ఈ కమిషనర్‌కూ ఓ లెక్కుంది!

13 May, 2016 08:55 IST|Sakshi
ఈ కమిషనర్‌కూ ఓ లెక్కుంది!

కార్పొరేషన్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం
గుణదల స్థలంలో గజం రూ. 25 వేలు
నేడు లాటరీ ద్వారా విక్రయం
నోటీసు జారీతో భగ్గుమంటున్న ఉద్యోగులు

 
 
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్ కాసుల వేటలో పడ్డారు. ఇందుకోసం రెండు దశాబ్దాల కిందట ఉద్యోగులకోసం గుణదలలో కొనుగోలు చేసిన ప్లాట్లను బేరం పెట్టారు. సామాన్య ఉద్యోగులకు అందుబాటులో లేని విధంగా.. బడాబాబులకు మేలుచేసేలా గజం భూమి ధర అక్షరాలా పాతిక వేలుగా నిర్ణయించారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు లాటరీ ద్వారా ప్లాట్ల విక్రయానికి కౌన్సిల్‌హాల్ వేదికగా ముహూర్తాన్ని ఖరారు చేశారు.
 
విజయవాడ :  నగరపాలక సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీసింది. ఇందుకు ఉద్యోగులనే ఎంచుకుంది.  ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని లాభనష్టాలకు అతీతంగా కేటాయించాల్సిన ప్లాట్లతో బిజినెస్ చేసేందుకు సమాయత్తమైంది. గుణదలలోని ఆ ప్లాట్లలో రూ.8,300 పలికే గజం ధరను రూ.25 వేలుగా నిర్ణయించడం ద్వారా సామాన్య ఉద్యోగులు అటువైపు కన్నెత్తి చూసే ధైర్యం లేకుండా పక్కా స్కేచ్ వేశారు. ఉద్యోగుల ముసుగులో లాటుగా స్థలాన్ని ఎగరేసుకుపోయేందుకు బిగ్‌షాట్‌లు తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారనే బలమైన ఆరోపణలున్నాయి. తాజా పరిణామాలపై ఉద్యోగవర్గాలు భగ్గుమంటున్నాయి. వారు కమిషనర్‌ను కలిసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
 
ఇలా మొదలైంది
కార్పొరేషన్ ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయులకు స్థలాలు కొనుగోలు చేయాలని 1995లో అధికారులు ప్రతిపాదన చేశారు. అదే ఏడాది సెప్టెంబర్ 26న నాటి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. గుణదలలో 57.43 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. 200 చ.మీ స్థలం ధర రూ.1,44,360, 150 చ.మీ. రూ. 1,08,270, 100 చ.మీ రూ. 72,180 గా నిర్ణయించారు. 711 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్లాట్లు విక్రయించారు. రోడ్లు, డ్రెయిన్లు, పార్కులు ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పేరుతో 2010లో రూ.8 కోట్లను కార్పొరేషన్ అధికారులు వారినుంచి వసూలు చేశారు. ఇంకా 73 ప్లాట్లు మిగిలిపోయాయి. వీటికోసం 811 మంది ఉద్యోగులు దరఖాస్తు  చేసుకుని ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు.
 
 
రియల్ బిజినెస్
ఆర్థిక సంక్షోభాన్ని సాకుగా చూపిన టీడీపీ పాలకులు గుణదల ప్లాట్లను బహిరంగ మార్కెట్‌లో విక్రయించేందుకు ప్రణాళిక రచించారు. ఈ మేరకు కౌన్సిల్‌లో తీర్మానం చేసేందుకు తెగబడ్డారు. ఉద్యోగ వర్గాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తమకు కేటాయించాల్సిన ప్లాట్లను బయటి వ్యక్తులకు ఎలా విక్రయిస్తారంటూ ఆందోళనకు దిగారు.

అనూహ్య పరిణామంతో కంగుతిన్న పాలకులు బహిరంగ వేలం ప్రక్రియకు బ్రేక్ ఇచ్చారు. తాజాగా కమిషనర్‌ను అడ్డుపెట్టుకొని లాటరీ పేరుతో రియల్ బిజినెస్‌కు ఏర్పాట్లు చేశారు. సబ్‌రిజిస్ట్రార్ వాల్యూ ప్రకారం ఆ ప్రాంతంలో గజం రూ.8,300 ఉండగా కార్పొరేషన్ ఏకంగా రూ.25 వేలు నిర్ణయించింది.  ఇది ముమ్మాటికీ వ్యాపారమే అని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

లాటరీ ప్రక్రియ ద్వారా ప్లాట్లను ఉద్యోగులకు కేటాయిస్తారు. గజానికి రూ.25 వేలు చొప్పున చెల్లించి వారు ప్లాటును పొందాల్సిఉంటుంది. అంత పెద్ద మొత్తాన్ని భరించలేక వదులుకుంటే తన్నుకుపోయేందుకు పలువురు కాచుకుని కూర్చున్నారు.
 
పోరాటం తప్పదు
 కమిషనర్ వీరపాం డియన్ తీసుకున్న నిర్ణయం ఉద్యోగులకు అన్యాయం చేసేలా ఉంది. ఆయన తన ఆలోచన మార్చుకోకుంటే ఉద్యోగుల పక్షాన నిలిచి పోరాటం చేస్తాం. మేయర్ డెరైక్షన్‌లోనే కమిషనర్ యాక్షన్ చేస్తున్నారు.
 - ఆసుల రంగనాయకులు,
 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్

మరిన్ని వార్తలు