అయిజ ఎంపీపీ ఆమరణ నిరాహార దీక్ష

1 Oct, 2016 23:51 IST|Sakshi
గద్వాల : గద్వాల జిల్లా కోసం అయిజ ఎంపీపీ సుందర్‌రాజ్‌ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. శనివారం స్థానిక కృష్ణవేణి చౌరస్తాలో ఆయన దీక్షకు పూనుకున్నారు. ఈ సందర్భంగా అయిజ మాజీ జెడ్పీటీసీ తిరుమల్‌రెడ్డి, నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ రాజేశ్వరి, గద్వాల ఎంపీపీ సుభాన్, మల్దకల్‌ ఎంపీపీ సవారమ్మ, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సంఘీభావం తెలిపారు. తిరుమల్‌రెడ్డి మాట్లాడుతూ నడిగడ్డ ప్రజల ఆకాంక్ష గద్వాల జిల్లా అని పేర్కొన్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేసి సీఎం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అయిజ నగర పంచాయితీ చైర్‌పర్సన్‌ రాజేశ్వరి మాట్లాడుతూ గద్వాల జిల్లా కోసం తమ పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరించారు. గద్వాల ఎంపీపీ సుభాన్‌ మాట్లాడుతూ గద్వాల జిల్లా ఆకాంక్షను ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. 
పట్టణంలో ర్యాలీ
గద్వాల జిల్లా కోరుతూ అయిజ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్‌ చౌరస్తా నుంచి ర్యాలీ కొనసాగించారు. జై గద్వాల నినాదాలతో హోరెత్తించారు. డప్పులతో గద్వాల జిల్లా ఆకాంక్షను చాటి చెప్పారు. అనంతరం దీక్షా శిబిరానికి చేరుకొని ఎంపీపీ సుందర్‌రాజుకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరం వద్ద నిర్వహించిన పాటలు ఆకట్టుకున్నాయి. 
 
మరిన్ని వార్తలు