ముందు పంట..వెనక ప్లాట్లంట!

9 Aug, 2016 22:05 IST|Sakshi
ముందు పంట..వెనక ప్లాట్లంట!
  • పంట భూముల్లో అక్రమ లే అవుట్లు
  • రాత్రుళ్లు రాళ్లు పాతి ప్లాట్లు చేస్తున్న వైనం
  • కొత్త జిల్లా ప్రకటన.. అక్రమార్కులకు ‘కోట్లు’ కురిపిస్తోంది. రియల్‌ భూమ్‌ పేరుతో రాత్రికి రాత్రే వ్యవసాయ భూముల్లో అక్రమంగా ప్లాట్లు చేసి.. రూ.లక్షలు గడిస్తున్నారు.. ఎవరికీ అనుమానం రాకుండా.. ముందు నుంచి చూస్తే పొలాలు.. కొద్ది దూరం వెళితే రియల్టర్ల అక్రమ లే అవుట్లు దర్శనమిస్తున్నాయి.. ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా.. ఏజెన్సీ.. వ్యవసాయ భూముల్లో ప్లాట్లు విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.. యథేచ్ఛగా ఇంత తతంతం నడుస్తున్నా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. – కొత్తగూడెం
    కొత్త జిల్లా పుణ్యమా అని కొత్తగూడెం తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల భూముల ధరలకు రెక్కలొచ్చాయి. కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు దళారులను ఏర్పాటు చేసుకుని.. కొందరి వద్ద నుంచి తక్కువ ధరలకే భూములను కొనుగోలు చేసి.. వాటిని ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు సిద్ధం చేశారు. ఎకరం, రెండెకరాలే కాకుండా పది నుంచి ఇరవై ఎకరాల వరకు రాత్రికి రాత్రే అక్రమంగా లే అవుట్లు చేస్తున్నారు. వాటి ముందు చూస్తే పొలాల్లాగే ఉంటాయి.. కానీ.. కొద్దిదూరం లోపలికి వెళితే మాత్రం ప్లాట్లు దర్శనమిస్తాయి. వీటికి ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి లేకపోగా.. ఏజెన్సీ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. మండల పరిధిలోని పలు శివారు ప్రాంతాల్లో సైతం ఇదేవిధంగా భూములను ప్లాట్లుగా మార్చి విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే అవకాశం లేకపోయినా.. పంట భూములను విక్రయించొద్దనే నిబంధనలు ఉన్నప్పటికీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మాత్రం ఇవేమీ పట్టనట్లు తమ పని తాము చేసుకుంటున్నారు. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు పలు ప్రకటనలు చేస్తూ.. పట్టణానికి ఇన్ని కిలోమీటర్ల దూరంలో.. ఆకర్షణీయమైన ధరలు అని చెప్పుకుంటూ వ్యాపారం కొనసాగిస్తున్నారు.
    శివారులోనే అక్రమ లే అవుట్లు
    కొత్తగూడెం శివారు ప్రాంతాల్లో అక్రమ లే అవుట్లు యథేచ్ఛగా వెలుస్తున్నాయి. ఇప్పటికే చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, చాతకొండ వంటి పలు పంచాయతీల్లో అక్రమంగా భూముల విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు కొత్తగూడెం జిల్లా కేంద్రం కానుండటంతో రియల్‌ వ్యాపారులు భూముల ధరలను అమాంతం పెంచేశారు. ప్రస్తుతం రహదారి పక్కన గల భూములు ఖాళీ లేకపోవడంతో శివారు ప్రాంతాలపై కన్నేశారు. చుంచుపల్లి పంచాయతీ పరిధిలోని విద్యానగర్‌ కాలనీ, మంగపేట ప్రాంతాల్లో రాత్రికి రాత్రే అక్రమ లే అవుట్లు వెలుస్తున్నాయి. ఖమ్మం–కొత్తగూడెం ప్రధాన రహదారిలో గల బృందావనం బ్రిడ్జి పక్కన సుమారు 2 కి.మీ లోపలికి సుమారు 20 ఎకరాల భూమిని ప్లాట్లుగా మార్చి అక్రమ లే అవుట్లు చేశారు. రాత్రివేళ ఇక్కడ చెట్లను తొలగించి.. బండరాళ్లు పాతారు. ఇది పంట పొలం.. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నప్పటికీ రియల్‌ వ్యాపారులు మాత్రం ప్లాట్లుగా మార్చి యథేచ్ఛగా అమ్మకానికి పెట్టారు. మరోవైపు విద్యానగర్‌ కాలనీ లోపలికి కూడా ఇదే విధంగా మూడెకరాల్లో లే అవుట్లు చేయడం గమనార్హం.
    ఏజెన్సీ నిబంధనలకు విరుద్ధం
    ఒకవైపు ఏజెన్సీ నిబంధనలకు విరుద్ధం అయినప్పటికీ.. రియల్‌ వ్యాపారులు మాత్రం కొందరు అధికారుల అండదండలతో ఇలా అక్రమ లే అవుట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు సైతం చూసీ చూడనట్లు వ్యవహరించడం దీనికి మరింత బలం చేకూరుస్తోంది. పూర్తి ఏజెన్సీ ప్రాంతంలో ఎకరాలకు ఎకరాలు ఈ విధంగా అక్రమ లే అవుట్లు ఏర్పాటు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థంకాని పరిస్థితి. ఇటువంటి అక్రమ లే అవుట్లలో భూములు కొనుగోలు చేసిన వారు మాత్రం అయోమయానికి గురవుతున్నారు. జిల్లా కేంద్రం అయితే భూములకు మంచి ధరలు వస్తాయని ఆశపడి కొనుగోలు చేస్తున్న వారికి మాత్రం రానున్న కాలంలో ఇబ్బందులు తప్పవని పలువురు హెచ్చరిస్తున్నారు. దీనిపై తహసీల్దార్‌ అశోక చక్రవర్తిని వివరణ కోరగా.. అక్రమ లే అవుట్లపై ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తమ దృష్టికి వచ్చిన వాటిపై చర్యలు చేపడతామని వివరించారు.

మరిన్ని వార్తలు