భూగర్భ జలాల అభివృద్ధికి నిధులు

12 Dec, 2016 15:01 IST|Sakshi
భూగర్భ జలాల అభివృద్ధికి నిధులు
 ఏలూరు (మెట్రో): రాష్ట్రంలో అడుగంటుతున్న భూగర్భ జలాలను అభివృద్ధి చేసేందుకు రూ.1,500 కోట్లతో 1.24 లక్షల బోరుబావులు నిర్మించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని రాష్ట్ర భూగర్భజల శాఖ డైరెక్టర్‌ కె.వేణుగోపాల్‌ చెప్పారు. పట్టణంలోని భూగర్భజల శాఖ కార్యాలయాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. జిల్లాలో భూగర్భజలాల పెంపుదలకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇటీవల కాలంలో భూగర్భజలాల వాడకం బాగా పెరిగిందని  సమృద్ధిగా ఉండే జిల్లాలో కూడా భూగర్భజలాలు తగ్గుముఖం పట్టడం ప్రమాదకర పరిణామమని ఆయన చెప్పారు. గత మే నెలలో 19.08 మీటర్ల లోతులో ఉన్న భూగర్భజలాలు వర్షాలు, పోలవరం కుడి కాలువ తదితర అంశాల వల్ల ప్రస్తుతం  17.01 మీటర్ల లోతులో ఉన్నాయన్నారు. ఆరునెలలతో పోలిస్తే 2 మీటర్లు భూగర్భజలాలు పెరిగినా గత నెలతో పోలిస్తే 0.53 మీటరు నీరు తగ్గిందన్నారు.  రాష్ట్రంలో 1.24 లక్షల బోరు బావులు నిర్మిస్తే అదనంగా 10 లక్షల ఎకరాలకు సేద్యపు నీరు అందుబాటులోకి తీసుకురాగాలని చెప్పారు. 
జిల్లాలో వినూత్న కార్యక్రమం
కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ ముందు చూపువల్ల రాష్ట్రంలోనే ప్రప్రథమంగా గోదావరి జలాలను భూగర్భంలోకి మళ్లించే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వేణుగోపాల్‌ చెప్పారు. పెదవేగి మండలం జానంపేట సమీపంలోని జగన్నాథపురంలో రైతుల సహకారంతో భూగర్భ జలాలను పెంపొందించడానికి ప్రయోగాత్మకమైన కృషి ఫలిచిందనన్నారు. త్వరలోనే 15 బోర్లు ద్వారా గోదావరి జలాలను భూగర్భంలో భద్రపరుస్తామన్నారు. జగన్నాథపురం గ్రామంలో చిలకలపూడి నరేంద్ర అనే రైతు భూమిలో  కోడూరు చెరువు ద్వారా పట్టిసీమ నీటిని మళ్లిచి ఆదర్శ రైతు పర్వతనేని బాబ్జి ఇంజక‌్షన్‌ బావికి  శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ బావిని తాము పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశామన్నారు. భూగర్భ జలశాఖ ఉపసంచాలకుడు శ్రీనివాసరావు,  జిల్లా ఉపసంచాలకుడు రంగారావు పాల్గొన్నారు.
 
 
 
మరిన్ని వార్తలు