గద్వాల జిల్లా సాధించేవరకు ఉద్యమిస్తాం

29 Sep, 2016 23:19 IST|Sakshi
దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డీకే అరుణ
– ఎమ్మెల్యే డీకే అరుణ ధ్వజం
గద్వాల : నడిగడ్డ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కొంతమంది ప్రభుత్వ పెద్దలు నీతిమాలిన ఉద్యమం చేస్తుంటే, ఈ ప్రాంత టీఆర్‌ఎస్‌ నాయకులు ధర్మపోరాటం చేసేందుకు ముందుకు రాకపోవడం సిగ్గుచేటని ఎమ్మెల్యే డీకే అరుణ ధ్వజమెత్తారు. గద్వాల జిల్లా సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన చైర్‌పర్సన్‌ పద్మావతికి గురువారం సంఘీభావం తెలిపి మాట్లాడారు. గద్వాల జిల్లాపై స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు డ్రామాలు ఆడుతూ ఊసరవెల్లి రాజకీయాలు నడుపుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గద్వాల జిల్లా ఉద్యమం ఉధతం సాగుతున్నా జెడ్పీచైర్మన్‌ నోరు మెదపకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్షలపై సీఎం కేసీఆర్‌ రాజకీయాలు చేయొద్దని ఎమ్మెల్యే డీకే అరుణ సూచించారు. ప్రజా ఉద్యమాలను విస్మరిస్తే ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి నడిగడ్డ నుంచే పతనం ఆరంభమైందని జోస్యం చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రజల కోసమా..? లేక నాయకుల కోసమా అని నిలదీశారు. ఏక్‌నిరంజన్‌ కోసం సీఎం కేసీఆర్‌ నడిగడ్డ ప్రజల త్యాగాలను విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు. గద్వాల జిల్లా సాధించే వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు వీరభద్రప్ప, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, మధుసూదన్‌బాబు, వెంకటరాజారెడ్డి, రమేష్‌బాబు, రామ్‌కామ్లే, ఆనంద్, ప్రకాష్‌గౌడ్, బాలగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు