకాలు తవ్వారు. తదుపరి కొందరు పెద్దల ఒత్తిడితో అటవీశాఖ భూముల హద్దులు తారుమారైనట్లు ఆరోపణలు వస్తున్నాయి.
 
పేదలకు ప్రతి బంధకాలు..
అటవీభూమిని జీవనోపాధి కోసం సాగు చేసుకునే పేదలపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేసే అధికారులు యథేచ్ఛగా కొండలు, గుట్టలు తవ్వి మట్టి విక్రయించి సొమ్ము చేసుకునే వారిని వదిలేస్తున్నారు. సమీప పొలాల్లో అటవీ భూమి కలుపుకునే వ్యక్తులపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. తిరువూరు మండలంలోని మల్లేలలో ఇటీవల అటవీ అధికారులు ఎస్సీ, ఎస్టీల భూములు ఖాళీ చేయాలని వేధింపులకు గురి చేసినప్పటికీ సాగుదారులు సంఘటితంగా నిలబడటంతో అధికారులు వెనక్కు తగ్గారు. కిందిస్థాయి సిబ్బంది మామూళ్ల మత్తులో అటవీ భూముల ఆక్రమణలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ఇదే అదనుగా కొందరు కబ్జాదారులు కోట్లాది రూపాయల విలువైన భూములు కాజేసేందుకు పావులు కదుపుతున్నారు. 
 
పర్యావరణ పరిరక్షణకు తీవ్ర హాని..
రిజర్వు అటవీ భూములను ఆక్రమించి పంటలు సాగు చేస్తుండటంతో మొక్కల పెంపకానికి భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధిహామీ పథకం కింద అటవీ భూముల్లో మొక్కల పెంపకం, నీటి వనరుల అభివృద్ధికి చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, వాగులు వంకల్లో నీటి పారుదలకు అవరోధాల తొలగింపు నిధులు మంజూరైనా పనులు తూతూమంత్రంగా జరుగుతున్నాయి. నారికింపాడు అడవులను వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతంగా 50 ఏళ్ల క్రితమే ప్రకటించినప్పటికీ ఇంతవరకు తదనుగుణంగా చర్యలు చేపట్టలేదు. 
 
ఆక్రమణదారులపై కేసులు: రంజిత్, అటవీ రేంజి అధికారి, ఏ కొండూరు
అటవీ భూములను ఆక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. మల్లేల అటవీ భూముల్లో ఆక్రమణలు తొలగించి 25 ఎకరాల్లో మొక్కలు నాటాం. వీటి సంరక్షణ బాధ్యతలను త్వరలో వన సంరక్షణ సమితులకు అప్పగిస్తాం. గతంలో ఆక్రమణకు గురైన భూముల విషయం న్యాయస్థానాల పరిధిలో ఉంది. ఇకపై ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. అటవీ భూముల రక్షణకు చర్యలు: రక్షణనిధి, ఎమ్మెల్యే, తిరువూరు అటవీ భూములు ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశిస్తాం. వన్యప్రాణుల సంరక్షణకు అవసరమైన చర్యలు కూడా తక్షణం తీసుకునే విధంగా కృషి చేస్తాం. పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.
మరిన్ని వార్తలు