తెరపైకి మాజీ ఎమ్మెల్యే గూండా

26 May, 2016 13:50 IST|Sakshi

  సుదీర్ఘకాలం తర్వాత పార్టీ సమావేశంలో పాల్గొన్న గూండా
  టీడీపీ ఆశావహుల్లో ఆవేదన
  మంత్రికి చెక్ పెట్టేందుకు పావులు కదిపిన కళా


శ్రీకాకుళం: శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గూండా అప్పలసూర్యనారాయణ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిత్వం కోసమే మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారా అన్న సందేహం పలువురిలో వ్యక్తమవుతోంది. గడచిన శాసనసభ ఎన్నికల్లో ఆయన సతీమణి గూండా లక్ష్మీదేవి బరిలో ఉన్నప్పటికీ ఆయన తూతూ మంత్రంగానే ప్రచారం జరపడం, ఆ తర్వాత పార్టీకి, అధినాయకునికి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అలాంటి వ్యక్తి బుధవారం జరిగిన శ్రీకాకుళం నియోజకవర్గస్థాయి పార్టీ సమావేశంలో పాల్గొనడం చర్చకు తెర తీసింది.

ఆశావహుల్లో ఆందోళన..
మేయర్ అభ్యర్థిత్వం కోసం ఇప్పటికే చాలా మంది అదిష్టానానికి అర్జీలు పెట్టుకున్నారు. వీరిలో పలువురికి స్థానిక ప్రజాప్రతినిధితో పాటు రాష్ట్రస్థాయిలోని కొందరు ప్రముఖులు ఒకరికి తెలియకుండా ఒకరికి అభయమిస్తూ వచ్చారు. కొందరు సీనియర్లు మాత్రం దీనిపై తొలి నుంచీ అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నా రు. వారి అనుమానాలకు బలం చేకూర్చేలా సుదీర్ఘకాలం మౌనంగా ఉన్న అప్పలసూర్యనారాయణ దీక్షను వీడి సమావేశంలో పాల్గొనడం ఆశావహుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల ముందు, తర్వాత పార్టీ అధినేతను బహిరంగంగానే దూషించి, కనీసం కలవనైనా కలవని నాయకునికి తిరిగి ప్రాముఖ్యత కలిగించడంపై వారు రగిలిపోతున్నారు.

జిల్లా కేంద్రంలో ఓ సామాజికవర్గం ఈ అభ్యర్థిత్వం కోసం ఎదురుచూస్తోంది. వారికి దాదాపుగా అభ్యర్థిత్వం ఖరారైనట్లుగానే దేశంలోని కొందరు నాయకులు నమ్మబలుకుతూ వచ్చారు. ఇలాంటి వారంతా బుధవారం రాత్రి ఓ చోట చేరి భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకున్నారు. అభ్యర్థిత్వం అధికారికంగా ప్రకటించేవరకు వేచి చూసే ధోరణి ప్రదర్శించాలని అనుకున్నారు. అయితే అప్పలసూర్యనారాయణ అభ్యర్థిత్వం ఖరారైనపక్షం లో బహిరంగంగానే వ్యతిరేకించాలని మాత్రం వీరంతా నిశ్చయించారు.

 కళా భళా..
రాష్ర్టమ్రంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు చెక్ పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకటరావు పావులు కదిపారని, దీన్ని గూండా కుంటుంబ సభ్యులు తమకు అనుకూలంగా మలుచుకున్నారన్న చర్చ టీడీపీలో జరుగుతోంది. అప్పలసూర్యనారాయణ ద్వారా మంత్రికి చెక్ పెట్టాలని భావించిన కళా కార్పొరేషన్ ఎన్నికలను అందుకు వేదికగా యోచించారు. గూండా కుటుంబ సభ్యులు మినహా వేరెవరికైనా మేయర్ అభ్యర్థిత్వం ఇప్పించాలని అచ్చెన్నాయుడు తొలి నుంచీ యోచిస్తున్నారు. అప్పలసూర్యనారాయణకు మేయర్ అభ్యర్థిత్వంపై మోజు ఉన్నా ఎప్పటినుంచో పార్టీకి దూరంగా ఉండడం వల్ల మౌనంగా ఉం డిపోయారు. ముఖ్యమంత్రి తన వద్దకు వస్తే గానీ తాను ఆయన వద్దకు వెళ్లనని తొలి నుంచి భీష్మించుకు కూర్చున్న విషయం బహిరంగ రహస్యం.

దీంతో కళావెంకటరావు ఓ ప్రణాళికను రూపొందించి ఇటీవల ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చినపుడు షెడ్యూల్‌లో లేకపోయినా అరసవల్లి దేవస్థానానికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి పక్కనే ఉన్న ఎమ్మెల్యే ఇంటికి ముఖ్యమంత్రిని తీసుకువెళ్లడంలో సఫలమయ్యారు. దీంతో అప్పలసూర్యనారాయణ అలక వీడారు. పార్టీ సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఈయన అభ్యర్థిత్వం మేయర్ పదవికి ఖరారైతే అధికార పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.
 

మరిన్ని వార్తలు