16 నుంచి తిరంగా యాత్ర

14 Aug, 2016 21:26 IST|Sakshi
16 నుంచి తిరంగా యాత్ర
భీమవరం : స్వాతంత్య్ర ఆవశ్యకతను వివరిస్తూ నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 16 నుంచి వారం రోజుల పాటు తిరంగయాత్ర నిర్వహించనున్నట్టు నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు చెప్పారు. ఆదివారం భీమవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిరంగయాత్ర వివరాలను వెల్లడించారు. 16న జాతీయజెండాలు, జాతీయ నాయకుల ఫొటోలను చేతపట్టి భీమవరంలో మోటార్‌ సైకిళ్లపై తిరంగా యాత్ర ప్రారంభిస్తామన్నారు.
రాజకీయ పార్టీలకు అతీతంగా అన్నివర్గాల ప్రజలు ఈ యాత్రలో పాల్గొని జాతీయ సమైక్యతన చాటిచెప్పాలన్నారు. 17న నరసాపురం, 18న తాడేపల్లిగూడెం, 19న పాలకొల్లు, 20న ఉండి, 21 తణుకు, 22న ఆచంటలో తిరంగాయాత్రలు నిర్వహించి బహిరంగసభలు ఏర్పాటు చేస్తామన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు జిల్లా అంతటా తిరంగ యాత్రలు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేస్తామన్నారు. అలాగే స్వాతంత్య్ర సమరయోధులను సన్మానిస్తామన్నారు. సమావేశంలో  పార్టీ నాయకులు గోకరాజు రామరాజు, అల్లూరి సాయిదుర్గరాజు, కాయిత సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
 
 
మరిన్ని వార్తలు