పిల్లలకు దానగుణం నేర్పించండి

25 Jun, 2017 23:29 IST|Sakshi
పిల్లలకు దానగుణం నేర్పించండి
తల్లిదండ్రులకు మహారాష్ట్ర అడిషనల్‌ డీజీపీ లక్ష్మీనారాయణ సూచన
ఘనంగా కోనసీమ ఐ బ్యాంక్‌ సప్తమ వార్షికోత్సవం
అమలాపురం టౌన్‌ : పుట్టినరోజు వేడుకలు చేసుకుని అవి వాట్సాప్‌ల్లో పెట్టి ఆనందించే నేటి యువత అదే పుట్టిన రోజున రక్తం దానం చేసి ఆ దృశ్యాన్ని వాట్సాప్‌ల్లో పెట్టినప్పుడు వచ్చే ఫలితాలు పవిత్రం, పరమార్థంతో ఉంటాయని సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్, మహారాష్ట్ర అడిషనల్‌ డీజీసీ లక్ష్మీనారాయణ అన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఇదే స్ఫూర్తిని.. దానగుణాన్ని నేర్పించాలని ఆయన సూచించారు. అమలాపురంలోని కన్యకా పరమేశ్వరి కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం జరిగిన యర్రా బలరామమూర్తి కోనసీమ ఐ బ్యాంక్‌ సప్తమ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మానవ సేవే మాధవ సేవ సూక్తిని అందరూ తప్పకు పాటించాలని లక్ష్మీనారాయణ సూచించారు. నేత్ర, అవయవ, రక్త దానాలు చేయడం అలవర్చుకోవాలని కోరారు. మనం చనిపోయిన తర్వాత మన్నులో కలిసిపోయే అవయవాలను నిర్వీర్యం చేసే కంటే అవయవదానం చేస్తే మన మరణాంతరం మానవాళికి ఉపయోగపడతాయని గుర్తు చేశారు. ఒక పల్లె ప్రాంతమైన కోనసీమలో యర్రా బలరామమూర్తి ఐ బ్యాంక్‌ గత ఏడేళ్లలో 1200 కార్నియాలను సేకరించి 700 మందికి కంటి చూపు ఇచ్చేందుకు దోహదపడిదంటే సాధారణ విషయం కాదని లక్ష్మీనారాయణ అన్నారు. ఆ ఐబ్యాంక్‌ చైర్మన్‌ యర్రా నాగబాబును, వారి తండ్రి యర్రా బలరామమూర్తిని సభాముఖంగా ప్రశంసించారు. మనకు మంచి చేసినప్పుడు భగవంతుడికి మన థాంక్స్‌ చెప్పుకోవడం కాదు... సమాజ హితమైన నేత్ర, రక్త, అవయవ దానాలు చేసినప్పుడు భగవంతుడే మనకు థాంక్స్‌ చెప్పినట్టుగా మీ దానాలు పొందిన వారే పొగుడుతున్నప్పుడు అనిపిస్తుందని లక్ష్మీనారాయణ అన్నారు. ఐ బ్యాంక్‌ చైర్మన్‌ యర్రా నాగబాబు అధ్యక్షతన జరిగిన ఈ వేడుక సభలో రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, పాముల రాజేశ్వరిదేవి, చిల్లా జగదీశ్వరి, రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ యాళ్ల దొరబాబు, రాష్ట్ర కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీ, రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ యర్రా నవీన్, రాష్ట్ర కో ఆపరేటివ్‌ యూనియన్‌ డైరెక్టర్‌ గణపతి వీర రాఘవులు, రాష్ట్ర కాపు వెబ్‌ సైట్‌ అధ్యక్షుడు యాళ్ల వరప్రసాద్‌ పాల్గొని ఐ బ్యాంక్‌ సేవలను కొనియాడారు. తొలుత వార్షికోత్సవ వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి లక్ష్మీనారాయణ ప్రారంభించారు. అనంతరం నేత్రదానం చేసిన వారి కుటుంబీలకు, ప్రొత్సహించిన వారికి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. కోనసీమ ఐ బ్యాంక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అయ్యగారి వెంకటేశ్వరరావు, టెక్నీషియన్‌ కె. స్వర్ణలత సేవలను కూడా వక్తలు కొనియాడారు.
మరిన్ని వార్తలు