ఏసీబీకి చిక్కిన అటవీ అధికారి

19 Feb, 2017 01:26 IST|Sakshi
ఏసీబీకి చిక్కిన అటవీ అధికారి
రూ.60వేలు స్వాధీనం
రాజమహేంద్రవరం క్రైం : లంచం తీసుకుంటూ ఓ అటవీశాఖ అధికారి శనివారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏలూరు రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ వి.గోపాల్‌ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం రాజమహేంద్రవరంలోని అటవీ శాఖలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ రేంజ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న జీవీవీ ప్రకాష్‌ ఈ నెల 14న పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలోని సాయి సుందరం సామిల్లుకు వచ్చిన 13 దుంగల రోజ్‌ ఉడ్‌ కలప కలిగిన వాహనాన్ని పట్టుకున్నారు. దుంగలకు వే బిల్లులు చూపాలంటూ అత్తిలి గ్రామానికి చెందిన సామిల్లు కట్టర్‌ మట్టపర్తి శ్రీనివాస్‌ను, వాహనం డ్రైవర్‌ గునుపూడి నాగరాజును, సామిల్లు నిర్వాహకుడు నిమ్మకాయల సూర్య భాస్కరరావులను 14వ తేదీ రాత్రి అదుపులోకి తీసుకున్నారు. దుంగలను, వాహనాన్ని, ముగ్గురు బాధితులను రాజమహేంద్రవరంలోని ఫారెస్ట్‌ కార్యాలయంలో నిర్భందించారు. వీరిని విడిపించేందుకు రూ.3 లక్షలు ఇవ్వాలంటూ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ప్రకాష్‌ డిమాండ్‌ చేశారు. నాలుగు రోజులుగా బాధితులపై కేసు నమోదు చేయకుండా నిర్భందించి ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో వీరవాసరం గ్రామానికి చెందిన సామిల్లు యజమాని పైడి కొండల రెడ్డి నాయుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ వి.గోపాల్‌ కృష్ణ తన సిబ్బందితో నిఘా ఏర్పాటు చేశారు. శనివారం రేంజ్‌ ఆఫీసర్‌ ప్రకాష్‌ రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఆయన నుంచి రూ. 60 వేలు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. 
సంఘటనకు ముందు మరో రూ.26 వేల లంచం 
ఈ సంఘటన జరగడానికి ముందు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ రేంజ్‌ ఆఫీసర్‌ జీవీవీ ప్రకాష్‌ ఇదే కేసులో మరో సామిల్లు యజమాని అయిన గెరటేశ్వరరావు వద్ద రూ.26 వేలు తీసుకున్నట్టు బాధితులు ఆరోపించారు. ఈ కేసులో ఫారెస్ట్‌ ఆఫీసర్‌ సామిల్లు యజమాని నుంచి, కలప సరఫరా చేసే వారి నుంచి కూడా లంచం తీసుకున్నట్టు బాధితులు 
ఆరోపిస్తున్నారు.
 
మరిన్ని వార్తలు