వడ్డీ రాయితీకి చంద్రగ్రహణం

4 Apr, 2017 00:04 IST|Sakshi
  • మూడేళ్లలో రూ.90 కోట్లు పెండింగ్‌
  • సహకారం... రైతులకు రుణపాశం
  • చేష్టలుడిగి చూస్తున్న ప్రజాప్రతినిధులు
  •  
    సహకార రంగానికి ప్రభుత్వ సహకారం కొరవడుతోంది ... ఊపిరి పోయాల్సిన సర్కారే ఊపిరితీస్తోంది. రుణాలపై వడ్డీ రాయితీకి రిక్త హస్తం చూపుతూ రైతుల ఆశలకు పాడి కట్టేయడానికే అడుగులు వేస్తోంది. గడచిన మూడేళ్లుగా వడ్డీ రాయితీ సొమ్ము విడుదల చేయకపోవడమే ఇందుకు ఉదాహరణ. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రైతుల జీవితాలతో దాగుడు మూతలు ఆడడంతో పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటంలా పరిస్థితి తయారైంది.  ప్రభుత్వం విడుదల చేస్తుందనే నమ్మకంతో ఒక ఏడాది వడ్డీ రాయితీ మినహాయించి రుణాలు జమచేసుకున్న సహకార సంఘాలు 
    నేడు దిక్కుతోచని పరిస్థితిని  ఎదుర్కొంటున్నాయి. 
     
    సాక్షి ప్రతినిధి, కాకినాడ :
    సహకార రుణాలపై వడ్డీ రాయితీకి ప్రభుత్వం మంగళంపాడేసేలా కనిపిస్తోంది. గడచిన మూడేళ్లుగా వడ్డీ రాయితీ సొమ్ము విడుదల చేయకపోవడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాయితీ సొమ్ము విడుదల చేయకుండా రైతులను, సహకార సంఘాలను ఇబ్బందుల పాల్జేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేస్తుందనే నమ్మకంతో ఒక ఏడాది వడ్డీ రాయితీ మినహాయించి రుణాలు జమచేసుకున్న సహకార సంఘాలు నష్టాల్లో కూరుకుపోయాయి. మరో ఏడాది రాయితీ కోసం జీఓ కూడా విడుదలచేసి రాయితీ సొమ్ము మాత్రం విడుదల చేయకుండా ప్రభుత్వం మొండిచేయి చూపింది. ఈ రకంగా గడచిన మూడేళ్లుగా సహకార రంగంలో రైతుల రుణాలపై ఇవ్వాల్సిన సుమారు రూ.90 కోట్ల రాయితీ విడుదల చేయకుండా సర్కార్‌ మీనమేషాలు లెక్కిస్తోంది. శుక్రవారం(మార్చి 31)తో ఆర్థిక సంవత్సరం ముగిసినా ఈ ఏడాది రాయితీ విడుదల కోసం ఎటువంటి జీఓ విడుదల కాలేదు. ఈ రకంగా గడచిన మూడేళ్లుగా సర్కార్‌ సహకార రైతులను రాయితీ పేరుతో దగా చేస్తోందని రైతు ప్రతినిధులు మండిపడుతున్నారు.
     
    ఏ రుణాలపైనా రాయితీ ఇవ్వక...
    సహకార సంఘాల్లో తీసుకున్న స్వల్ప కాలిక రుణాలపైనే కాకుండా దీర్ఘకాలిక రుణాలపై ఆరు శాతం వడ్డీ రాయితీ కూడా విడుదల చేయడం లేదు. ప్రభుత్వ నిర్వాకంతో సహకార సంఘాలు ఆర్థికంగా పతనం వైపు పయనిస్తున్నాయి. సవాలక్ష కారణాలతో జిల్లాలోని 297 సహకార సంఘాల్లో 70 శాతం సంఘాలు ఆర్థిక నిల్వలు తరిగిపోయాయి. 2013లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో జీరో పర్సంట్‌ వడ్డీ రాయితీకి జీవో నెం.270 జారీ అయింది. ఆ తరువాత ఏడాది కూడా అదే జీవోతో వడ్డీ రాయితీని కొనసాగించింది. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సహకార రాయితీలకు గ్రహణం పట్టుకుంది. రాయితీల అమలును ప్రభుత్వం గాలికొదిలేసి రైతులను నడిసంద్రంలో ముంచేసింది. ప్రభుత్వం విడుదల చేస్తుందనే నమ్మకంతో మెజార్టీ సహకార సంఘాలు రైతులకు రుణాలు ఇచ్చి వడ్డీ రాయితీలను తను సొంత నిధులతో అమలు చేస్తూ వస్తున్నాయి. ఆ తరువాత ప్రభుత్వం ఆ మేరకు రాయితీ సొమ్ము జమచేయడం సా«ధారణంగా జరిగేదే. బాబు గద్దెనెక్కాక రాయితీలను రైతులకు సహకార సంఘాలు అమలు చేస్తున్నా సంఘాల ఖాతాల్లో రాయితీ నిధులు ప్రభుత్వం జమ చేయకపోవటంతో సంఘాలు ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. జిల్లాలోని 297 సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న రెండున్నర నుంచి మూడు లక్షల మంది రైతులకు సుమారు రూ.90 కోట్ల రాయితీలు అందినా... ఆ మేర నిధులను ప్రభుత్వం తిరిగి సంఘాలకు జమ చేయలేదు. 
     
    గత మూడేళ్ల రాయితీల బకాయిలు రూ.90 కోట్లు
    స్వల్ప కాలిక రుణాలపై ఇస్తున్న జీరోపర్సంట్‌ వడ్డీ రాయితీలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇచ్చే 4 శాతం వడ్డీ రాయితీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 3 శాతం రాయితీలు 2014 నుంచి విడుదల కావడం లేదు. ఇలా రాయితీల బకాయిలు గడచిన మూడేళ్ల నుంచి జిల్లాలో రూ.75 కోట్లు, దీర్ఘ కాలిక రుణాలపై ఆరు శాతం వడ్డీ రాయితీ రూ.15 కోట్లు కూడా సహకార సంఘాలకు జమ కావాల్సి ఉంది.  ఈ క్రమంలో ఈ ఏడాది జీరో పర్సంట్‌ వడ్డీ రాయితీ అమలు చేస్తుందా లేదా అనే అంశంపై ఇంతవరకు స్పష్టత లేదు. ఆర్థిక సంవత్సరం శుక్రవారం (మార్చి 31) ముగిసినా చంద్రబాబు సర్కార్‌లో కనీస స్పందన లేకపోవడంతో జీరో పర్సంట్‌ వడ్డీ రాయితీకి మంగళంపాడినట్టేనా అని రైతులు అనుమానపడుతున్నారు. రాయితీ విడుదల చేయకుంటే జిల్లాలో రైతులు, సహకార సంఘాలు తీవ్రంగా నష్టపోతారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో సహకార వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
    2015–16లో పంట రుణాలు రూ.వెయ్యి 62 కోట్లు మంజూరు చేశారు. రుణాలు సకాలంలో జమ చేసిన లక్షా 66 వేల మంది రైతులు, దీర్ఘకాలిక రుణాలు సకాలంలో చెల్లించిన 66 వేల మంది  రైతులకు వడ్డీ రాయితీ ఇంతవరకు మంజూరు కాలేదు. 2016–17లో 54 వేల మంది రైతులకు స్వల్పకాలిక రుణాలు రూ.305 కోట్లు పంపిణీ చేశారు. 60 వేల మంది రైతులకు రూ.180 కోట్లు దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేశారు.అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సమస్య తీవ్రతను సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని రైతులు కోరుతున్నారు.
     
     
     
    ఇదేమి బరితెగింపు
    రైతులకు రుణ మాఫీ అమలు చేయడంతో వడ్డీ రాయితీలు అవసరం లేదన్న ధోరణిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన మాటను నీటిమూటతో రుణమాఫీ అరకొరగా చేశారు. కానీ పూర్తిగా రుణమాఫీ చేసినట్టు చెప్పుకుంటూ రాయితీలకు మంగళం పాడేందుకు తెగబడటం ఎంత వరకు సమంజసమని రైతు సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో వడ్డీ రాయితీ భరించి రైతులకు అమలు చేసి తిరిగి ఆ నిధుల జమ కోసం ఎదురు చూస్తున్న సంఘాలకు ప్రభుత్వం మొండి చేయిచూపితే సంఘాల భవితవ్యం ఏమిటని పాలకవర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కోట్లలో వడ్డీ రాయితీ సంఘాలు, రైతులకు జమకాకున్నా అధికార పార్టీ ఎమ్మెల్యేలు పెదవివిప్పడం లేదు. ఎమ్మెల్యేలు చంద్రబాబు వద్దకు వెళ్లి ధైర్యంగా ఈ సమస్యను వివరించి రాయితీ నిధులు విడుదల చేయించటంలో చేతులెత్తేశారు. సీఎంపై ఒత్తిడి తెస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని కొందరు సహకార అధికారులు అభిప్రాయపడుతున్నారు. 
     
    వడ్డీ రాయితీ ఎత్తేస్తారేమో
    ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రం మొత్తానికి వడ్డీ లేని రుణాలకు రూ.172 కోట్లు, పావలా వడ్డీకి రూ.5 కోట్లు ప్రతిపాదించారు. రాష్ట్రం మొత్తానికి కేటాయించిన వడ్డీ రాయితీ మన జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రూ.90 కోట్లకుపోగా మరొక జిల్లాకు కూడా సరిపోదు. ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఇటీవల జిల్లాకు కేవలం రూ.9 కోట్లు కేటాయించి చేతులుదులుపేసుకుంది. అది ఏ మూలకు వస్తుంది. భవిష్యత్‌లో వడ్డీ రాయితీని ఎత్తేసే ఎత్తుగడ ఉన్నట్టుగా కనిపిస్తోంది.  
    – జున్నూరి బాబి, డీసీసీబీ మాజీ డైరెక్టర్, అల్లవరం.
     
మరిన్ని వార్తలు