పెన్షన్ కోసం ఆర్మీ మాజీ ఉద్యోగి నిర్వాకం

24 Feb, 2016 20:55 IST|Sakshi
పెన్షన్ కోసం ఆర్మీ మాజీ ఉద్యోగి నిర్వాకం

తాడేపల్లి రూరల్ : పూర్తిస్థాయి పింఛను పొందేందుకు వివాహమైందని నకిలీ పత్రాలు సృష్టించిన ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి నిర్వాకం బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ పేద వివాహిత ద్వారా ఈ విషయం బహిర్గతమైంది. గుంటూరు జిల్లా తాడేపల్లి రూరల్ మండలం ముగ్గురోడ్డు ప్రాంతంలో నివసించే ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి భార్య నాలుగేళ్ల కిందట అనారోగ్యంతో మరణించింది. దీంతో ఆర్మీ నుంచి వచ్చే పింఛనులో సగం కోత విధించారు. మరలా వివాహం చేసుకున్నట్లు పత్రాలు సమర్పిస్తే మొత్తం పింఛను పొందే అవకాశం ఉందని ఓ అధికారి సలహా ఇవ్వడంతో.. నకిలీ పెళ్లి పత్రాలు సృష్టించేందుకు విఫలయత్నం చేశాడు.

నిరుపేద వివాహితకు తెలియకుండా...
ముగ్గురోడ్డు ప్రాంతానికే చెందిన ఓ నిరుపేద వివాహితకు తెలియకుండానే ఆమెను వివాహం చేసుకున్నట్లు సదరు ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి పత్రాలు తయారు చేశాడు. ఇళ్ల స్థలం ఇప్పిస్తామంటూ ఆ ఏరియాకు చెందిన టీడీపీ చోటా నేత వివాహిత మహిళ నుంచి ఆధార్‌కార్డు, ఓటుకార్డు, ఫొటోలు తీసుకున్నాడు. అనంతరం ఓ పాస్టర్ ద్వారా పెళ్లి అయినట్లు పత్రాలు తయారు చేశారు. ఈ వ్యవహారం గురించి వివాహితకు ఇసుమంత కూడా తెలియకపోవడం విశేషం. స్థలం ఇప్పిస్తారనే ఆశతో ఆమె తనకు చెందిన గుర్తింపు కార్డులు, ఫొటోలు టీడీపీ నేతకు ఇచ్చింది.

>
మరిన్ని వార్తలు