సాగు సాగేనా?

4 Jun, 2016 03:19 IST|Sakshi
సాగు సాగేనా?

రుణం కోసం రైతుల ఎదురుచూపులు
వార్షిక రుణ ప్రణాళిక మొక్కుబడేనా?
రూ.6,142 కోట్లతో ప్రణాళిక ఖరారు
రూ.2,750 కోట్ల పంట రుణాల పంపిణీ లక్ష్యం
గత ఏడాది 71.71 శాతం మాత్రమే పంపిణీ 
పంట రుణాల పంపిణీలో బ్యాంకర్ల అలసత్వం

రుణాల మంజూరు కోసం అటు రైతులు, ఇటు నిరుద్యోగ యువత బ్యాంకుల చుట్టూ చక్కర్లు కొట్టడం ఏటా చూస్తూనే ఉన్నాం. రుణాలందడం లేదంటూ రైతులు తరచూ ఆందోళనలు చేపడుతున్న విషయం తెల్సిందే. ఏటా రుణ మంజూరులో మొండిచేయి చూపుతున్నారని, బ్యాంకు రుణాలందక ప్రైవేట్ అప్పులు చేసి వడ్డీల భారం మోయలేక సతమతమవుతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. వార్షిక రుణ ప్రణాళికలో మాత్రం రూ.వేల కోట్ల రుణాల పంపిణీ లక్ష్యంగా పెట్టుకుంటున్న బ్యాంకర్లు తీరా మంజూరు దశలో మోకాలడ్డుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారైనా బ్యాంకర్లు అనుకున్న లక్ష్యం మేరకు రుణాలివ్వాలని రైతులు కోరుతున్నారు.

సాక్షి, సంగారెడ్డి: జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఖరారైంది. ఇటీవల కలెక్టర్ రోనాల్డ్ రోస్ వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.6,142 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికకు బ్యాంకర్లు ఆమోదం తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి రూ.513 కోట్ల మేర వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం పెరిగింది. ఈ ప్రణాళికకు అనుగుణంగా బ్యాంకర్లు రుణాలు పంపిణీ చేస్తారా? లేదా అన్న సందేహం అన్ని వర్గాల్లో నెలకొంది. గత ఏడాది రుణ ప్రణాళికలో అన్ని రంగాల్లో కలిపి రూ.5,629 కోట్ల రుణాలు పంపిణీ చేయాలనే లక్ష్యం కాగా బ్యాంకర్లు రూ.4,037 కోట్ల రుణాలు మాత్రమే పంపిణీ చేశారు. రుణాల పంపిణీలో 71.71 శాతం లక్ష్యాన్ని  మాత్రమే బ్యాంకర్లు చేరుకోగలిగారు. ముఖ్యంగా రుణాల పంపిణీలో బ్యాంకర్లు అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 ఈ ఏడాది రూ.2,750 కోట్ల పంట రుణాలు..
2016-17 వార్షిక రుణ ప్రణాళికను అనుసరించి ఈ ఏడాది ఖరీఫ్, రబీలో మొత్తం రూ.2,750 కోట్ల పంట రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లక్ష్యానికి అనుగుణంగా రైతులకు ఏ మేరకు రుణాలు అందజేస్తారో వేచి చూడాల్సి ఉంది. గత ఏడాది పంట రుణాల పంపిణీ పూర్తిస్థాయిలో జరగలేదు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూ.2,666 కోట్లు పంపిణీ చేయాల్సి ఉండగా బ్యాంకర్లు రూ.2,069 కోట్ల మేర పంపిణీ చేశారు. కరువు కాలంలో లక్ష్యం మేరకు పంపిణీ చేయకపోవడంతో బ్యాంకర్ల తీరు విమర్శలకు దారితీసింది. ఇదిలావుంటే గత వార్షిక రుణ ప్రణాళికకు అనుగుణంగా ప్రభుత్వ పథకాల గ్రౌండింగ్, మధ్య, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు రుణాలు ఇవ్వడంలోనూ బ్యాంకర్లు లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు.

 వ్యవసాయరంగానికి రూ.3,720 కోట్లు ..
రూ.6,142 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక ఖరారు కాగా ఇందులో ప్రాధాన్యత రంగాలకు రూ.5,546 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.595 కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగానికి మొత్తం రూ.3,720 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా అందులో రూ.2,750 కోట్ల పంట రుణాలు అందజేయాలని బ్యాంకర్లు నిర్ణయించారు. మహిళా సంఘాలు, ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ.1,195 కోట్లు, చిన్న,మధ్యతరహా పరిశ్రమలకు రూ.630 కోట్లు పంపిణీ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. వార్షిక రుణ ప్రణాళికలో మొత్తంగా 44.78 శాతం పంట రుణాలు... అగ్రికల్చర్ టర్మ్‌లోన్, వ్యవసాయరంగంలో మౌలిక సదుపాయాలకల్పన 15.80 శాతం, చిన్నమధ్యతరహా పరిశ్రమలకు 10.26 శాతం, మహిళా గ్రూపులు, ఇతర రంగాల వారికి 19.46 శాతం, అనుత్పాదక రంగాలకు 9.70 శాతం రుణాలు అందజేయాలని బ్యాంకర్లు నిర్ణయం తీసుకున్నారు. బ్యాంకర్లు వార్షిక రుణ ప్రణాళికకు అనుగుణంగా ఏ మేరకు రుణాలు పంపిణీ చేస్తారో చూడాలి.

 పంట రుణాలపైనే అందరి దృష్టి...
పంట రుణాల పంపిణీకి బ్యాంకర్లు భారీ లక్ష్యాన్ని పెట్టుకున్నా అందుకనుగుణంగా మంజూరు చేయడం లేదన్న విమర్శలున్నాయి. గత ఖరీఫ్, రబీలోనూ పంటలు పండక రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. కరువుతో అల్లాడుతున్న రైతులు ప్రస్తుతం ఖరీఫ్‌పై ఆశలు పెట్టుకున్నారు. బ్యాంకర్లు రుణాలు అందజేస్తే గట్టెక్కవచ్చని ఆశగా ఎదురుచూస్తున్నారు. వార్షిక రుణ ప్రణాళికను అనుసరించి ఈ ఏడాది రూ.2,750 కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా నిర్ణయించారు. ఖరీఫ్‌లో రూ.1,770 కోట్లు, రబీలో రూ.980 కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు. ఖరీఫ్, రబీలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు రూ.1,561 కోట్లు, ప్రైవేటు బ్యాంకులు 92.46 కోట్లు, కోఆపరేటివ్ బ్యాంకులు రూ.349 కోట్లు. గ్రామీణ బ్యాంకులు రూ.747 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ ఏడాది బ్యాంకర్లు ఏ మేరకు పంట రుణాలు పంపిణీ చేస్తారో చూడాలి మరి.

మరిన్ని వార్తలు