‘సభాపతి గౌరవం మంటగలిపిన కోడెల’

2 Feb, 2016 20:08 IST|Sakshi
‘సభాపతి గౌరవం మంటగలిపిన కోడెల’

రాయచోటి(వైఎస్సార్ జిల్లా): రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ సభా గౌరవాన్ని, సభాపతికి ఉన్న గౌరవాన్ని మంటగలిపిన ఏకైక స్పీకర్ కోడెల శివప్రసాద్ అని వైఎస్‌ఆర్ జిల్లా రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన రాయచోటిలో విలేకరులతో మాట్లాడారు. ఎంతో గౌరవ ప్రదమైన స్పీకర్ స్థానంలో ఉంటూ ప్రతిపక్ష నేతను విమర్శించడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. ఎప్పుడూ విలువల గురించి మాట్లాడే కోడెల.. బాధ్యతను మరిచి తన నైజం బయటపెట్టారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారని తప్పుడు ప్రకటనలిస్తున్న స్పీకర్.. ఈ ప్రభుత్వాన్ని రోడ్డున పడేయండని అనేక పర్యాయాలు పలువురు ఎమ్మెల్యేలకు చెప్పారన్నారు. స్పీకర్ పదవిలో ఉండటం వల్ల ఆయన గత చరిత్ర గురించి మాట్లాడకూడదనుకున్నా, ఆయన ఏ రకంగా ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపారో, తన ఇంటిలో బాంబులతో ఎంత మందిని చంపారో తదితర ఘటనలతో ఎలాగూ గౌరవాన్ని కోల్పోయారని చెప్పారు. అయితే తాము మాత్రం ఆ కుర్చీ గౌరవాన్ని పోగొట్టదలచలేదన్నారు.

కోడెలపై అవిశ్వాస తీర్మానం పెట్టడం కరక్టేనని ఆయన రుజువు చేసుకున్నారన్నారు. ఆయనకు ధైర్యం ఉంటే వెంటనే సభను సమావేశ పరచాలని ఆయన డిమాండ్ చేశారు. విలువల గురించి చెప్పే తమరి బాగోతం ఏమిటో ఇటీవల జాతీయ మీడియా బయట పెట్టిందన్నారు. విమాన ప్రయాణంలో ఒక ఎయిర్‌హోస్టెస్‌తో ఏ విధంగా ప్రవర్తించారో, టీవీ చానళ్లలో స్పష్టంగా ప్రసారం అయ్యిందన్నారు. ఆ ఎయిర్ హోస్టెస్ ఫిర్యాదు చేస్తే రాజకీయ పలుకుబడితో కేంద్ర విమానయాన శాఖా మంత్రి ఆశోక్ గజపతి రాజు ద్వారా ఒత్తిడి చేయించి కేసు లేకుండా చేయించుకున్న విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు.

స్పీకర్ పదవికి ఎలాగూ వన్నె తేలేరని, కనీసం ఆ పదవికి ఉన్న స్థాయిని దిగజార్చవద్దని హితవు పలికారు. ఆ సీటులో ఉన్నప్పుడు ఓపిక, సహనం ఉండాలే కానీ అవాస్తవాలు మాట్లాడుతూ పత్రికలకు ఎక్కి నిజ స్వరూపాన్ని బహిర్గతం చేసుకోవడం తగదని సూచించారు. వంగవీటి మోహన్ రంగ హత్య సమయంలో.. హోం మంత్రిగా ఉన్న కోడెల అరాచకాలు ఏమిటో ప్రపంచానికి తెలుసన్నారు. అప్పట్లో స్వయాన మంత్రిగా ఉన్న హరి రామజోగయ్య తను రాసిన పుస్తకంలో అనేక అంశాలను పేర్కొన్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజనీతిజ్ఞుడిగా వ్యవహరించాల్సిన స్పీకర్.. ఎంత మాత్రం పారదర్శకంగా ఉంటున్నారో ఒకసారి తనకు తానుగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

మరిన్ని వార్తలు