అటవీప్రాంతంలో ముమ్మరంగా కూంబింగ్‌

4 Nov, 2016 01:14 IST|Sakshi

 మైదుకూరు: మైదుకూరు సమీపంలో నల్లమల, లంకమల అభయారణ్యంలో తమిళ కూలీలు చొరబడటంతో మైదుకూరు అర్బన్, రూరల్‌ పోలీసు సిబ్బంది ఫారెస్ట్‌లో కూంబింగ్‌ ముమ్మరం చేశారు. బుధవారం, గురువారం మైదుకూరు సీఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి నల్లమల భైరవకోన, సానీబావి, బోరకొండ, దూదెమ్మ కోన ప్రాంతంలో కూబింగ్‌ నిర్వహించారు. ఇప్పటికే అటవీ ప్రాంతంలో దాదాపు 100 మందికి పైన ఎర్రస్మగ్లింగ్‌ చేస్తున్న కూలీలను పట్టుకున్నారు. ఇంకా కొందరు అటవీ ప్రాంతంలో తమిళ కూలీల ఉనికి ఉన్నట్లు సమాచారం ఉండటంతో ఈ కూంబింగ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు అటవీప్రాంతం సమీపంలోని గ్రామాల్లోకి వస్తే వారికి సహకరించినా, వారితో సంబంధాలు పెట్టుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఖాజీపేట నుంచి వరకు దువ్వూరు వరకు సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 6గంటల వరకు జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  స్మగ్లింగ్‌ పాల్పడే వ్యక్తులు ఎలాంటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. ప్రజలకు గుర్తు తెలియని వ్యక్తులు కనపడితే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు.

మరిన్ని వార్తలు