నాలుగు జిల్లాలు !

9 Sep, 2016 23:00 IST|Sakshi
నాలుగు జిల్లాలు !
  • కొత్తగా తొర్రూరు రెవెన్యూ డివిజన్‌
  • ఆ డివిజన్‌లోకి కొడకండ్ల
  • మరో మూడు మండలాల ప్రతిపాదనలుl
  •  పరిశీలనలో టేకుమట్ల, పెద్ద వంగర, కొమురవెల్లి 
  •  కాజీపేట వద్ద కొత్తగా మరో బ్రిడ్జి నిర్మాణం
  •  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన
  •  సీఎంతో జిల్లా ప్రజాప్రతినిధుల భేటీ
  • సాక్షిప్రతినిధి, వరంగల్‌ : ఎక్కువ మండలాలు ఉన్నందునే వరంగల్‌ జిల్లాను నాలుగు జిల్లాలుగా పునర్విభజిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాలు ఏర్పాటు చేయగా, మిగిలిన వరంగల్‌ జిల్లాలో మండలాల సంఖ్య ఎక్కువగా ఉందని... ఈ కారణంగానే నాలుగో జిల్లా ఏర్పాటును ప్రతిపాదించామని చెప్పారు. శుక్రవారం ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సీఎం కేసీఆర్‌తో జిల్లా నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాల పునర్విభజన, అభివృద్ధి అంశాలపై చర్చ జరిగింది.
     
    ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కరీంనగర్‌ ఎంపీ బి.వినోద్‌కుమార్, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రజాభిప్రాయం ప్రకారమే జిల్లాల పునర్విభజన జరుగుతుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు ఇదే తరహాలో జరిగేలా చొరవ తీసుకోవాలని జిల్లా ప్రజాప్రతినిధులను ఆదేశించారు. ‘వరంగల్‌ జిల్లాలో కొత్తగా భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాలను ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని మండలాలు యాదాద్రి, సిద్ధిపేట జిల్లాల్లో కలుస్తున్నాయి. మిగిలిన మండలాలు ఎక్కువగా ఉండడంతో వరంగల్‌ జిల్లాను రెండుగా చేయాలని ప్రతిపాదించాము. రెండు జిల్లాలు ఎలా ఉండాలనేదానిపై ప్రజాభిప్రాయం తీసుకుంటున్నాం.
     
    ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది’ అని వివరించారు. ప్రతిపాదిత మహబూబాబాద్‌ జిల్లాలోని తొర్రూరును రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా మార్చాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారు. తొర్రూరు రెవెన్యూ డివిజన్‌లో కొడకండ్ల మండలాన్ని చేర్చాలని పేర్కొన్నారు. కొత్తగా టేకుమట్ల(చిట్యాల), పెద్దవంగర(కొడకండ్ల), కొమురవెల్లి(చేర్యాల) మండలాలను ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. 
     
    నగర అభివృద్ధికి ప్రాధాన్యం
     హైదరాబాద్‌ తర్వాత రాష్ట్రంలో పెద్ద నగరమైన గ్రేటర్‌ వరంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. వరంగల్‌లో ఇప్పటికే ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటైందని... గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. జాతీయ స్థాయి టెక్స్‌టైల్‌ పార్కును త్వరలోనే నిర్మించబోతున్నట్లు తెలిపారు. వరంగల్‌ నగరం అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించామని... స్మార్ట్‌ సిటీ, హృదయ్‌లోనూ ఎంపికైనందున వరంగల్‌ను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. వరంగల్‌–హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై ఉన్న కాజీపేట బ్రిడ్జికి సమాంతరంగా మరో బ్రిడ్జిని నిర్మించి నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే రూపొందించాలని జాతీయ రహదారుల విభాగం ఈఎన్‌సీ గణపతిని ఆదేశించారు.
     
మరిన్ని వార్తలు