నిధులున్నా...కరుణ లేదు!

4 Aug, 2017 21:34 IST|Sakshi
నిధులున్నా...కరుణ లేదు!

- ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల జీతాలకు నెలకిందటే విడుదలైన బడ్జెట్‌
- నాన్నెళ్లుగా వేతనాలందక అల్లాడుతున్న ఉద్యోగులు
- కుటుంబపోషణ భారమై అవస్థలు
- కలెక్టర్‌ ఆమోదం కోసం ఎదురుచూపు


 అనంతపురం ఎడ్యుకేషన్‌: ఎస్‌ఎస్‌ఏ (సర్వశిక్ష అభియాన్‌) కాంట్రాక్టు ఉద్యోగులకు నెల కిందట వేతనాల కోసం నిధులు విడుదలైనా అధికారులు కరుణ చూపలేదు. బడ్జెట్‌ రాలేదని జీతాలు పెండింగ్‌ పెడితే.. నిధులు పుష్కలంగా ఉన్న జీతాలు చెల్లించలేదు. కలెక్టర్‌ ఆమోదం కోసం నెల కిందట ఫైలు వెళ్లినా నేటికీ పరిష్కారం చూపలేదు. నాలుగు నెలలుగా జీతాలు అందక.. కుటుంబం గడవక  ఉద్యోగులు అల్లాడుతున్నారు. అంతంతమాత్రమే వేతనాలు.. అదికూడా సక్రమంగా అందక అవస్థలు పడుతున్నారు.

    జిల్లా ఎస్‌ఎస్‌ఏ పరిధిలో 63 మంది ఎంఐఎస్‌ కోఆర్డినేటర్లు, 63 మంది కంప్యూటర్‌ ఆపరేటర్లు, 357 మంది సీఆర్పీలు, 63 మంది మెసెంజర్లు, 378 మంది పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు, 126 మంది ఐఈఆర్టీలు, 12 మంది డీఎల్‌ఎంటీలు, 756 మంది కేజీబీవీల్లో సిబ్బంది పని చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు ఇస్తున్నది కూడా అరకొర వేతనాలు. ఒక్కొక్కరికి నెలకు  రూ.8 వేల నుంచి రూ.14వేలోపే అందుతోంది.  

నాన్నెళ్లుగా జీతాల్లేవ్‌ :
     కేజీబీవీల్లో పని చేస్తున్న ఎస్‌ఓలు, సీఆర్టీలు, నాన్‌టీచింగ్‌ సిబ్బందికి ఫిబ్రవరి నుంచి,  ఎమ్మార్సీ ఉద్యోగులకు మార్చి నుంచి వేతనాలు పెండింగ్‌ ఉండేవి. గతనెలలో బడ్జెట్‌ రావడంతో అందరి ఉద్యోగులకు మార్చి వరకు జీతాలు చెల్లించారు. ఆ తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో జీతాలు చెల్లించేందుకు కలెక్టర్‌ ఆమోదం కోసం ఫైలు పంపారు. మరోవైపు నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు ఆర్థికంగా  అవస్థలు పడుతున్నారు.

కుటుంబ గడవక ఉద్యోగుల అవస్థలు :
    గతంలో క్రమం తప్పకుండా ప్రతినెలా జీతాలు మంజూరు చేసేవారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలల తరబడి జీతాలు పెండింగ్‌ పెడుతున్నారు. వస్తున్న జీతాలు అంతంతమాత్రమేనని, అవికూడా సక్రమంగా ఇవ్వకపోతే ఎలా?  అని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో నిత్యం తిరగాల్సి ఉంటుందని, నెలంతా పని చేసి జీతాల కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. అప్పులు కూడా పుట్టడం లేదని వాపోతున్నారు. ఇదిలాఉండగా జీతాల చెల్లించేందుకు ఎస్‌ఎస్‌ఏలో బడ్జెట్‌ పుష్కలంగా ఉంది. గతనెలలో రూ. 6.06 కోట్లు బడ్జెట్‌ వచ్చింది. ఆ తర్వాత రూ.24 కోట్లు విడుదల చేశారు. మొత్తం రూ.30 కోట్లకు పైగా బడ్జెట్‌ ఉంది.

కలెక్టర్‌ నుంచి ఆమోదం రాగానే చెల్లిస్తాం
కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు నాన్నెళ్లుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నది వాస్తవమే. బడ్జెట్‌ పుష్కలంగా ఉంది. నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో జీతాల చెల్లింపునకు కలెక్టర్‌ ఆమోదానికి పంపాం. అక్కడ కాస్త ఆలస్యమైంది. ఆమోద ముద్ర వేయగానే జూలై వరకు బకాయి జీతాలన్నీ ఒకేమారు చెల్లిస్తాం.
– సుబ్రమణ్యం, పీఓ ఎస్‌ఎస్‌ఏ

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా