గజ్వేల్‌ టు దుబాయ్‌

24 Jul, 2016 08:53 IST|Sakshi
గజ్వేల్‌ టు దుబాయ్‌
  • కూరగాయలకు గిరాకీ
  • ఎగుమతికి దుబాయ్‌ ఆసక్తి
  • అధ్యయనం చేసిన అధికారులు
  • ప్రతిపాదనలకు ప్రయత్నాలుఆసియాలోనే అత్యంత నాణ్యమైన కూరగాయలు పండించే ప్రాంతంగా గుర్తింపు పొందిన గజ్వేల్‌ నేడు మరో ఖ్యాతిని మూటగట్టుకోబోతున్నది.

    ఇక్కడి కూరగాయలు త్వరలో దుబాయ్‌కి ఎగుమతి కానున్నాయి. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి సీఎం వద్దకు పంపనున్నారు. ఇప్పటికే ఇక్కడి ఉద్యానవనశాఖ అధికారి చక్రపాణి దుబాయ్‌లో ఈ నెల 14 నుంచి 20 వరకు అధ్యయనం జరిపి వచ్చారు.

    గజ్వేల్‌:మెదక్‌ జిల్లాలో ప్రస్తుతం 60 వేల ఎకరాల్లో కురగాయలు సాగవుతున్నాయి. ఆరేళ్ల కిందట ఈ సాగు విస్తీర్ణం 10 వేల హెక్టార్లు కాగా, ప్రస్తుతం ఆరింతలు పెరిగింది. గతంలో మార్కెటింగ్‌ సౌకర్యాల్లేక తక్కువగా కురగాయలను పండించిన రైతులు పెరిగిన మార్కెటింగ్‌ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.

    ప్రధానంగా గజ్వేల్, ములుగు, వర్గల్, జిన్నారం, పటాన్‌చెరు, కొండాపూర్, సదాశివపేట, సిద్దిపేట, చిన్నకోడూరు, జహీరాబాద్, నారాయణఖేడ్, రేగోడ్‌ మండలాల్లో ఈ సాగు పెరిగింది. ఆయా మండలాల్లో టమాట, వంకాయ, బెండ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఉల్లిగడ్డ, బీన్స్, ఆలుతో పాటు పందిరి రకాలు బీర, కాకర, సోర, చిక్కుడు ఎక్కువగా సాగులో ఉన్నాయి. జిల్లాలోని ఆయా ప్రాంతాల నుండి వందలాది టన్నులు హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు రాష్రీ్టయ మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి.

    నెలకు రూ.100 కోట్లకుపైగా టర్నోవర్‌ జరుగుతున్నట్లు అంచనా. పెరుగుతున్న జనాభా అవసరాలకు కురగాయలను అందించేందుకు గజ్వేల్‌ నియోజకవర్గంలో వివిధగ్రామాల్లో రిలయన్స్‌ఫ్రెష్, స్పెన్సార్, ఐటీసీ లాంటి సంస్థలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాయి. ఇక్కడ కొనుగోలు చేసిన ఉత్పత్తులను కోల్డ్‌ స్టోరేజిల్లో నిల్వ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా వున్న తమ బ్రాంచిల ద్వారా అమ్మకాలను సాగిస్తున్నాయి.

    ఈ క్రమంలో ప్రభుత్వం వంటిమామిడిలో కూరగాయల మార్కెట్‌ యార్డును ప్రారంభించడం కూరగాయల సాగుకు మరింత అనుకూలంగా మారింది.
    నాణ్యమైన ఉత్పత్తులు..
    గజ్వేల్‌లో ఉత్పత్తి చేస్తున్న తీగజాతి, సాధారణ కూరగాయలు ఆసియాలోనే నాణ్యమైనవిగా గుర్తింపు పొందాయి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన కూరగాయలను దుబాయ్‌కి ఎగుమతి చేసి రైతులకు మరింత లాభసాటిగా మార్చడానికి యత్నాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అక్కడి మార్కెట్‌లో 60 శాతం ఇక్కడి ఉత్పత్తులే ఉన్నట్టు అంచనా. తెలంగాణ ప్రాంతంలో ఉత్పత్తయ్యే బంగినపల్లి మామిడి దుబాయ్‌లోని ప్రముఖ షాపింగ్‌మాల్‌లలో ‘బేనీశా’ పేరిట విక్రయిస్తున్నారు.

    ఇది తెలుసుకున్న చక్రపాణి పూణేలోని ఫోరం ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రికల్చర్‌ డెవలప్‌మెంట్‌ సహకారంతో వెన్మహ ఆగ్రో లిమిటెడ్‌ కంపెనీ ఎండీ విజయ్‌ సిరిగిరితో కలిసి ఈ నెల 14 నుంచి 20 వరకు దుబాయ్‌లో పర్యటించారు. వీరు దుబాయ్‌లో లేమెరిడియన్, అబుదుబాయ్‌కు వెళ్లారు. అంతేకాక దుబాయ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ ప్రాంతాల్లో చర్చాగోష్టిలు, పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్లలో పాల్గొన్నారు. ఆల్‌అవీర్‌ ఫ్రూట్‌ అండ్‌ వెజిటబుల్‌ మార్కెట్, కిషోర్‌ టీరవాలే, హెడ్, ఎఫ్‌అండ్‌వీ, జైన్‌ ఇరిగేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తదితర కంపెనీలను సందర్శించారు.

    ప్రస్తుతం దుబాయ్‌లో దొరుకుతున్న కూరగాయలు, పండ్లతో పోలిస్తే తమ రైతులు మరింత నాణ్యమైన ఉత్పత్తులు తీసుకువస్తున్నారని అక్కడి యంత్రాంగానికి వివరించగలిగారు. దీంతో వారు ఉత్పత్తులను భారీగా ఎగుమతి చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. త్వరలోనే ఇక్కడ పర్యటించి ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకోవడానికి అంగీకారం తెలిపినట్లు చక్రపాణి ‘సాక్షి’కి తెలిపారు.

    ఈ విషయాన్ని రాష్ట్ర హార్టికల్చర్‌ కమిషనర్, ‘గడ’ ఓఎస్‌డీ హన్మంతరావుల ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లి ప్రతిపాదన అమలయ్యేలా చూస్తామన్నారు. ముందుగా గజ్వేల్‌ నియోజకవర్గంలో ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌పీవో)లను నెలకొల్పి... వాటి ద్వారా నాణ్యమైన కూరగాయల ఉత్పత్తులు తీసుకురావడానికి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఇప్పటికే ఉన్న వర్గల్‌ మండలం గౌరారం, సింగాయపల్లి, గజ్వేల్‌ మండలం కొల్గూరు ఎఫ్‌పీవోలను బలోపేతం చేసి కలెక్టర్‌ దత్తత గ్రామం మల్కాపూర్‌లో కొత్త ఎఫ్‌పీవో ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు