సమీక‘ రణం’

19 Sep, 2016 23:50 IST|Sakshi
సమీక‘ రణం’
  •  పోర్టు, కారిడార్‌ నోటిఫికేషన్‌పై  బందరు రైతుల ఆందోళన
  • ఇప్పటికే భూముల క్రయ విక్రయాలు లేక ఇక్కట్లు
  • మూడేళ్లలో లక్ష ఎకరాలు సమీకరిస్తారనే అనుమానాలు
  •  సర్కారు వైఖరిపై ప్రత్యక్ష పోరాటానికి సన్నాహాలు
  •  
     

    టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన భూ సమీకరణ నోటిఫికేషన్‌పై బందరు మండల రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. తమ బతుకులు రోడ్డున పడవేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆందోళన చెందుతున్నారు. ఎంఏడీఏ కింద లక్ష ఎకరాలకు పైగా సమీకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం తొలివిడతలో భాగంగా 33 వేల ఎకరాలను లాక్కునే కుట్రకు తెరతీసిందనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ పన్నాగాన్ని ప్రత్యక్ష, న్యాయ పోరాటాల ద్వారానే ఎదుర్కొంటామంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు వదులుకొనేది లేదని తేల్చి చెబుతున్నారు.

     
    మచిలీపట్నం : తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణ ప్రక్రియ రైతులను నట్టేట ముంచేలా ఉంది. ఈ ఏడాది జూలైలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో మచిలీపట్నం ఏరియా డెవలప్‌ మెంట్‌ అథారిటీ (ఎంఏడీఏ)కి 1.05 లక్షల ఎకరాల భూమిని సమీకరించాలని నిర్ణయించారు. దీనిపై రైతులకు ఇచ్చే ప్యాకేజీ వివరాలను జీవో నెంబరు 185లో పొందుపరిచారు. మచిలీపట్నం మండలంలో 27 , పెడన మండలంలో ఒకటి కలిపి మొత్తం 28 రెవెన్యూ గ్రామాల్లో 1.05 లక్షల ఎకరాల భూమి ఉందని, బందరు పోర్టు, పారిశ్రామిక కారిడార్‌ ఇతర పరిశ్రమలు నిర్మించనున్నట్లు అప్పట్లో ప్రకటించారు. 1.05 లక్షల ఎకరాల భూమిని సమీకరించనున్నట్లు సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.  ఆ తరువాత 1.05 లక్షలు కాదు, 14 వేల ఎకరాలు మాత్రమే సమీకరిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు పొంతన లేని ప్రకటనలు చేశారు. 

    ఇది తొలివిడతలో భాగమా..

    తాజాగా ప్రభుత్వం ఆదివారం అర్ధరాత్రి 33,327 ఎకరాల భూ సమీకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ మేరకు 28 గ్రామాల పరిధిలో 14,600 ఎకరాల పట్టాభూమి, 8,900 ఎకరాల అసైన్డ్‌భూమి, 9,700 ఎకరాలకు పైగా ప్రభుత్వభూమి ఉంది. అయితే జూలైలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో 1.05 లక్షల ఎకరాల భూమిని సమీకరిస్తామని ప్రకటించడంతో ఈ 33 వేల ఎకరాలు తొలివిడతలో భాగంగా సమీకరిస్తున్నారా అనే భయం రైతుల్లో నెలకొంది. టీడీపీ ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల కాలపరిమితి ఉండడంతో  ఏడాదికి 33 వేల ఎకరాల చొప్పున భూమిని సమీకరిస్తారనే అనుమానాలు  రైతులను వెంటాడుతున్నాయి. బందరు మండలంలోని మొత్తం భూమిని ప్రభుత్వం కాజేసి రైతులను ఇక్కడి నుంచి సాగనంపే ప్రయత్నం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక భూసమీకరణ నోటిఫికేషన్‌ పూర్తి వివరాలు మంగళవారం వెల్లడికానున్నాయి.

    ఏడాదిగా ఇబ్బందులే :

    2015 ఆగస్టు 29న 30వేల ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అప్పటి నుంచి బందరు మండలంలోని భూములకు బ్యాంకులు పంట రుణాలను నిలిపివేశాయి. రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో భూముల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. దీని వెనుక  పాలకుల కుట్ర దాగివుందనే అనుమానాలు లేకపోలేదు. తిరిగి భూసేకరణ నోటిఫికేషన్‌ గడువు ఏడాది పాటు పెంచి ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఎంఏడీఏను ఏర్పాటు చేశారు. జూలై 23న రైతులకు ఇచ్చే ప్యాకేజీ వివరాలను జీవో నెంబరు 185 ప్రభుత్వం వెల్లడించింది. అనంతరం టీడీపీ నాయకుల అనుచరులు 400 ఎకరాలకు పైగా భూములను ఎకరం రూ. 25 లక్షల చొప్పున కొనుగోలు చేసినట్లు సమాచారం. తాజాగా భూసమీకరణ నోటిఫికేషన్‌ జారీ కావడంతో టీడీపీ నాయకులు కొనుగోలు చేసిన భూములను ఎంఏడీఏకు ఇస్తామని లేఖలు ఇప్పించే పనిలో అధికార పార్టీ నేతలు నిమగ్నమయ్యారు.

    ప్రత్యక్ష పోరాటమే :

    ప్రభుత్వం భూసమీకరణ నోటిఫికేషన్‌ జారీ చేసినా రైతుల అంగీకారం లేకుండా సెంటు భూమి కూడా తీసుకోవడానికి వీలు లేని పరిస్థితి. రాజధాని అమరావతిలో భూమిని సమీకరించి నోటిఫికేషన్‌ జారీ చేయగా, మచిలీపట్నంలో భూసమీకరణ నోటిఫికేషన్‌ జారీ చేసిన తరువాత భూమిని సమీకరించనున్నారు. ఇక్కడ నోటిఫికేషన్‌ జారీ అయిన నేపథ్యంలో రెవెన్యూ సిబ్బంది సర్వే నెంబర్ల ఆధారంగా రైతుల అభిప్రాయ సేకరించాలి. అంగీకార పత్రాలు తీసుకోవాలి.అయితే భూములు వదులుకునేందుకు తాము సిద్ధంగా లేమని, ఓ వైపు ప్రత్యక్ష పోరాటం చేస్తూనే, మరో వైపు న్యాయపరంగా పోరాటం చేస్తామని రైతులు తేల్చి చెబుతున్నారు.
మరిన్ని వార్తలు