ఇదేమి తిరకాసు!

16 Jul, 2016 20:24 IST|Sakshi
ఇదేమి తిరకాసు!

- ఇసుక రీచ్‌ నిధులు తిరిగి ఇవ్వాలని ఆదేశం
- ఎంపీడీవో కార్యాలయం రూ.8 లక్షలు, మంత్రాలయం పంచాయతీ రూ.4 లక్షలు చెల్లించాలట..
- ఖర్చు చేసిన నిధులు ఎలా ఇవ్వాలని ఆందోళన


మంత్రాలయం: మూడేళ్ల క్రితం జమ చేసిన నిధులు తిరిగి చెల్లించాలంటూ మంత్రాలయం ఎంపీడీవో, మంత్రాలయం  మేజర్‌ పంచాయతీ ఆదేశ పత్రాలు జారీ అయ్యాయి. నిధులన్నీ ఖర్చు అయ్యాక ఎలా చెల్లించాలంటూ పాలకులు  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక వేలములో భాగంగా మంత్రాలయంలో 2011–12లో ఇసుక రీచ్‌ను ఎంఎస్‌  చౌడేశ్వరి మైనింగ్‌ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్‌ ఇసుక తవ్వకాల హక్కు పొందింది. మొదటి బిడ్‌ కింద రూ.1.20 కోట్లు  వేలం ద్వారా జిల్లా పరిషత్‌కు జమ చేసింది. అందులో జిల్లా పరిషత్‌కు రూ.30.16 లక్షలు (25 శాతం),  మంత్రాలయం మండల పరిషత్‌ కార్యాలయానికి రూ.60.32 లక్షలు (50శాతం), మంత్రాలయం పంచాయతీకి  రూ.30.16 లక్షలు (25 శాతం) ప్రకారం జమ చేశారు. ఈ నిధులతో వివిధ గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు,  మట్టిరోడ్లు, నీటి వసతి కల్పనతోపాటు పలు అభివృద్ధి పనులు చేశారు. నిధులు మంజూరు సమయంలో  ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. ఇసుక రీచ్‌ నిధులు ప్రస్తుతం ఖాతాల్లో చిల్లిగవ్వ లేదు.  

ఇసుక తవ్వలేదంట.. నిధులు వెనక్కు ఇవ్వాలట
చౌడేశ్వరి కంపెనీ 2011 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి  2011 మే 27వ తేదీ వరకు మొత్తం 57 రోజులు ఇసుక తవ్వకాలు  చేపట్టలేకపోయింది. ఈ మేరకు జమ చేసిన నిధుల్లో రూ.16.08 లక్షలు చెల్లించాలని జెడ్పీ సీఈఓ ఈశ్వర్‌ లేఖ  పంపారు. మంత్రాలయం మండల పరిషత్‌ రూ.8.04 లక్షలు, మంత్రాలయం పంచాయతీ రూ.4.02 లక్షలు తిరిగి  చెల్లించాలని ఆదేశించారు. మొత్తాన్ని జిల్లా పరిషత్‌ సాధారణ ఖాతాలో వేయాలని సూచించారు.
 

మరిన్ని వార్తలు