లైన్ పేరిట మోసం

30 Jun, 2016 03:46 IST|Sakshi
లైన్ పేరిట మోసం

రూ.1.92 కోట్ల బంగారు ఆభరణాలతో ఉడాయింపు
నిందితుడి అరెస్ట్ రూ.75.70 లక్షల బంగారు స్వాధీనం

 
నెల్లూరు (క్రైమ్) : లైన్ బిజినెస్ పేరిట వ్యాపారులను బురిడీ కొట్టించి రూ.1.92కోట్ల బంగారు ఆభరణాలతో ఉడాయించిన నిందితుడిని మూడో నగర పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రూ.75.50 లక్షల బంగారును స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్‌హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ విశాల్‌గున్నీ నిందితుడి వివరాలను వెల్లడించారు. స్టోన్‌హౌస్‌పేట లక్ష్మీపురానికి చెందిన వల్లేటి కృష్ణసాగర్ అలియాస్ సాగర్ ఆచారివీధిలో జ్వాలాముఖి జ్యుయలరీ దుకాణం నిర్వహిస్తున్నాడు. నెల్లూరులోని బంగారు వ్యాపారుల నుంచి ఆభరణాలను తీసుకుని లైన్ బిజినెస్ చేసేవాడు. రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ  ప్రాంతాల్లోని వ్యాపారులకు ఆర్డర్లపై సరఫరా చేసేవాడు.

ఈ నేపథ్యంలో అతను వ్యసనాలకు బానిసై అప్పుల పాల య్యాడు. ఈ క్రమంలో గతనెల 26వ తేదీన నెల్లూరు మండపాల వీధిలోని సుదర్శన్ జ్యుయలరీస్, లక్ష్మీ జ్యూయలరీ యజమాని కటకం వెంకట రవికుమార్ వద్ద నుంచి 1400 గ్రాములు, పి. మణి ఆచారివద్ద 540 గ్రాములు, దినేష్‌జైన్ వద్ద 450 గ్రాములు ఇలా పలువురు వ్యాపారుల వద్ద నుంచి రూ. 1.92 కోట్లు విలువ చేసే 6.630 కేజీల బంగారు ఆభరణాలను తీసుకుని పరారయ్యాడు. బాధితుడు  రవికుమార్ ఈ నెల 3న మూడో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బుధవారం నిందితుడు లక్ష్మీపురంలోని ఇంట్లో ఉన్నాడన్న సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్ జి. రామారావు అతన్ని అరెస్ట్ చేసి రూ. 75.70 లక్షలు విలువ చేసే 2,600 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్‌చేసి సొత్తు రాబట్టుటకు కృషి చేసిన మూడోనగర ఇన్‌స్పెక్టర్ జి. రామారావు, ఎస్‌ఐ పి. రామకృష్ణ, హెచ్‌సీలు ఎస్‌కే సిరాజ్, జి. ప్రభాకర్, ఎస్‌కే షమీర్, బీవీ నరసయ్య, కానిస్టేబుల్స్ వెంకటేశ్వర్లు, ఇ. వేణుగోపాల్, జి. వేణుగోపాల్, శివప్రసాద్, పి. మహేష్, దయాశంకర్‌ను ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు.

మరిన్ని వార్తలు