అప్పు తీరుస్తాను రమ్మని.. చంపేశాడు..

27 Mar, 2016 03:39 IST|Sakshi
అప్పు తీరుస్తాను రమ్మని.. చంపేశాడు..

స్నేహితుడితో కలసి బంధువు ఘాతుకం
యువకుడు నాగేశ్వరరావు మృతి కేసును ఛేదించిన పోలీసులు

 కె.కోటపాడు: మండలంలోని కె.సంతపాలెంకు చెందిన యువకుడు అనపర్తి నాగేశ్వరరావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లిస్తానని చెప్పి దూరపు బంధువే స్నేహితుడి సాయంతో హతమార్చినట్టు తేల్చారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపి వివరాలు రాబట్టారు. కె.కోటపాడు పోలీస్‌స్టేషన్‌లో శనివారం చోడవరం సీఐ ఎస్.కిరణ్‌కుమార్ విలేకరుల ఎదుట నిందితులను ప్రవేశపెట్టి హత్య వివరాలను వెల్లడించారు.

 కె.సంతపాలెంలో నాగేశ్వరరావు నూడి ల్స్, స్వీట్లు తయారు చేసి అమ్ముతుంటాడు. ఇతనికి సబ్బవరం మండలం మల్లునాయుడుపాలెం గ్రామంలో గల జయలక్ష్మి వైన్స్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న అమరపిన్నివానిపాలెంకు చెందిన గండేపల్లి నారాయణరావు (29)తో దూరపు బంధుత్వం ఉంది. విశాఖపట్నం వెళ్లి వచ్చే సమయంలో నాగేశ్వరరావు వైన్‌షాపు వద్ద ఆగి నారాయణరావుతో మాట్లాడేవాడు. 9 నెలల క్రితం నారాయణరావు.. నాగేశ్వరరావు నుంచి రూ.9 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో నారాయణరావుకు  రైల్వేలో ట్రాక్‌మేన్‌గా ఉద్యోగం వచ్చింది.

అరకు సమీపంలోని శివలింగాపురంలో విధులు నిర్వహిస్తున్నాడు. తన అప్పు తీర్చాలని నాగేశ్వరరావు తరచూ అడిగేవాడు. దీంతో రూ.3 లక్షలు వర కూ చెల్లించగా మిగిలిన రూ.6 లక్షలు ఇస్తానని చెప్పి నమ్మించిన నారాయణరావు కె.సంతపాలెం శివారుకు ప్రాంసరీ నోట్లు, బ్యాంక్ చెక్‌ను తీసుకురావాలని ఫోన్లో సమాచారం అందించాడు. పథకం ప్రకారం నారాయణరావు తన స్నేహితుడైన పెందుర్తి మండలం నల్లక్వారీ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ కళ్లేపల్లి శివ (23) అలియాస్ సూపర్‌ను ఆశ్రయించి విషయం చెప్పి సహకారం అందించాలని అభ్యర్థించాడు. తనకు రైల్వేలో ఉద్యోగం ఇప్పించాలని గతంలో నారాయణరావును శివ కోరాడు. శివకి ఉద్యోగం ఆశ చూపి నారాయణరావు ఈ హత్యకు ఉపక్రమించేలా చేశాడు.

 16వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో గ్రామ శివారులో గల రాజుగారి లేఅవుట్ వద్ద నాగేశ్వరరావు, వీరిద్దరూ కలుసుకున్నారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన నాగేశ్వరరావును లేఅవుట్ లోపలకి తీసుకువెళ్లి మద్యం సేవిస్తూ మాట్లాడసాగారు. కొద్దిసేపు గడిచాక నాగేశ్వరరావు మద్యం తాగుతున్న సమయంలో తమ వెంట తెచ్చిన చెక్కతో శివ తొలిత తలపై మోదాడు. ఆ తర్వాత ఇద్దరూ కలసి తీవ్రంగా కొట్టారు. ప్రాణం పోయేంతవరకు కొట్టి చనిపోయాడని నిర్ధారణకు వచ్చిన తరువాత నాగేశ్వరరావు తీసుకువచ్చిన బ్యాంక్ చెక్‌తోపాటు బుక్‌ను తీసుకుని నిందితులు అక్కడ నుంచి ఆటోలో పరారు అయ్యారు.

నాగేశ్వరరావు ఆరోజు ఇంటి నుంచి బయలుదేరే సమయంలో భార్య వరలక్ష్మికి నారాయణరావును కలుసుకుని వస్తానని చెప్పి వెళ్లాడు. ఎంతకి తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితులను పట్టుకుని విచారించారు. దీంతో హత్య వ్యవహారం బయటపడింది. కె.కోటపాడు, ఎ.కోడూరు ఎస్.ఐలు వి.లక్ష్మణరావు, కరణం ఈశ్వరరావు, ట్రైనీ ఎస్.ఐ భాస్కర్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు