ఆ మృతులు... పాలమూరు బిడ్డలు

8 Jun, 2016 02:16 IST|Sakshi
ఆ మృతులు... పాలమూరు బిడ్డలు

ఆ ఇద్దరూ స్నేహితులే
మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్న శిరీష, మంజుల
‘సాక్షి’ కథనం చదివి తరలివచ్చిన వారి తల్లులు
గజ్వేల్ మార్చురీలో మృతదేహాల గుర్తింపు
కలిచివేసిన బాధితుల రోదన

గజ్వేల్: జగదేవ్‌పూర్ మండలం కొండపోచమ్మ ఆలయ గుట్టల్లో సోమవారం వెలుగు చూసిన ఇద్దరు బాలికల మృతదేహాల కేసు మిస్టరీ ‘సాక్షి’ కథనంతో వీడింది. ప్రధాన సంచికలో ప్రచురితమైన ఈ కథనం చూసి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మృతుల తల్లులు, బంధువులు గజ్వేల్‌కు చేరుకున్నారు. పోస్టుమార్టం గదిలో శవాలు చూసి తమ పిల్లలేనని గుర్తించి కన్నీరుమున్నీరయ్యారు.

మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం సూరారం గ్రామానికి చెందిన పూజరి నర్సమ్మ-చెన్నయ్య దంపతుల కూతురు శిరీష(15),  యాదమ్మ-బాల్‌రాజు దంపతుల కూతురు మంజుల ఇద్దరు స్నేహితులు. పదోతరగతి పరీక్షలు మరో మూడు మిగిలి ఉండగానే ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శవాలు కుళ్లిపోయి ఉండడంతో దాదాపు ఏప్రిల్ 3న లేదా 4వ తేదీల్లో ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాలు ఇలా...

 మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం సూరారం గ్రామానికి చెందిన పూజరి నర్సమ్మ-చెన్నయ్య దంపతుల కూతురు శిరీష(15). గత కొన్నేళ్ల క్రితం తండ్రి చెన్నయ్య మరణించాడు. వీరిది రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. నర్సమ్మ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే రెండేళ్ల నుంచి శిరీష అయ్యవారుపల్లిలోని మేనత్త యాదమ్మ ఇంట్లో ఉంటోంది. 10 కిలోమీటర్ల దూరంలోని ఫారూక్‌నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామ జెడ్పీహెచ్‌ఎస్‌లో పదోతరగతి చదివింది. యాదమ్మ-బాల్‌రాజు దంపతుల కూతురు మంజుల మొగిలిగిద్ద జెడ్పీహెచ్‌ఎస్‌లోనే చదివింది. ఈ క్రమంలో శిరీష, మంజుల క్లాస్‌మేట్స్ కావడంతో స్నేహితులుగా మారారు.

మంజుల తండ్రి బాల్‌రాజు సైతం కొన్నేళ్ల క్రితమే మరణించాడు. ఈమె తల్లి యాదమ్మ కూడా కూలి పనులు చేస్తూ శిరీషను సాకుతోంది. వీరిది కూడా పేద కుటుంబం. శిరీష, మంజుల ఇద్దరూ గత మార్చిలో పదోతరగతి పరీక్షలు రాశారు. ఏప్రిల్ ఒకటి నాటికి మరో మూడు పరీక్షలు రాయాల్సి ఉంది. ఈ క్రమంలో మంజుల ప్రేమిస్తున్న యువకుడు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఆ బాలిక తీవ్ర మనోవేదనకు గురైంది. ప్రియుడి కోసం చనిపోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని శిరీషకు వివరించింది. శిరీషకు సైతం కుటుంబీకులు ఇష్టంలేని పెళ్లిని కుదిర్చారు. దీంతో ఆ బాలిక కూడా మనస్తాపంతో ఉంది.

ఇద్దరు కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ ఒకటి నుంచి ఇళ్లల్లో చెప్పకుండా వెళ్లిపోయారు. మిగతా పరీక్షలకు కూడా హాజరు కాలేదు. ఏప్రిల్ 3న మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం కొండపోచమ్మ ఆలయం వద్దకు వచ్చారు. అక్కడి నుంచి శిరీష తన తల్లి నర్సమ్మకు ఫోన్ చేసింది. ఎక్కడున్నావని తల్లి ప్రశ్నిస్తే... అప్పరెడ్డిగూడెం వద్ద ఉన్నామని చెప్పింది. మంజుల కూడా తనతో ఉందని తెలిపింది. ‘మీకోసమే రోజూ వెతుకుతూ ఇప్పుడే  షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చాం’ అని నర్సమ్మ తెలిపింది. దీంతో శిరీష ఫోన్ కట్‌చేసింది. అప్పటి నుంచి బాలికలకు, వారి కుటుంబీకులకు ఎలాంటి సమాచారం లేదు.

ఈ క్రమంలో సోమవారం కొండపోచమ్మ ఆలయ ప్రాంగణంలోని గుట్టల్లో గుర్తు తెలియని శవాలు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ కథనం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచురితం కావడంతో.. మృతుల కుటుంబీకులు ఆ శవాలు తమ పిల్లలవేనంటూ మంగళవారం గజ్వేల్‌కు చేరుకున్నారు. ‘సాక్షి’ పత్రికలో వచ్చిన కథనం చూసి తామిక్కడికి చేరుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బాలికల శవాలను గుర్తుపట్టారు. మృతదేహాలు చూసి బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. గజ్వేల్ సీఐ సతీష్, జగదేవ్‌పూర్ ఎస్‌ఐ వీరన్నలు వారి నుంచి వివరాలు సేకరించారు. బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్న సమాచారంతో మృతదేహాలు వారివేనని దాదాపుగా నిర్ధారించారు. దీంతో కేసు మిస్టరీ వీడింది.

మరిన్ని వార్తలు