పవన్‌కల్యాణ్‌ పేరుతో మోసం

15 Mar, 2017 01:15 IST|Sakshi
పవన్‌కల్యాణ్‌ పేరుతో మోసం

 పోలీసుస్టేషన్లలో బాధితుల ఫిర్యాదు

తిరుపతి క్రైం : ప్రముఖ సినీనటుడు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌  అభిమాని అంటూ నగరంలో ఓ వ్యక్తి చందాలు వసూలు చేస్తున్నాడని అలిపిరి, ఎమ్మార్‌పల్లి పోలీస్‌స్టేషన్లలో మంగళవారం పవన్‌కల్యాణ్‌ అభిమానులు నాని, మనోజ్‌ ఫిర్యాదు చేశారు. వారి   ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొన్ని రోజులుగా నగరంలో పవన్‌ కల్యాణ్‌ అభిమాని అని చెబుతూ నానికి, మనోజ్‌కు వారి స్నేహితులకు పసుపులేటి సురేష్‌ పరిచయమయ్యాడు. పవన్‌కల్యాణ్‌తో ఫొటోలు తీయిస్తామని, పవన్‌కల్యాణ్‌ తనతో సన్నిహితంగా ఉంటాడని నమ్మబలికాడు. 

మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగరంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తామని, ఇందుకోసం నగదు ఇవ్వాలని కోరాడు. ఆ మేరకు ఫిర్యాదుదారులు, వారి స్నేహితులు రూ. 27 వేలు నగదు ఇచ్చారు. తరువాత ఎటువంటి కార్యక్రమాలు చేయకపోవడంతో సురేష్‌పై అనుమానం వచ్చింది. ఫోన్‌ చేయగా స్విచ్‌ఆఫ్‌ అని వచ్చింది. దీంతో ఇంటి ఆచూకీ తెలుసుకుని వెళ్లగా ఇల్లు తాళం వేసి ఉంది. మోసపోయామని తెలుసుకుని మరో అభిమానికి ఇలా జరగకూడదని ఎమ్మార్‌పల్లి ఎస్‌ఐ ఇమ్రాన్‌బాషాకు, అలిపిరి ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డికి ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు