బెయిల్ పొందాలంటే..

9 Mar, 2016 01:55 IST|Sakshi
బెయిల్ పొందాలంటే..

 రాయవరం : తెలిసో తెలియకో.. ప్రత్యక్షంగానో పరోక్షంగానో చాలామంది వివిధ కేసులలో ఇరుక్కుంటారు. అలా జరగగానే మొదటిగా గుర్తుకు వచ్చేది బెయిల్ పొందడమెలా అని. బెయిల్ అనే పదం పోలీసులు, న్యాయవాదులు, నేరం చేసిన వాళ్లకు తెలిసిన విషయమే. ఎప్పుడూ పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కనివారికి మాత్రం అది కొత్తమాట. ఏదైనా కేసులో పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఎలా బెయిల్ పొందవచ్చనేది చాలామందికి తెలియదు. బెయిల్‌లోని రకాలు.. ఏ సందర్భంలో బెయిల్ ఇస్తారనే విషయాన్ని ఉచిత న్యాయ సలహా కేంద్రం నిర్వాహకుడు ఆర్‌వీజీ పట్నాయక్ ఇలా వివరిస్తున్నారు.
 
 బెయిల్ అంటే..!
 ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏదైనా కేసులో అరెస్టయితే వారిని నిందితులుగా భావించి పోలీసు లు కోర్టులో హాజరు పరుస్తారు. సదరు వ్యక్తులను న్యాయమూర్తి జ్యుడీషియల్ కస్టడీ(రిమాం డ్)కి తరలించడం పరిపాటి. రిమాండ్ నుంచి నిందితులకు మినహాయింపు ఇచ్చే సదుపాయా న్నే బెయిల్ అంటారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ) సెక్షన్ 436, 437, 438ని అనుసరించి నిందితులకు కోర్టు నుంచి బెయిల్ ఇస్తారు.
 
 బెయిల్‌లో రకాలు
 బెయిల్‌లో నాలుగు రకాలున్నాయి. అవి బెయిలబుల్ బెయిల్, నాన్‌బెయిల్, స్టేషన్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్.
 
 బెయిలబుల్ బెయిల్
 బెయిలబుల్ బెయిల్ అంటే నేరం చేసిన వ్యక్తికి స్థానిక న్యాయస్థానాల్లో సులభంగా దొరికే బెయిల్‌గా పేర్కొనవచ్చు. ఎవరినైనా కొట్టి గాయపర్చడం, వరకట్న వేధింపులు, చిన్నపాటి తగవులు, ప్రమాదాలు, మహిళలపై వేధింపులు, జూదాలు, ఆస్తి తగాదాలవంటి నేరాల్లో నిందితులకు బెయిలబుల్ బెయిల్ వస్తుంది. ఈ నేరాల కింద అరెస్టయిన వ్యక్తులు న్యాయవాది సహాయంతో కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు. దానిపై కోర్టులో వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి సంతృప్తి చెందితే బెయిల్ మంజూరు చేస్తారు. ఇద్దరు జామీనుదారుల హామీపై బెయిల్ ఇస్తారు. జామీనుదారులు తమ ఇల్లు, స్థలం, పొలం వంటి ఆస్తులను హామీగా పెట్టాల్సి ఉంటుంది. నిందితుడు కోర్టు వాయిదాలకు హాజరు కాకపోతే,  జామీనుదారులు బెయిల్ ఇచ్చే సమయంలో న్యాయమూర్తి విధించే పూచీకత్తు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.
 
 నాన్‌బెయిల్
 బెయిల్ ఇవ్వదగని నేరాల్లో అరెస్టయి, రిమాండులో ఉన్న నిందితులకు స్థానిక న్యాయస్థానాల్లో బెయిల్ దొరక్కపోవడమే నాన్‌బెయిల్ అంటారు. హత్య, హత్యాయత్నం, వరకట్నం వేధింపుల్లో చనిపోవడం, దోపిడీ, చంపి దోచుకోవడం, దొంగతనం, మోసం వంటి నేరాలు నాన్‌బెయిల్ కిందకు వస్తాయి. ఈ తరహా నేరాలకు పాల్పడిన నిందితులకు నేర తీవ్రతనుబట్టి స్థానిక న్యాయస్థానాలు, జిల్లా కోర్టులో మాత్రమే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. నిందితులు బెయిల్ వచ్చే వరకూ రిమాండులో ఉంటారు. నిందితుడి తరఫు న్యాయవాదులు జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ వేసి తమ వాదనలు వినిపిస్తారు. బాధితుడు పెట్టిన కేసు, అతడికి జరిగిన అన్యాయం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని నిందితునికి షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయమూర్తి మంజూరు చేస్తారు. ఈ బెయిల్‌కు కూడా ఇద్దరు జామీనుదారులు హామీగా ఉండాలి. ఇల్లు, స్థలం, పొలం వంటి వాటిని హామీగా కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది.
 
 స్టేషన్ బెయిల్
 జూదాలు, ప్రమాదాల కేసుల్లో అదుపులోకి తీసుకున్న వ్యక్తులకు పోలీస్ స్టేషన్‌లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ నేరుగా ఇచ్చే బెయిల్‌ను స్టేషన్ బెయిల్ అంటారు. సీఆర్‌పీసీ నూతనంగా చేసిన సవరణల ప్రకారం ఏడు సంవత్సరాలలోపు శిక్షలు పడే నేరాలన్నిటిలోను స్టేషన్ బెయిల్ ఇవ్వవచ్చని పేర్కొన్నారు. అయితే దొంగతనం, దోపిడీల వంటి తీవ్ర నేరాల్లో నిందితుడు సాక్షులను బెదిరిస్తాడని లేదా తప్పించుకు పోతాడని పోలీసులు భావిస్తే వారికి న్యాయస్థానాల్లో రిమాండు విధిస్తారు. ఈ బెయిల్ పొందినవారికి పోలీసులు నోటీసులు ఇచ్చి కోర్టుకు హాజరు కావాలని సూచిస్తారు.
 
 ముందస్తు బెయిల్
 యాంటిసిపేటరీ (ముందస్తు) బెయిల్ అంటే ఏదైనా నేరం చేసినవారు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచేలోగా.. అరెస్ట్ కాకుండా ఉండేందుకు కోర్టు ద్వారా పొందే బెయిల్‌ను ముందస్తు బెయిల్ అంటారు. నేరం చేయడం లేదా నేరంలో ఇరుక్కుని అరెస్ట్ కావాల్సి వచ్చిన సమయంలో జామీనుదారుల్ని ఏర్పాటు చేసుకుని కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందవచ్చు. అన్ని నేరాల్లో ముందస్తు బెయిల్ రాదు. న్యాయమూర్తి కేసు తీవ్రతను బట్టి ముందస్తు బెయిల్‌పై నిర్ణయం తీసుకుంటారు. ఒక్కొక్కసారి నిందితుడు పోలీసులకు కాని, కోర్టులో కాని లొంగిపోయి, వారి ద్వారా కోర్టుకు హాజరైతేనే బెయిల్ ఇచ్చే నిబంధనలు కూడా ఉంటాయి.
 
 స్థోమత లేక పోయినా..
 ఏదైనా నేరంలో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచిన తరువాత రిమాండ్ విధించబడి, బెయిల్ పొందడానికి స్తోమత లేనివారు ప్రభుత్వ న్యాయవాది సహాయంతో కోర్టులో వాదనలు వినిపించి బెయిల్ పొందే అవకాశం ఉంది.

 

మరిన్ని వార్తలు