కౌలురైతు.. కుదేలు..

31 Jul, 2016 23:45 IST|Sakshi
కౌలురైతు.. కుదేలు..
అందరికీ అందని రుణ అర్హత కార్డులు
కార్డులున్నవారికీ అప్పులివ్వని బ్యాంకులు
అందని ఇన్సూరెన్స్, ఇన్‌పుట్‌ సబ్సిడీలు
 
బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా.. రాయవరం మండలం వి.సావరం గ్రామానికి చెందిన ఇతని పేరు సిరికి కృష్ణారావు. 10 ఎకరాలు కౌలుకు సాగు చేస్తున్నాడు. రుణ అర్హత కార్డు ఇచ్చి ఐదేళ్లవుతోంది. ఏటా రెన్యువల్‌ చేయిస్తున్నాడు. రుణం కోరుతూ ఇటీవల బ్యాంకులకు తిరిగినా ఏ బ్యాంకూ రుణం మంజూరు చేయలేదు. దీంతో అప్పులు చేసుకుని వ్యవసాయానికి పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు రుణ అర్హత కార్డులు ఎందుకు ఇచ్చారో తెలియని పరిస్థితి ఏర్పడిందని కౌలు రైతు సిరికి కృష్ణారావు ఆవేదనగా తెలిపాడు.
 
అమలాపురం : 
‘పండించేవారికే పంట రుణాలు.. పెట్టుబడి రాయితీలు.. పంటల బీమా పరిహారం.. యాంత్రీకరణ ఫలాలు’ అంటూ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. కౌలు రైతులకు ఒరిగేదేమీ కనిపించడం లేదు. జిల్లాలో మూడొంతుల మంది కౌలుదారులే సేద్యం చేస్తున్నారు. వారిలో ఒకవంతు మందికి మాత్రమే రుణ అర్హత కార్డులున్నాయి. వారిలో సగం మందికి కూడా రుణాలు ఇవ్వడం లేదు. ఫలితంగా అటు పెట్టుబడికి రుణాలందక.. పంట దెబ్బతింటే పరిహారం అందక కౌలుదారులు కుదేలవుతున్నారు. జిల్లాలో ప్రతి ఐదుగురు రైతుల ఆత్మహత్యల్లో నాలుగు కౌలురైతులవే ఉంటున్నాయి. దీనినిబట్టి వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. జిల్లావ్యాప్తంగా 4 లక్షల మంది కౌలు రైతులున్నారని అంచనా. వీరిలో 80 శాతం మంది వరి సేద్యాన్నే నమ్ముకున్నారు. వీరిలో గత ఏడాది 1.18 లక్షల మందికి మాత్రమే రుణ అర్హత కార్డులు ఇచ్చారు. వారిలో 40,078 మందికి మాత్రమే.. అది కూడా కేవలం రూ.82.46 కోట్లు మాత్రమే రుణాలిచ్చారు. మిగిలిన రైతులు ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోంది. రుణ అర్హత కార్డులు లేక రుణాలతో పాటు ఇన్సూరెన్స్, ఇన్‌పుట్‌ సబ్సిడీ వంటివి పొందలేకపోతున్నారు. ఫలితంగా పంట నష్టం వాటిల్లినప్పుడు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి రాయితీ, బీమా పరిహారం అందక అప్పుల పాలై కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఎంత చెప్పినా టెనెంట్‌ యాక్టుకు భయపడి భూమి యజమానులు రుణ అర్హత కార్డుల మీద సంతకాలు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఇదే కౌలుదారులకు శాపంగా మారింది. మరోపక్క ఖరీఫ్‌ సాగుపై భరోసా లేకపోవడంతో బ్యాంకర్లు సైతం రుణాలిచ్చేందుకు విముఖత చూపడం కౌలుదారులకు ఇబ్బందికరంగా మారింది.
 
రెండేళ్లుగా రుణం లేదు
రాయవరం గ్రామానికి చెందిన ఇతని పేరు బొట్టా సత్యనారాయణ. నాలుగు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం రుణ అర్హత కార్డు పొందాడు. పలుమార్లు బ్యాంకులకు వెళ్లి రుణం ఇమ్మని కోరినా ఒక్కసారి కూడా రుణం మంజూరు చేయలేదు. రుణ అర్హత కార్డు ఇచ్చినా ఎటువంటి ప్రయోజనమూ లేకపోవడంతో అప్పులు చేసుకుని వ్యవసాయానికి పెట్టుబడి పెట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నాడు. 
కౌలు రైతులకు రుణాలేవీ?
కౌలు రైతులకు రుణాలిస్తామన్నారు. బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా రుణం ఇవ్వలేదు. వ్యవసాయమే జీవనాధారంగా బతికే నేను ఏటా భారీ కౌలు, అధిక పెట్టుబడులు పెట్టి భూములు కౌలుకు  సాగు చేసుకుంటున్నాను. తుపానులు, వరదలు వస్తే కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరమే. ప్రభుత్వం మంజూరు చేసే నష్టపరిహారాన్ని భూస్వాములు మాకు ఇవ్వరు. దీంతో నష్టాలు చవిచూస్తాం. మా దుస్థితిని పట్టించుకోరు.
– కె.సోమన్నదొర, ఎస్‌.జగ్గంపేట, శంఖవరం మండలం
 
>
మరిన్ని వార్తలు