పెద్దచెరువుకు జలకళ

3 Sep, 2016 21:25 IST|Sakshi
అహ్మదీపూర్‌ గ్రామంలోని పెద్ద చెరువు

సత్ఫలితాలనిచ్చిన ‘మిషన్‌ కాకతీయ’
హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు

గజ్వేల్‌రూరల్‌ : ‘మిషన్‌ కాకతీయ’తో చెరువులన్నీ జలకళతో పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నాయి. చెరువుల మరమ్మతుతో వాటికి పూర్వ వైభవం తెచ్చే విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్‌ కాకతీయ’తో వర్షాలకు చెరువులన్నీ నిండుకుండలా మారాయి. సీమాంధ్ర పాలనలో వట్టిపోయిన చెరువులన్నీజలకళతో సంతరించుకునేలా ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గజ్వేల్‌ డివిజన్‌లోనే రెండవ అతి ‘పెద్దచెరువు’గా పేరుగాంచిన మండల పరిధిలోని అహ్మదీపూర్‌ గ్రామంలోని ‘పెద్ద చెరువు’జలకళను సంతరించుకుంది. ఇటీవలే మిషన్‌ కాకతీయలో భాగంగా ‘పెద్ద చెరువు’పూడికతీతతో పాటు అదనపు నిధులతో మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు పనులు చేపట్టారు.

చెరువుల పునరుద్ధరణలో భాగంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 36 లక్షల నిధులు వెచ్చించగా మరోసారి పెద్ద చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి పరుస్తూ మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు అదనపు నిధులను మంజూరు చేసింది. 624 ఎకరాల ఆయకట్టు కలిగిన పెద్ద చెరువు పరిసర ప్రాంతాల బీడుభూములకు ఈ వర్షాల వల్ల మేలు చేకూరనుంది.

అంతేగాకుండా రూ. 5.73కోట్ల అదనపు నిధులతో పెద్ద చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు, చెరువు కట్ట వెడల్పుతో పాటు కట్టమీద వెలిసిన దేవాలయాలకు మరింత దార్శనిక కేంద్రాలుగా మార్చేందుకు అభివృద్ధిచేస్తున్నారు. కాగా గత మూడేళ్ల లో ఎన్నడూలేని విధంగా రెండుమూడు రోజుల క్రితం కురిసిన వర్షాలకు పెద్ద చెరువు 40శాతం నిండుకుంది.

ఈ వర్షాలతో ఆయకట్టు భూముల్లో సాగుచేసిన పంటలకు ఢోకా ఉండదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ వల్ల తమ చెరువుకే కొత్త ఆందాలు వస్తున్నాయని సంతోషం వెలిబుచ్చుతున్నారు.

మరిన్ని వార్తలు