అభివృద్ధి బాటలో మానుకోట

15 Oct, 2016 08:35 IST|Sakshi

మహబూబాబాద్‌: తెలంగాణ చిత్రపటంపై తాజాగా కొత్త జిల్లాగా ఆవిర్భవించిన మహబూబాబాద్‌ పలు అంశాల్లో తనకంటూ ప్రత్యేకతను కలిగి ఉంది. కొత్త జిల్లాల్లో గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో మహబూబాబాద్‌ జిల్లాగా ఏర్పడింది. మొత్తం 7,54,845 జనాభా ఉన్న ఈ జిల్లాలో గిరిజనులు 2,89,176(జిల్లా జనాభాలో 38 శాతం) ఉండడం విశేషం. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో మహబూబాబాద్‌ జిల్లా గిరిజన జనాభాలో మొదటి స్థానంలో నిలిచింది.  మానుకోట, డోర్నకల్‌ నియోజకవర్గాలు రెండూ ఎస్టీ ప్రాతినిధ్య నియోజకవర్గాలే. అంతేగాక ఇందులో కలిసే కొత్తగూడ(ములుగు), గార్ల, బయ్యారం(ఇల్లందు) మండలాలతోపాటు మహబూబాబాద్‌ పార్లమెంటరీ స్థానం కూడా ఎస్టీ ప్రాతినిధ్య నియోజకవర్గాలే కావడం విశేషం. ఇక్కడి రాజకీయాలతోపాటు మిగతా రంగాలను శాసించే స్థాయిలో గిరిజన జనాభా ఉంది.

గ్రామపంచాయతీ నుంచి జిల్లా కేంద్రంగా..
2011 సెప్టెంబర్‌ వరకు గ్రామపంచాయతీగా ఉన్న మహబూబాబాద్‌ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ అయింది. నూతన తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంగా మారడంతో అభివృద్ధిపై ఇక్కడి ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో రానున్న రోజుల్లో మహబూబాబాద్‌ రూపురేఖలు మారునున్నాయనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.

జిల్లాలో ప్రముఖ ఆలయాలు..  
ఆసియా ఖండంలో పేరొందిన చర్చి ఆఫ్‌ సౌత్‌ ఇండియా(సీఎస్‌ఐ) చర్చి, కురవి మండల కేంద్రంలో తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన శ్రీవీరభద్రస్వామి దేవాలయం, మహబూబాబాద్‌ శివారులోని నర్సింహులపేటలో శ్రీవెంకటేశ్వర స్వామి, లకీ‡్ష్మనరసింహస్వామి ఆలయాలు, తొర్రూరు మండలం మాటేడులో ఒకే ప్రాంగణంలో ఉన్న కాకతీయుల కాలం నాటి శివాలయం, వేణుగోపాలస్వామి ఆలయం, ఇనుగుర్తిలో పుట్టు లింగస్వామి దేవాలయం, పెనుగొండలో కాకతీయుల కాలం నాటి కట్టడాలు, ఈదులపూసపల్లిలో ఇమాంషావలి దర్గా ఉన్నాయి.

అందుబాటులోకి ఉన్నత విద్య..  
మానుకోట విద్యాపరంగా చాలా వెనుకబడి ఉంది. ఇక్కడ కనీసం  ఇంజనీరింగ్, మెడికల్, పాలిటెక్నిక్, ప్రభుత్వ డైట్, బీఈడీ కళాశాలలు లేవు. అయితే గతంలో ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీ మేరకు హార్టీకల్చర్, గిరిజన యూనివర్సిటీతోపాటు అగ్రికల్చర్‌ యూనివర్సిటీ అనుబంధ కళాశాలలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. గిరిజన విశ్వవిద్యాలయం విషయంలోను మానుకోట పట్టణంలో ఆందోళన మొదలైంది. గతంలోనే ఇల్లందు రోడ్డులోని ప్రభుత్వ భూమిని విశ్వ విద్యాలయం కోసం పరిశీలించారు. అందుకు సంబంధించిన నివేదిక కూడా పంపించారు. గిరిజన విశ్వవిద్యాలయం కోసం పాటుపడుతానని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి తేజావత్‌ రాంచంద్రు నాయక్‌ విలేకరుల సమావేశంలో హామీ ఇచ్చారు. ఆ నివేదిక అందగానే తనవంతు కృషి చేయడంపాటు సీఎంకు వివరించి ఏర్పాటు కోసం శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంగా మారడంతో యూనివర్సిటీ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి.

స్టీల్‌ ప్లాంట్‌పైనే ఆశలు..
బయ్యారం, గార్ల, గూడూరు ప్రాంతాల్లో డోలమైట్‌ నిక్షేపాలు ఉన్నాయని ప్రభుత్వ సర్వేలు వెల్లడించాయి.  ఇటీవల రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ కేంద్ర మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌ను కలిసి బయ్యారంలో ఉక్కు పరిశ్రమను నెలకొల్పాలని కోరడం, ఆయన సానుకూలంగా స్పందించి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుకు అంగీకరించడంతో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుపై ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. ఇదే జరిగితే జిల్లాలో ఏకైక భారీ పరిశ్రమగా స్టీల్‌ప్లాంట్‌ అవతరించనుంది. ఈ పరిశ్రమ ఏర్పాటుకు గతంలో బయ్యారం, గార్ల, గుండ్రాతిమడుగు ప్రాంతాల్లో స్థల పరిశీలన కూడా జరిగిన విషయం తెలిసిందే.

రైల్వే స్టేషన్ అభివృద్ధికి బాటలు..
మానుకోట జిల్లా కేంద్రమైతే ఇక్కడి రైల్వే స్టేషన్లో ఆగే రైళ్ల సంఖ్య పెరిగే అవకాశముంది. పాత బజార్‌నుంచి కొత్తబజార్‌కు వెళ్లేందుకు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి, స్టేషన్ లో క్యాంటీన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. జిల్లా ఏర్పాటుతో ఈ సమస్యలన్ని తీరుతాయని ప్రజలు ఆశిస్తున్నారు. ప్రతిరోజు 4 లక్షలకుపైగా ఆదాయం, నెలకు కోటిపైనే ఆదాయం వస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు.  

నూనె, పసుపునకు వాణిజ్య కేంద్రం
మహబూబాద్‌ జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రం నూనె, పసుపు మిల్లులకు ప్రసిద్ధి. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు పసుపు, నూనె సరఫరా అవుతోంది. ఇక్కడి మార్కెట్‌లో రోజూ కోట్లాది రూపాయల వ్యాపారం సాగుతోంది.

రాజకీయ ముఖచిత్రం
మహబూబాబాద్, డోర్నకల్‌ నియోజకవర్గాలు కాంగ్రెస్‌ కంచుకోటగా ఉండేవి. మహబూబాబాద్‌ నియోజకవర్గం మొదట్లో ఇది ద్విసభ్య నియోజకవర్గం. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో పీడీఎఫ్‌ నుంచి కన్నెకంటి శ్రీనివాసరావు, ఎ¯ŒSసీఎఫ్‌ నుంచి బీఎం చందర్‌రావు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 1957లో, 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎంఎస్‌ రాజలింగం,  జి.మల్లిఖార్జునరావు గెలిచారు. 1967లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సీపీఐ నుంచి తీగల సత్యానారాయణ గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ నేత జెన్నారెడ్డి జనార్దన్‌రెడ్డి 1972 నుంచి 1994 వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1994లో సీపీఐ అభ్యర్థి బండి పుల్లయ్య చేతిలో ఆయన ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్‌ నాయకులు రాజవర్ధ¯Œ¯ŒSరెడ్డి, జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి మధ్య గ్రూప్‌ రాజకీయాలతో 1999 ఎన్నికల్లో శ్రీరాంభద్రయ్య(టీడీపీ), 2004 ఎన్నికల్లో వేం నరేందర్‌రెడ్డి(టీడీపీ) ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఈ స్థానం ఎస్టీకి రిజర్వ్‌ కావడంతో కాంగ్రెస్‌ నుంచి మాలోతు కవిత, 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి శంకర్‌నాయక్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

డోర్నకల్‌ నియోజకవర్గం ఏర్పాౖటెన తర్వాత కాంగ్రెస్‌ నుంచి 1957 నుంచి 78 వరకు నూకల రామచంద్రారెడ్డి, 1978 నుంచి 1989 వరకు రామసహాయం సురేందర్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. సురేందర్‌రెడ్డి ఎంపీగా పోటీ చేయడంతో ఆయన(జనరల్‌) స్థానంలో కాంగ్రెస్‌ నుంచి రెడ్యానాయక్‌ వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఐదోసారి 2009లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సత్యవతి రాథోడ్‌ చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో తిరిగి రెడ్యానాయక్‌ కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరారు.  


- 2009లో ఏర్పడిన మానుకోట ఎంపీస్థానం ఎస్టీలకు రిజర్వ్‌ కాగా తొలి ఎంపీగా బలరాంనాయక్‌(కాంగ్రెస్‌) గెలుపొందగా, ప్రస్తుత ఎంపీగా ప్రొఫెసర్‌ సీతారాంనాయక్‌ కొనసాగుతున్నారు.
- మహబూబాబాద్‌ జిల్లా పరిధిలోకి వస్తున్న గార్ల, బయ్యారం, కొత్తగూడ మండలాల్లో సీపీఐ(ఎంల్‌) న్యూడెమోక్రసీ ఉనికిని చాటుకుంటోంది.

మరిన్ని వార్తలు