27 నుంచి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు

22 Sep, 2017 14:09 IST|Sakshi
27 నుంచి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు

పటమట (విజయవాడతూర్పు) : సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగానికి కీలకస్థానముందని, వ్యవసాయ రంగానికి చేయూతగా ఉండే పశువులను కుటుంబ సభ్యులుగా చూసుకోవటం అనాదిగా ఆనవాయితీగా వస్తోందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ అన్నారు. గురువారం నందమూరి తారక రామారావు మెమోరియల్‌ ఆధ్వర్యంలో పటమటలంకలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు పటమటలోని వెర్టెక్స్‌ స్థలంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

27న ఆరుపళ్ల విభాగంలో, 28న వ్యవసాయ విభాగంలో, 29వ తేదీ సబ్‌జూనియర్స్, జూనియర్స్‌ విభాగంలో, 30వ తేదీ సీనియర్స్‌ విభాగంలో పోటీలు జరుగుతాయని వివరించారు. ఆయా పోటీల్లో గెలుపొందిన జతలకు నగదు పురస్కారాలు అందిస్తారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 60 జతల ఎడ్ల పేర్లు రిజిస్ట్రేషన్‌ జరిగిందని, రోజుకు 10–12 జతలకు పోటీలు జరుగుతాయని చెప్పారు. ఈ సందర్భంగా పోటీలకు సంబంధించిన బ్రోచర్‌ను ఆయన విడుదల చేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు 13వ డివిజన్‌ కార్పొరేటర్‌ చెన్నుపాటి గాంధీ, డివిజన్‌ టీడీపీ అధ్యక్షుడు అన్నాబత్తుని బాబీ, కమిటీ సభ్యులు యలమంచిలి దేవేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు