తీరని రుణం.. తప్పని రణం

25 Mar, 2016 02:17 IST|Sakshi
తీరని రుణం.. తప్పని రణం

రుణమాఫీపై అన్నదాత నిస్తేజం
విడతల వారీ మాఫీతో ఫలితం లేదని ఆవేదన
ఒకే మారు చేస్తేనే మేలంటున్న రైతులు
మరోవైపు  కొత్త రుణాల  ఊసేలేదని మండిపాటు

సాక్షి, సంగారెడ్డి: రుణమాఫీపై రైతుల్లో నిర్వేదం వ్యక్తమవుతోంది. విడతల వారీ మాఫీ ప్రక్రియపై వారిలో అసంత ృప్తి నెలకొంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తరహాలో ప్రస్తుత కేసీఆర్ ప్రభుత్వం కూడా వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద లక్ష రూపాయలు ఒకేమారు మాఫీ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. పూర్తిగా మాఫీ కాకపోవడంతో బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వటంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు, నాల్గో విడత రుణమాఫీ మొత్తం ఒకేమారు రైతుల ఖాతాల్లో జమచేస్తామని ప్రభుత్వం ఇటీవల వరకు చెబుతూ వచ్చింది.

అయితే ఇటీవల బడ్జెట్‌లో ఆ మేరకు కేటాయింపులు లేకపోవటంతో రైతుల్లో అసంత ృప్తి వ్యక్తమవుతోంది. రైతులు, రైతు సంఘాల నాయకులు ప్రభుత్వం తీరును తప్పుబడుతున్నారు. ప్రస్తుతం కరువు తాండవిస్తున్న వేళ  ఒకేమారు మాఫీ అయ్యేలా చర్యలు  తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కొత్తగా రుణాలు మంజూరు చేయిస్తేనే మేలు జరుగుతుందని అంటున్నారు. కాగా వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పక్కనపెట్టి రుణమాఫీలో బోగస్ లబ్ధిదారులు ఉన్నారంటూ ఆధార్‌లింకేజీ దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం తగదని రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రుణమాఫీకి సంబంధించి వ్యవసాయశాఖ, బ్యాంకర్ల మధ్య సమన్వయం కనిపించటంలేదు. మొదటి, రెండో విడత రుణమాఫీ సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని బ్యాంకర్లు చెబుతుండగా..  రుణమాఫీ కింద డబ్బులు జమ చేసిన వాటికి బ్యాంకర్ల నుంచి యూసీలు అందలేదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.  

రెండు విడతల్లో డబ్బులు విడుదల?
జిల్లాలో రుణమాఫీ పథకం కింద 4,06,005 మంది రైతులు అర్హులుగా తేలారు. వీరికి సంబంధించిన రూ.2014 వేలకోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉంది. మొదటి విడతగా ప్రభుత్వం 25 శాతం సొమ్ము రూ.503 కోట్ల విడుదల చేసింది. ఇందులో 3,96,191 మంది రైతులకు సంబంధించిన ఖాతాల్లో రూ.483 కోట్లు జమ చేశారు. వేర్వేరు కారణాలతో అనర్హులుగా తేలిన రైతులకు సంబంధించిన రుణమాఫీ మొత్తం రూ.20 కోట్లను తిరిగి ప్రభుత్వం ఖాతాల్లో జమ చేశారు.

రెండో విడత రుణమాఫీ సొమ్మును ప్రభుత్వం రెండు విడతలుగా విడుదల చేసింది. జిల్లాలోని 3,96,191 మంది రైతులకు సంబంధించి రెండో విడత రుణమాఫీ డబ్బులు రూ.483 కోట్లుకు గాను రైతుల ఖాతాల్లో రూ. 459 లక్షలు జమ చేశారు. మిగతా రూ. 24 లక్షలు జమ కావాల్సి ఉంది. రైతుల ఖాతాల్లో రెండు విడతల్లో రుణమాఫీ డబ్బులు జమచేసినప్పటికీ రైతులకు కొత్త రుణమాలు మాత్రం పూర్తిగా మంజూరు కాలేదని చెప్పవచ్చు.  కొత్త రుణాల కోసం రైతులు బ్యాంకర్ల చూట్టూ తిరిగినా ఫలితం కానరావటంలేదని వ్యవసాయకార్మిక సంఘం నాయకులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు