పుష్కరాల్లో ప్రజాధనం దుబారా: నాగం

30 Aug, 2016 23:00 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం
మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉంటే పుష్కరాల పేరుతో వందలాది కోట్లు దుబారాగా ఖర్చుచేశారని, నిధుల వినియోగంపై సమగ్రంగా విచారణ జరిపించాలని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రైతులకు మూడోవిడత రుణమాఫీ నిధులు ఇప్పటివరకు అందలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని విడుదల చేసినా ఇప్పటివరకు వారి ఖాతాల్లో జమచేయలేదన్నారు. మంగళవారం స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా కోర్‌కమిటీ సమావేశానంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ప్రధాన చెరువులను నాలుగు ప్రాజెక్టుల నీళ్లద్వారా నింపాలని, రెయిన్‌ గన్స్‌ ఏర్పాటుచేసి రైతుల పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు.
  తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్‌ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగరవేయాలని కోరారు. సీఎం కేసీఆర్‌ రాజ్యాంగ విరుద్ధమైన పనులు మానుకొని ప్రజాసమస్యలపై దృష్టిసారించాలని హితవుపలికారు. బీజేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న తిరంగాయాత్ర సెప్టెంబర్‌ 17వరకు కొనసాగుతుందన్నారు. సెప్టెంబర్‌ 3వ తేదీన జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బైక్‌ర్యాలీలు నిర్వహించాలని తీర్మానించినట్లు వెల్లడించారు. జిల్లాకేంద్రంలో బహిరంగ సభ నిర్వహిస్తామని, ఈ సభకు కేంద్రమంత్రి హన్స్‌రాజ్‌ గంగారం అహైర్‌ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు వెల్లడించారు.  
 
జిల్లాల పునర్విభజన లోపభూయిష్టం
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ఆచారి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న జిల్లాల పునర్విభజన పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో 30 మండలాలున్న చోట మూడు జిల్లాలను ఏర్పాటుచేశారని, పాలమూరు జిల్లాలో మాత్రం 64 మండలాలు ఉండగా మూడుజిల్లాలను మాత్రమే ఏర్పాటు చేయడం సరికాదన్నారు. షాద్‌నగర్‌ నియోజకవర్గాన్ని శంషాబాద్‌లో కలపడం సరికాదన్నారు. షాద్‌నగర్‌ నియోజకవర్గాన్ని మహబూబ్‌నగర్‌లో ఉంచి నాలుగు జిల్లాలుగా విభజించాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా కల్వకుర్తి, కొడంగల్‌ నియోజకవర్గాలను రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగురావు నామాజీ, రాష్ట్ర కార్యదర్శి శాంతికుమార్, జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి, ప్రధానకార్యదర్శి శ్రీవర్దన్‌రెడ్డి పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు