సెల్ టవరెక్కి నిరసన..

25 May, 2016 01:55 IST|Sakshi
సెల్ టవరెక్కి నిరసన..

తన వ్యవసాయ భూమిని ఇతరులు
ఆక్రమించుకున్నారంటూ
బాధితుడు నర్సింలు ఆవేదన
అధికారులు పట్టించుకోనందునే
మూడుసార్లు టవరెక్కాల్సి వచ్చిందన్న బాధితుడు కేసు నమోదు

 రామాయంపేట:  తన వ్యవసాయ భూమిని ఇతరులు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ రామాయంపేట గ్రామ పంచాయతీ ప రిధిలోని గొల్పర్తి గ్రామానికి చెందిన సాదుల నర్సింలు అనే యువకుడు మంగళవారం రామాయంపేటలో సెల్ టవరెక్కి హల్‌చల్ సృష్టించారు. కాగా బాధితుడు నర్సింలు ఈ సమస్యపై సెల్ టవరెక్కడం ఇది మూడోసారి. వివరాల్లోకి వెళితే నర్సింలుకు సంబంధించిన భూమి విషయంలో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్థాపం చెందిన నర్సింలు నేరుగా రామాయంపేట వచ్చి సెల్ టవరెక్కి సుమారు 2గంటలపాటు హల్‌చల్ సృష్టించారు. దీంతో పోలీసులతోపాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, దిగిరావాలని  బంధువులతోపాటు పోలీసులు  నచ్చజెప్పినా నర్సింలు వినలేదు.  స్థానిక ఫైర్ సిబ్బంది టవరెక్కి నర్సింలుకు నచ్చజెప్పి కిందకు దించారు. అనంతరం నర్సింలు మాట్లాడుతూ తన వ్యవసాయ భూమితోపాటు ఇంటి స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నా..రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయపై పలుమార్లు  ఫిర్యాదు చేసినా అధికారులు  పట్టించుకోలేదన్నారు.టెవరెక్కి న్యూసెన్స్ సృష్టించిన నర్సింలుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు