హైవే.. సర్వే

24 May, 2017 23:19 IST|Sakshi

వేగవంతంగా జాతీయ రహదారి భూ సేకరణ
సర్వే చేస్తున్న నాలుగు బృందాలు
భూమి రేటు పెంచాలంటున్న రైతులు


ఇదీ జాతీయ రహదారి స్వరూపం
సూర్యాపేట–ఖమ్మం దూరం  62 కిలోమీటర్లు
రహదారి వ్యయం రూ. 1000 కోట్లు
బైపాస్‌ వచ్చే గ్రామాలు ..చివ్వెంల ,మోతె, నాయకన్‌గూడెం, పాలేరు, కూసుమంచి, తల్లంపాడు
టోల్‌గేట్‌ కూసుమంచి వద్ద
పాత రహదారిని విస్తరించే గ్రామాలు.. కేశ్వాపురం, జీళ్లచెరువు, గోపాలరావుపేట
రహదారి విస్తరణ...200 అడుగులు
ప్రయాణికులు విశ్రాంతి తీసుకునే ప్రదేశం...

జీళ్లచెరువు
రహదారికి భూసేకరణ (జిల్లాలో)280 ఎకరాలు
ప్రభుత్వం ఇచ్చే ధర.. రూ. 10 లక్షల వరకు
రైతులు కోరుతున్నది రూ. 20 లక్షల వరకు
రహదారి ప్రారంభం... సూర్యాపేట
ముగింపు...మద్దులపల్లి


కూసుమంచి: రాష్ట్రీయ రహదారి.. జాతీయ రహదారిగా మారనుంది.. భూ సేకరణ ముమ్మరంగా కొనసాగుతోంది.. అలైన్‌మెంట్‌ సర్వే పూర్తికాగా.. పెగ్‌ మార్కింగ్‌ జరుగుతోంది.. నాలుగు సర్వే బృందాలు సర్వే పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. మండలంలోని మూడు గ్రామాల్లో రహదారి విస్తరించనుండగా.. రైతులు మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన ధరకు భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు.  మండలంలో ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారి భూ సేకరణ ముమ్మరంగా సాగుతోంది.

నాయకన్‌గూడెం నుంచి చింతలతండా వరకు బైపాస్‌ రోడ్డు నిర్మాణం చేపడుతుండగా.. కేశ్వాపురం నుంచి గోపాలరావుపేట వరకు ఉన్న రహదారి విస్తరించాల్సి ఉంది. కాగా.. బైపాస్‌ రోడ్డు పరిధి మండలంలో ఎక్కువగా ఉండటంతో భూ సేకరణ ముమ్మరంగా సాగుతోంది. దీనికి సంబంధించిన సర్వే వేగం పుంజుకుంది. మండలంలో బైపాస్‌ రోడ్డుకు సుమారు 210 ఎకరాలు సేకరించాల్సి వస్తోంది. దీంతో రెవెన్యూ, సర్వే అధికారులు భూ సేకరణ పనులను వేగవంతం చేశారు. ప్రస్తుతం నాయకన్‌గూడెం, భగవత్‌వీడు, జుజులరావుపేట రెవెన్యూ పరి«ధిలో అలైన్‌మెంట్‌ సర్వే పూర్తికాగా.. కూసుమంచి రెవెన్యూలో పెగ్‌ మార్కింగ్‌ జరుగుతోంది. నాలుగు సర్వే బృందాలు సర్వే పనుల్లో నిమగ్నమయ్యాయి.

మూడు గ్రామాల్లో రహదారి విస్తరణ
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా మండలంలోని కేశ్వాపురం, జీళ్లచెరువు, గోపాలరావుపేట గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న రహదారినే విస్తరించనున్నారు. ప్రస్తుతం ఈ రహదారి 100 అడుగులు ఉండగా.. దీనిని 200 అడుగుల రహదారిగా విస్తరించనున్నారు. దీంతో పై మూడు గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపులా ఉన్న నిర్మాణాలు తొలగించాల్సి ఉంటుంది.

టోల్‌ప్లాజా నిర్మాణం
రహదారి విస్తరణలో భాగంగా కూసుమంచి సమీపంలో(లక్ష్మీతిరుపతమ్మ ఆలయం ప్రాంతంలో) టోల్‌ప్లాజా నిర్మించే అవకాశం ఉంది. ఇటు సూర్యాపేట, అటు ఖమ్మంకు మధ్యలో ఈ ప్రాంతం ఉంటుందని.. అధికారులు ఇక్కడ టోల్‌ప్లాజా నిర్మాణానికి  ప్రతిపాదించారు. ఇక్కడ కొంతమేర టోల్‌గేట్‌ కొరకు ఎనిమిది లేన్లుగా రహదారిని విస్తరించాల్సి ఉంటుంది. దీంతో ఈ ప్రాంతంలో భూ సేకరణ అదనంగా చేయాల్సి ఉంటుంది.

రైతుల అభ్యంతరం
బైపాస్‌ రోడ్డు నిర్మాణంలో మండలంలోని రైతుల భూములు సేకరించాల్సి రావటంతో పలువురు రైతులు తమ భూములు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇచ్చేందుకు విముఖత చూపుతున్నారు.ప్రభుత్వం ఎకరాకు రూ.12లక్షల వరకు ఇస్తామని చెపుతుండగా.. దానిని రూ.20లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు.

సాగు భూములను రహదారి నిర్మాణానికి ఇచ్చి నష్టపోవాల్సి వస్తుందని, అందుకే తమ భూములకు రేటు పెంచాలని కోరుతున్నారు. రైతులు హైవే నిర్మాణానికి భూములు ఇచ్చి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. కాగా.. రైతుల డిమాండ్‌ను ప్రభుత్వ పరిశీలనకు పంపిస్తామని తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు తెలిపారు.

మరిన్ని వార్తలు