నేటి నుంచి ఈ–గవర్నెన్స్‌ సదస్సు

9 Jan, 2017 01:40 IST|Sakshi
నేటి నుంచి ఈ–గవర్నెన్స్‌ సదస్సు

సీఎంతో సహా పలువురు కేంద్ర మంత్రుల హాజరు

విశాఖపట్నం : 20వ జాతీయ ఈ గవర్నెన్స్‌ సదస్సు సోమ, మంగళ  వారాల్లో విశాఖలో జరగనుంది. డిజిటల్‌ ఇండియాలో భాగంగా నోవొటెల్‌ వేదికగా జరగనున్న ఈ సదస్సుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు, డాక్టర్‌ జితేంద్ర సింగ్, పీపీ చౌదరి, సుజనాచౌదరిలతో పాటు ఎంపీలు టి.సుబ్బరామిరెడ్డి, కె.హరిబాబు, కేంద్రానికి చెందిన వివిధ శాఖల   కార్యదర్శులు విజయానంద్, సి.విశ్వనా«థ్, అరుణ సుందరరాజన్, జేఎస్‌ దీపక్, ఉషాశర్మ తదితరులు పాల్గొంటున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఐటీ మంత్రులు, ఐటీ కార్యదర్శులతో పాటు 1200 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని అంచనా. ఇప్పటి వరకు కేవలం 450 మంది మాత్రమే రి జిస్ట్రర్‌ చేసుకున్నట్టు సమాచారం. రాష్ట్రానికి ఈ సదస్సు నిర్వహణ వల్ల పెద్దగా ఎలాంటి ప్రయోజనం ఒనగూరే అవకాశాలు లేకున్నప్పటికీ రూ.2.50 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది.

మొత్తం 5 ప్లీనరీ సెషన్స్‌
తొలి రోజు మూడు ప్లీనరీ సెషన్స్, రెండో రోజు రెండు ప్లీనరీ సెషన్స్‌ జరగనున్నాయి. తొలి రోజు వరుసగా ఐఓటీ అండ్‌ డాటా ఎనలిటిక్స్, సైబర్‌ సెక్యురిటీ పాలసీ ఫర్‌ ది ఫ్యూచర్, డిజిటల్‌ కనెక్టివిటీ టూ ద లాస్ట్‌ మెయిల్‌ అనే అంశాలపై సెషన్స్‌ ఉంటాయి. రెండో రోజు టెక్నాలజీ లెడ్‌ మోనటరీ ట్రాన్జ్‌క్షన్స్‌ లీడింగ్‌ టు ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూషన్, ఏపీ లీడింగ్‌ ఇండస్ట్రీ 4.0 అనే అంశాలపై చర్చించనున్నారు. 10వ తేదీ మధ్యాహ్నం 12.45 గంటలకు బహుమతుల ప్రదానోత్సవం, ముగింపు వేడుకలు జరుగుతాయి. ఈగవర్నెన్స్‌ జాతీయ సదస్సు ఏర్పాట్లను ఐటీ కార్యదర్శి విజయానంద్, జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఎగ్జిబిషన్‌ ఏర్పాట్లను పరిశీలించారు.
 

>
మరిన్ని వార్తలు