ముక్క కలిపితే కోట్లు రాలాల్సిందే..

9 Aug, 2016 23:23 IST|Sakshi
ముక్క కలిపితే కోట్లు రాలాల్సిందే..
 
– రైజింగ్‌లో అధికార పార్టీ నేత 
– తాజాగా రూ.3 కోట్ల గెలుపు
– రూ.కోటి పోగొట్టుకున్న ముఖ్య నేత సోదరుడు?
– కర్నూలు, శివారు ప్రాంతాల్లో ఆట
– హోటళ్లు, తోటలే అడ్డా
 
ఆ నేత పేక ముక్కలు కలిపితే.. అవతలి వ్యక్తి చిత్తవ్వాల్సిందే. కోరుకున్న ముక్కలు కూడబలుక్కున్నట్లు ఆయన చేతిలో ఒదిగిపోతుంటే.. ‘ఆసు’కవిత్వం కోట్లు రాలుస్తోంది. శివారు తోటలు.. నగర హోటళ్లు ఈ ఆటకు దాసోహం కాగా, నేతల నోట ఈ రైజింగ్‌ హ్యాండ్‌ చర్చనీయాంశంగా మారింది. ఇంకేముంది.. విదేశీయానాలు, ఖరీదయిన పార్టీలకు ఈ పేకాట ‘కింగ్‌’ పెట్టింది పేరు.  
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు:
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికార పార్టీ నేత పేకాట జోరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్యకాలంలో ఏకంగా రూ.3 కోట్లు గెలుచుకున్నట్టు సమాచారం. ఇందులో ముఖ్యనేత సోదరుడివే కోటి రూపాయలు ఉన్నట్టు తెలిసింది. గతంలో కూడా నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి ఆడిన ఆటలో సదరు నేత ఏకంగా రూ.70 లక్షలు గెలుచుకున్నారు. ఈ డబ్బుతోనే భారీగా పాణ్యం నియోజకవర్గంలో పార్టీ చేసుకున్నారనే గుసగుసలు అప్పట్లోనే వచ్చాయి. మరోవైపు ఊహించనిస్థాయిలో వస్తున్న ఆదాయంతో విదేశీయానాలు కూడా బాగానే చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. 
 
అన్నను ఆడించావో..
వాస్తవానికి ఈ పేకాటలో జిల్లాలోని అధికార పార్టీ నేతలందరూ పాలుపంచుకుంటున్నట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. భారీగా కోట్లలో జరుగుతున్న ఈ దందా నగరం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న తోటలతో పాటు కర్నూలులోని పెద్ద పెద్ద హోటళ్లలోనూ సాగుతోందని సమాచారం. ఇందులో వేల రూపాయలతో ఒక్కో ఆట సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యనేత సోదరుడు కూడా ఆటలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఏకంగా కోటి రూపాయలు పోగొట్టుకున్నారని సమాచారం. ఈ విషయం తెలిసిన మరో సోదరుడు.. తన అన్నతో ఆడితే ఖబడ్దార్‌ అంటూ రూ.3 కోట్లు గెలుచుకున్న మరో నాయకుడిని బెదిరించారు. మరోసారి అన్నతో ఆడినట్టు తెలిస్తే మంచిది కాదని హెచ్చరికలు కూడా జారీచేశారు.
 
అసలు ఆదాయం కంటే..
పేకాటలో రైజింగ్‌ హ్యాండ్‌లో ఉండి భారీగా సంపాదిస్తున్న సదరు నేత వాస్తవానికి ప్రస్తుతం ఉన్న పోస్టు కోసం కోట్లలోనే ఖర్చు చేశారు. ఈ పోస్టు వచ్చినప్పటికీ అంతో ఇంతో పర్సెంటేజీలు తీసుకుంటూ పనులు చేస్తున్నప్పటికీ ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో ముక్కల ఆటలో కోట్లు సంపాదించడం ప్రారంభించారు. ఫలితంగా అసలు పోస్టు ఆదాయం కంటే కొసరుగా ఈ పేకాటతో వస్తున్న ఆదాయమే బాగుందని సదరు నేత సంబరపడిపోతున్నారట. ఈ విధంగా సంపాదించిన డబ్బుతో విదేశీయానాలు కూడా బాగానే చేస్తున్నట్టు సమాచారం. సదరు నేత పాస్‌పోర్టును గమనిస్తే ఎన్ని దేశాలు తిరిగాడో తెలుస్తుందని అధికారపార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఏదో ఒక సమస్యతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న సదరు నేత.. ఇప్పుడు పేకాటతో ఏకంగా ‘కోట్లలో వ్యక్తిగా’ నిలుస్తున్నారనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద ఇంత భారీ మొత్తంలో సాగుతున్న ఈ పేకాట దందా వైపు కనీసం కన్నెత్తి చూసేందుకు పోలీసులు జంకుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
మరిన్ని వార్తలు