‘నగర పాలన భ్రష్టు పట్టింది’

27 Apr, 2017 23:33 IST|Sakshi
‘నగర పాలన భ్రష్టు పట్టింది’

అనంతపురం అర్బన్‌ : నగర పాలక సంస్థ పాలన అస్తవ్యస్తంగా, అశాస్త్రీయంగా మారిందని, పైసలకు కక్కుర్తిపడి పనులు చేస్తున్నారంటూ మాజీ మంత్రి, పీసీసీ ఉపాధ్యక్షులు సాకే శైలజానాథ్‌ తీవ్ర స్థాయిలో విమర్శించారు. మూడున్నరేళ్లలో 12 మంది కమిషనర్లు మారడమంటే ఇంత కంటే సిగ్గుచేటన్నారు. ప్రస్తుతం వచ్చే కమిషనర్‌ అయినా బిల్లులపై సంతకాలు చేసేందుకు కాకుండా పాలన గాడిలో పెట్టాలన్నారు. జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో గురువారం నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నగర పాలక సంస్థ పాలనకు దిశా నిర్దేశం లేకుండా పోయిందన్నారు.

పైప్‌లైన్‌ నిర్మాణం పేరుతో నగరాన్ని తవ్వేశారన్నారు. చేయని పనులకు బిల్లులు పెట్టారంటూ  తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్లే రెండు వర్గాలు చీలిపోయి ధర్నాలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంతకు దిగజారిందో అర్థమవుతోందన్నారు.  వాస్తవంగా నగరాన్ని నిర్మించి కాంగ్రెస్‌ పార్టీయే అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి చొరవతో పీఏబీఆర్‌ పైప్‌లైన్‌ పథకం ఏర్పాటయిందని, నగరాభివృద్ధికి నిధులు విడుదల చేసిందని కాంగ్రెస్‌ హయాంలోనే అనే విషయం ప్రజలకు తెలుసన్నారు. ప్రజలు కోరుకునే పాలన అందించకపోతే కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు దాదాగాంధీ, పీసీసీ అధికార ప్రతినిధి కేవీరమణ, ప్రధాన కార్యదర్శులు వాసు, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు